హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ముందుకెళ్లేందుకు మంచి అవకాశాలున్నాయి. వీటిని మెరుగుపర్చుకోవాలంటే మంగళవారం జరిగే మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు... బంగ్లాదేశ్‌పై తప్పకుండా గెలవాలి. గత మ్యాచ్‌లో ఓపెనర్లు, బౌలర్ల వైఫల్యంతో భారత్‌కు పటిష్టమైన ఆస్ట్రేలియాతో చుక్కెదురైంది. ఫలితం నిరాశపరిచినప్పటికీ సీనియర్ బ్యాటర్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడం జట్టుకు శుభ పరిణామం. కీలక తరుణంలో వీళ్లంతా ఫామ్‌లో ఉంటే ఒక్క సమష్టి ప్రదర్శన ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. ఓపెనింగ్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మలు కూడా రాణిస్తే ప్రత్యర్థిపై భారీ స్కోరు సాధ్యమవుతుంది. దీంతో పాటు బౌలర్లు కూడా బాధ్యత తీసుకుంటే జట్టు విజయానికి బాట పడుతుంది. ‘సెమీస్’ చేజారకుండా ఉంటుంది.
కొత్త ఉత్సాహంతో...
మిథాలీ సేన వరుసగా ఓడిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇంగ్లండ్‌తో బ్యాటర్ల వైఫల్యం, ఆస్ట్రేలియాతో పసలేని బౌలింగ్ జట్టు ఫలితాలను మార్చేసింది. ఇప్పుడు ఈ లోపాలపై దృష్టిపెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్... జట్టుపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేసే పనిలో పడింది. వెటరన్ సీమర్ జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌లు వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ఇరకాటంలో పడేస్తే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ దాకా మన బ్యాటర్స్ పరుగులు సాధిస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించొచ్చు. మరో వైపు బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క పాకిస్తాన్‌పై మాత్రమే గెలిచి మూడు పరాజయాలతో రేసుకు దాదాపు దూరమైంది.
ఆ గెలిచిన మ్యాచ్ మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో బంగ్లా అత్యధిక స్కోరు 175. ఇలాంటి ప్రత్యర్థితో భారత్‌కు గెలుపు ఏమంత కష్టం కాదు. తర్వాత ఈ నెల 27న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో మిథాలీ సేన పొరపాటున ఓడినా కూడా మూడు విజయాలతో సెమీస్ రేసులో ఉంటుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ అనూహ్యంగా పాక్ చేతిలో ఓడిపోవడం భారత్ కలిసొచ్చింది. మూడు విజయాలతో రేసులో ఉన్న విండీస్ రన్‌రేట్ దారుణంగా ఉంది. మంచి రన్‌రేట్ ఉన్న భారత్... బంగ్లాపై గెలిస్తే మరింత మెరుగవుతుంది. దీంతో రన్‌రేట్‌తో ముందంజ వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment