
మూడేళ్లలో అయిదు రెట్లకుపైగా సేల్స్
రూ.కోటికిపైగానే ఖర్చు చేసేందుకు రెడీ
ఇంటితోపాటు ఖరీదైన ఫర్నీచర్ సైతం
ఇల్లే కదా స్వర్గసీమ. అందుకే ఇంటి కోసం ఎంతైనా ఖర్చు చేసేవారు పెరుగుతున్నారు మనదేశంలో. దీంతో లగ్జరీ రియల్ ఎస్టేట్ దూసుకెళుతోంది. ఇల్లు ఒక్కటే కొంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా ప్రీమియం బ్రాండ్స్ నుంచి కిచెన్వేర్, బాత్ ఫిట్టింగ్స్, టైల్స్, ఫర్నీచర్, ఇంటీరియర్స్‌నూ కొనేస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ ‘అనరాక్’ గణాంకాల ప్రకారం భారత్‌లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు 2021 నుండి పెరుగుతున్నాయి. ఈ విభాగంలో 2021లో 22,054 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 వచ్చేసరికి విక్రయాలు అయిదురెట్లు దాటి 1,17,000 యూనిట్లకు చేరుకున్నాయి. మెట్రోల నుండి మాత్రమే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచీ ఖరీదైన గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. లగ్జరీ హౌసింగ్ పెరుగుదలతో ప్రీమియం ఫర్నీచర్‌కు కూడా డిమాండ్ అధికమైంది. సొంత ఇంటి కోసం రూ.3 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టే కస్టమర్లు వారి జీవనశైలికి సరిపోయే ఫర్నీచర్‌ను కూడా కోరుకుంటున్నారు.
కొత్త రికార్డులు
ఏటా విదేశీ టూర్లకు వెళ్లే సంపన్నులు.. కోవిడ్ సమయంలో మాత్రం దేశంలోనే ఉండిపోయారనీ, టూర్ల కోసం దాచుకున్న మొత్తంతో ఈ కుటుంబాలు ఖరీదైన కార్లు, ఇళ్లు కొనుగోలు చేశారనీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగుతోందని, ఇందుకు ఈ ఇళ్ల అమ్మకాల తీరే నిదర్శనమని అంటున్నారు. 2021తో పోలిస్తే 2022లో ఈ విక్రయాలు దాదాపు రెండున్నర రెట్లు దూసుకెళ్లాయి. 2023 నుంచి ఏకంగా 1,00,000 యూనిట్ల మార్కును దాటిపోయాయి. ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధ భాగంలో నమోదైన అమ్మకాలను బట్టి చూస్తుంటే ఈ ఏడాది సైతం మార్కెట్ జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
రీసేల్ వాల్యూ జంప్
‘మ్యాజిక్‌బ్రిక్స్’ నివేదిక ప్రకారం లగ్జరీ గృహాల్లో వినియోగిస్తున్న ఇంటీరియర్ మార్కెట్ విలువ 12.33 బిలియన్ డాలర్లు. ఏటా 12 శాతం వార్షిక వృద్ధిరేటుతో ఈ విభాగం 2030 నాటికి రెండింతలై 24.52 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా. అద్భుతంగా రూపొందించిన ఇంటీరియర్ కారణంగా ఇంటి రీసేల్ వాల్యూ 70 శాతం వరకు పెంచుతుంది. అలాగే అద్దె 45 శాతం వరకు అధికంగా పొందవచ్చని నివేదిక పేర్కొంది.
ఫర్నిచర్‌పై మోజు
ఇటీవలి కాలంలో.. ఆదాయాలు పెరుగుతున్నాయి. మరోవైపు పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. తమకు నచ్చిన ఇంటిని కొనుక్కోవాలని.. అందులోని ఇంటీరియర్‌ను తమకు నచ్చినట్టు మలుచుకోవాలన్న అభిరుచులు కూడా పెరుగుతున్నాయి. దీంతో సులభంగా వినియోగించగలిగే మల్టీ ఫంక్షనల్ ఫర్నీచర్ కోరుకుంటున్నారు. అంతేకాదు, ఖరీదైనా సరే, విదేశీ ఫర్నీచర్‌కు కూడా సై అంటున్నారు. భారత్‌లో ఇంటి యజమానులు ఇంటీరియర్స్‌ను వ్యూహాత్మక పెట్టుబడిగా చూస్తున్నారని ‘మ్యాజిక్‌బ్రిక్స్’ చెబుతోంది.
101 బిలియన్ డాలర్లకు..
దేశంలో గత ఏడాది 38 బిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 2029 నాటికి ఇది 101 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లగ్జరీ హౌసింగ్ మార్కెట్లో డిమాండ్ ప్రధానంగా 2, 3 బెడ్‌రూమ్, హాల్, కిచెన్ (బీహెచ్‌కే) విభాగంలో కేంద్రీకృతమై ఉంది. మొత్తం మార్కెట్‌లో వీటి వాటా ఏకంగా 95 శాతం. 750 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే రూ.2–5 కోట్లు పలికే మిడ్ సైజ్ ఇళ్లకు కూడా మార్కెట్ డిమాండ్‌లో 49 శాతం వాటా ఉంది.
రూ.1.5 కోట్లకుపైగానే..
2025 మొదటి ఆరు నెలల్లో దేశంలోని 14 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ‘అనరాక్ గృహ కొనుగోలుదారుల సెంటిమెంట్ సర్వే ప్రకారం’.. రూ.1.5 కోట్లకుపైగా విలువైన ఇంటిని కొనాలనుకుంటున్నవారు 22 శాతం. 2024 మొదటి 6 నెలల్లో ఇది 17 శాతమే. ముఖ్యంగా రూ.2.5 కోట్లకుపైగా బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైనవారు 10 శాతం. రూ.90 లక్షలు – రూ.1.5 కోట్ల విలువైన ఇల్లు కొనాలనుకున్నవారు ఏకంగా 36 శాతం ఉన్నారు.దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో.. దాదాపు 45 శాతం మంది 3 బెడ్‌రూమ్ హౌస్‌ల మీద ఆసక్తి చూపుతుంటే.. హైదరాబాద్‌లో ఇది 55 శాతం కావడం విశేషం. అహ్మదాబాద్ (60) తరవాత ఇదే అత్యధికం.