'హర్మన్' తుఫాన్
►ప్రపంచ కప్ ఫైనల్లో భారత్
►సెమీస్‌లో 36 పరుగులతో ఆసీస్ చిత్తు
►ఆదివారం ఇంగ్లండ్‌తో టైటిల్ పోరు
ఎప్పుడైనా చూశారా మహిళల క్రికెట్‌లో ఇంతటి వీర విహారాన్ని... మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ తీరును... ఎప్పుడైనా ఊహించారా మన అమ్మాయినుంచి ఈ తరహా మెరుపు ఆటను... అన్ని ప్రశ్నలకు తన బ్యాట్‌తోనే హర్మన్‌ప్రీత్ కౌర్ సమాధానం చెప్పింది. ఆడుతోంది ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్... అయితేనేం ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా చెలరేగిన ఆమె అద్భుతాన్ని ఆవిష్కరించింది. బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ చెలరేగిపోయి పరుగుల వరద పారించిన ఈ పంజాబ్ సివంగి భారత్‌కు అపురూప విజయాన్ని అందించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1983లో టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లో జింబాబ్వేపై కపిల్‌దేవ్ ఇన్నింగ్స్‌తో పోల్చదగిన ప్రదర్శనతో కౌర్ ఆసీస్ ఆట కట్టించింది. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో మరే భారత క్రికెటర్ కూడా సాధించని ఘనతను తన పేరిట లిఖించుకున్న హర్మన్, ఆల్‌టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. ఆరుసార్లు చాంపియన్ ఆసీస్‌ను ఇంటిదారి పట్టించి ఈ మెగా ఈవెంట్‌లో రెండోసారి ఫైనల్ చేరింది.
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు మరో చిరస్మరణీయ రోజు... అంచనాలకు అందని రీతిలో అద్భుతంగా ఆడిన మిథాలీ సేన సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్ ప్రీత్ కౌర్ (115 బంతుల్లో 171 నాటౌట్; 20 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆసీస్ భరతం పట్టింది. అనంతరం తీవ్ర ఒత్తిడి మధ్య ఆడిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ బ్లాక్‌వెల్ (56 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలాని (58 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. హర్మన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఆదివారం లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో భారత్ ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
చేతులెత్తేశారు...
భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కష్టాలు రెండో ఓవర్ నుంచే మొదలయ్యాయి. మూనీ (1)ని పాండే అవుట్ చేసి ఆ జట్టును దెబ్బ తీసింది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్ (0)ను జులన్, బోల్టన్ (14)ను దీప్తి అవుట్ చేశారు. అనంతరం విలానీ, పెర్రీ (38) నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్ల ధాటికి స్వల్ప వ్యవధిలో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది.
స్మృతి మళ్లీ విఫలం...
టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగిస్తూ స్మృతి మంధన (6) తొలి ఓవర్లోనే వెనుదిరిగింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (14) కూడా కొద్ది సేపటికే వెనుదిరిగింది. అనంతరం మిథాలీ రాజ్ (61 బంతుల్లో 36; 2 ఫోర్లు) కూడా క్రీజ్‌లో ఉన్నంత సేపు అసౌకర్యంగా కనిపించింది. చివరకు బీమ్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారత్ పరిస్థితి చూస్తే సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే ఆ తర్వాత దీప్తి శర్మ (35 బంతుల్లో 25; 1 ఫోర్) అండగా హర్మన్‌ప్రీత్ చెలరేగిపోయింది.
వీర విధ్వంసం...
గత మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించిన హర్మన్‌ప్రీత్ ఈసారి అసలైన తరుణంలో తన మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. షుట్ వేసిన 23వ ఓవర్లో మోకాళ్లపై కూర్చొని కౌర్ ఆడిన షాట్ ఇన్నింగ్స్ హైలైట్‌లలో ఒకటి. ఇదే ఓవర్లో కౌర్‌ను స్టంపౌంట్ చేసే సునాయాస అవకాశాన్ని హీలీ చేజార్చింది. ఆ సమయంలో కౌర్ స్కోరు 35. ఆ తర్వాత ఇక ఆమెను ఆపడం ఆసీస్ తరం కాలేదు. గార్డ్‌నర్ వేసిన 37వ ఓవర్లో కౌర్ పండగ చేసుకుంది. తొలి బంతికి శర్మ సింగిల్ తీయగా, తర్వాతి ఐదు బంతుల్లో కౌర్ 6, 6, 4, 4, 2 బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చివరి 10 ఓవర్లలో భారత్ ఏకంగా 129 పరుగులు సాధించడం విశేషం.
సంబరాలు లేవు!
అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ తన చిరస్మరణీయ సెంచరీ క్షణాన్ని మాత్రం ఆస్వాదించలేకపోయింది. నాన్‌స్ట్రైకర్ దీప్తి శర్మతో సమన్వయ లోపం ఆమెను తీవ్ర అసహనానికి గురి చేసింది. 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో బీమ్స్ బౌలింగ్‌లో కౌర్ మిడ్ వికెట్ దిశగా ఆడింది. వేగంగా సింగిల్ పూర్తి చేసుకున్న ఆమె, రెండో పరుగు కోసం ప్రయత్నిం చింది. దానికి దీప్తి సరిగా స్పందించలేదు. చివరకు ప్రమాదం లేకుండా ఆ పరుగు పూర్తయి కౌర్ సెంచరీ సాధించింది. అటువైపు దీప్తి కూడా రనౌట్ కాకుండా బయటపడింది. కానీ కౌర్ మాత్రం తన కోపాన్ని దాచుకోలేక సహచరిణిపై ప్రదర్శించింది. భారత ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ... ఆ సమయంలో తన ఆవేశాన్ని నియంత్రించుకోలేకపోయానని, ఆ తర్వాత దీప్తికి సారీ చెప్పినట్లు కౌర్ వెల్లడించింది.