ఇంగ్లండ్... కాచుకో! | ‘England unstoppable at the moment but can’t write India off’ | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్... కాచుకో!

Published Sat, Jul 22 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

ఇంగ్లండ్... కాచుకో!

ఇంగ్లండ్... కాచుకో!

మిథాలీ రాజ్‌ సవాల్‌
ఆతిథ్య జట్టుకు అంత సులువు కాదన్న భారత కెప్టెన్‌


డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ఇదే ఊపులో తొలిసారి విశ్వ విజేతగా నిలవాలని మన జట్టు పట్టుదలగా ఉంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌కు తమ నుంచి గట్టి పోటీ తప్పదని భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. భారత్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉందని ఆమె, ఆతిథ్య జట్టును హెచ్చరించింది. టోర్నీ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 35 పరుగులతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.

‘ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఆడబోవడంపై మా జట్టు సభ్యులందరూ ఉద్వేగానికి లోనవుతున్నారు. ఈ టోర్నీ కష్టమైనదని మాకు తెలుసు. కానీ జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలో అందరూ తమ సత్తా చాటారు. కాబట్టి ఫైనల్లో  మమ్మల్ని ఓడించడం ఇంగ్లండ్‌కు అంత సులువు కాదని గట్టిగా చెప్పగలను. ఆ రోజు ఎలా ఆడతామన్నది ముఖ్యం. మాతో ఓడిన తర్వాత ఆతిథ్య జట్టు ఆట కూడా మారింది కాబట్టి ఈ మ్యాచ్‌ కోసం మా వ్యూహాలు మార్చుకోవాలి. దీని కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం’ అని మిథాలీ చెప్పింది.

మహిళల క్రికెట్‌ రాత మారుతుంది...
భారత జట్టు ప్రపంచ కప్‌ గెలిస్తే అది దేశంలో మహిళా క్రికెట్‌ దశ, దిశను మార్చగలదని మిథాలీ అభిప్రాయపడింది. ‘మేం లార్డ్స్‌లో విజయం సాధిస్తే అది గొప్ప ఘనత అవుతుంది. సరిగ్గా చెప్పాలంటే మహిళల క్రికెట్‌లో విప్లవంలాంటిది రావచ్చు. మహిళలు కనీసం ఒక ఐసీసీ టోర్నీ అయినా గెలవాలని ఇప్పటి వరకు అంతా చెబుతూ వచ్చారు. దానికి ఇప్పుడు ఇదే సరైన వేదిక. భారత్‌ గెలిస్తే ఆ ఘనతను వర్ణించేందుకు నాకు మాటలు చాలవేమో’ అని ఈ హైదరాబాద్‌ అమ్మాయి పేర్కొంది. సెమీస్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లుగా కూడా చాలా బాగా ఆడారని సహచరిణులపై మిథాలీ ప్రశంసలు కురిపించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ సమయంలో కండరాల గాయంతో బాధపడిన హర్మన్‌ప్రీత్‌ కోలుకుంటుందని మిథాలీ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రపంచ కప్‌ ఫైనల్లో బరిలోకి దిగాలని హర్మన్‌ కూడా పట్టుదలగా ఉంటుందని నేను చెప్పగలను. ఇది జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం. మేమందరం కూడా ఈ మ్యాచ్‌ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం’ అని మిథాలీ తన మనసులో మాట చెప్పింది.

హర్మన్‌ ఇంట్లో సంబరాలు...
ప్రపంచ కప్‌ సెమీస్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ స్వస్థలం మోగా (పంజాబ్‌)లో గురువారం రాత్రి నుంచి వేడుకలు కొనసాగాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున పండగ వాతావరణం ఉండగా, ఆ ఊర్లోని మిత్రులు, సన్నిహితులు కూడా పంజాబీ సాంప్రదాయ నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. తమ కూతురి ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నామని... ఆడపిల్లను సరిగ్గా ప్రోత్సహిస్తే అద్భుతాలు జరుగుతాయని ఆమె నిరూపించిందని హర్మన్‌ తల్లిదండ్రులు హర్మందర్‌ సింగ్‌ భుల్లర్, సతీందర్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. సెహ్వాగ్‌ శైలిలో బ్యాటింగ్‌ చేసే హర్మన్, మైదానంలో కోహ్లి తరహాలో దూకుడుగా వ్యవహరిస్తుందని ఆమె సోదరి హేమ్‌జిత్‌ కౌర్‌ చెప్పింది. తన తోటి అమ్మాయిలు సరదాగా గడుపుతున్నా, వాటికి దూరంగా కఠోర సాధన చేసిన హర్మన్‌ శ్రమ ఫలితాన్ని ఇచ్చిందని ఆమె వెల్లడించింది.

బీసీసీఐ అభినందన
ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేసిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. టోర్నీలో నిలకడగా రాణించిన మిథాలీ బృందాన్ని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి అభినందించారు. హర్మన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన... ఫైనల్‌ మ్యాచ్‌ కోసం జట్టుకు బెస్టాఫ్‌ లక్‌ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement