ముంబై: వన్డే సిరీస్ వైఫల్యాన్ని అధిగమించి తొలి టి20లో ఆ్రస్టేలియా మహిళలపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడే అదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో హర్మన్‌ప్రీత్ సేన బరిలోకి దిగుతోంది. మరో వైపు సాధారణ బ్యాటింగ్‌తో ఓటమిని ఆహ్వానించిన ఆస్ట్రేలియా కోలుకొని సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. యువ పేసర్ టిటాస్ సాధు అద్భుత బౌలింగ్ ప్రదర్శన తొలి మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 19 ఏళ్ల ఈ బెంగాలీ పేసర్ మరోసారి తన జోరును ప్రదర్శిస్తే ఆసీస్‌కు కష్టాలు తప్పవు.
శ్రేయాంక, దీప్తిల ఆటతో డీవై పాటిల్ స్టేడియంలో స్పిన్నర్ల ప్రభావం కూడా బాగా కనిపించింది. పేసర్లు రేణుక, పూజ కూడా ఆకట్టుకున్నారు. బ్యాటింగ్‌లో షఫాలీ, స్మృతి మరో బ్యాటర్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఫామ్ కోల్పోయి చివరి రెండు వన్డేల్లో తుది జట్టులో అవకాశం లభించని షఫాలీ తాను ఎంత కీలకమో తొలి టి20 పోరులో చూపించింది. స్మృతి కూడా చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించింది. జెమీమా, హర్మన్ కూడా చెలరేగితే బ్యాటింగ్‌లో తిరుగుండదు. జట్టుపరంగా చూస్తే ముఖ్యంగా వన్డేలతో పోలిస్తే ఫీల్డింగ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది.
మరో వైపు ఆ్రస్టేలియా జట్టు అనూహ్య రీతిలో తడబడింది. టి20ల్లో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆ జట్టు ఆలౌట్ కావడం భారత బౌలర్ల పైచేయిని చూపించింది. సీనియర్ బ్యాటర్లు ఉన్న టాప్–5లో పెరీ మినహా అంతా విఫలమయ్యారు. అయితే హీలీ, మూనీ, తహీలా, గార్డ్‌నర్ రాణిస్తే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. వన్డే సిరీస్‌లో అద్భుత ఆటను చూపించిన లిచ్‌ఫీల్డ్ టి20 మ్యాచ్‌లో కూడా సత్తా చాటడం ఆసీస్‌కు సానుకూలాంశం. ఆమె ఆడిన కొన్ని చక్కటి షాట్లు లిచ్‌ఫీల్డ్ సామర్థ్యాన్ని చూపించాయి. గత మ్యాచ్‌లో పూర్తిగా కట్టు తప్పిన ఆసీస్ బౌలింగ్ ఈ సారి ఎంత ప్రభావం చూపిస్తుంననేది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment