ధనాధన్ కౌర్...
‘ఒంటి చేత్తో’ విజయం అందించడం అంటే ఏమిటో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చాలా బాగా తెలుసు! గత ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం కోసం చివరి 2 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో ఆమె ఐదో బంతిని అద్భుతమైన సిక్సర్‌గా మలచడంతో పాటు మరో రెండు పరుగులు కూడా సాధించి గాల్లో బ్యాట్ విసిరేసి సంబరాలు చేసుకుంది. ఆ సమయంలో కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న కౌర్ నొప్పిని భరిస్తూనే చివరి వరకు పట్టుదలగా ఆడి గెలిపించింది. ‘ఆ సమయంలో నన్ను నేను ధోనీలా భావించాను’ అని మ్యాచ్ అనంతరం కౌర్ వ్యాఖ్యానించింది.
కౌర్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడం, అలవోకగా బౌండరీలు, భారీ సిక్సర్లు బాదడం కొత్త కాదు. ఇది ఆమె సహజశైలి మాత్రమే. ఈ తరహా దూకుడైన బ్యాటింగ్ వల్లే బిగ్‌బాష్ జట్టు సిడ్నీ థండర్స్ హర్మన్‌ను ఏరికోరి ఎంచుకుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణి కౌర్ కావడం విశేషం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కౌర్ తొలి మ్యాచ్‌లోనే 28 బంతుల్లో 47 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె లాఫ్టెడ్ కవర్ డ్రైవ్‌ను అద్భుతమైన సిక్సర్‌గా మలచడం చూసి కామెంటరీలో ఉన్న గిల్‌క్రిస్ట్ ‘నేను చూసిన అత్యుత్తమ క్రికెట్ షాట్. ఆమె ఆటతో నేను అచ్చెరువొందాను’ అని వ్యాఖ్యానించడం విశేషం. గత ఏడాది అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై టి20ల్లో భారత్ అత్యుత్తమ లక్ష్య ఛేదనలో కూడా కౌర్ (31 బంతుల్లో 46)దే కీలక పాత్ర. టి20 క్రికెట్ ఎలా ఆడాలో కౌర్ తమకు చూపించిందని మ్యాచ్ తర్వాత ఆసీస్ కీపర్ ఎలీసా హీలీ చెప్పింది. ఇప్పుడు తాజా ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్ ఎలా ఆడాలో కూడా ఆస్ట్రేలియన్లకు హర్మన్ బాగా నేర్పించింది! తొమ్మిదేళ్ల క్రితమే భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన హర్మన్ చాలా వేగంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. 2013లో జరిగిన గత ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ కౌర్‌కు మరింత గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా ఆమె మెరుపు బ్యాటింగ్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిసాయి.
చాలా మంది భారత మహిళా క్రికెటర్ల తరహాలో హర్మన్‌కు సినిమా కష్టాలేమీ లేవు. పంజాబ్‌లోని మోగాకు చెందిన క్లబ్ స్థాయి క్రికెటర్ అయిన తండ్రి హర్మీందర్ సింగ్ భుల్లర్ ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముగ్గురు పిల్లల్లో పెద్దదైన హర్మన్ ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ కాదనలేదు. కౌర్ కెరీర్‌ను తీర్చి దిద్దడంలో స్థానిక కోచ్ కమల్దిష్ సింగ్ అన్నింటా తానై కీలక పాత్ర పోషించారు. వివిధ వయో విభాగాల్లో రాణించి పంజాబ్ జట్టులోకి వచ్చిన ఆమెకు భారత టీమ్ తలుపు తట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ను పిచ్చి పిచ్చిగా అభిమానించే కౌర్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సరిగ్గా అదే సెహ్వాగ్‌ను మరిపించింది.
బంతిని చూడటం, బలంగా బాదడమే తనకు తెలిసిన విద్య. ‘టీవీలో నేను క్రికెట్ మ్యాచ్‌లు చూసిందే సెహ్వాగ్ కోసం. అతడిని తప్ప మరే ఆటగాడిని నేను అభిమానించలేదు. అతడు ఫోర్లు, సిక్సర్లు కొట్టే శైలి నాకు చాలా ఇష్టం. ఎన్నో సార్లు వీరూ షాట్లను ఆడే ప్రయత్నం కూడా చేశాను’ అని 28 ఏళ్ల కౌర్ తన ఆటపై ఎవరి ప్రభావం ఉందో చెప్పేసింది. బిగ్‌బాష్ తర్వాత తాజాగా ఇంగ్లండ్ టి20 సూపర్ లీగ్‌లో కూడా సర్రే స్టార్స్ తరఫున ఆడే అవకాశం హర్మన్‌కు దక్కింది.
– సాక్షి క్రీడావిభాగం
‘84 మాత్రం వద్దు’
హర్మన్ ఇప్పుడు 17 నంబర్ జెర్సీ ధరిస్తోంది. అయితే కెరీర్ ఆరంభంలో ఆమె 84 నంబర్‌తో ప్రపంచ కప్ ఆడింది. ఆమె తండ్రి ఏదైనా పెట్టుకో కానీ 84 మాత్రం వద్దని చెప్పినా... అప్రయత్నంగా ఆమె రాసిన అంకె 84 కావడంతో బీసీసీఐ అదే నంబర్‌ను ఇచ్చింది. దీనికి తండ్రి చాలా బాధ పడ్డారు. 1984 అల్లర్ల సమయంలో కౌర్ తండ్రి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ సంఖ్య చూస్తే అదే గుర్తుకొస్తుంది కాబట్టి ఆయన దానిని వద్దన్నారని తర్వాత కౌర్ వివరించింది.
చాలా ఆనందంగా ఉంది. మేం గెలవడం వల్లే నా ఇన్నింగ్స్ విలువ పెరిగింది. టోర్నీకి ముందు సెమీస్ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత అది ఫైనల్‌గా మారింది. టోర్నమెంట్‌లో నాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ అవకాశాన్ని వాడుకోవాలని భావించాను. దొరికిన బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాను. నా వ్యూహం ఫలించింది.
– హర్మన్‌ప్రీత్ కౌర్
►పరుగులు 171
►బంతులు 115
►ఫోర్లు 20
►సిక్స్‌లు 7