వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌ల చివరి దశలో ఒక ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు బలమైన ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు సన్నద్ధమయ్యాయి. ఒక్క ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న టీమిండియా ఒక వైపు...అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడినా మిగతా అన్ని మ్యాచ్‌లలో తమ బలాన్ని చూపించిన సఫారీ బృందం సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి. ఈడెన్‌గార్డెన్స్ పోరులో భారత్, దక్షిణాఫ్రికాలలో ఎవరు విజేతగా నిలుస్తారనేది చూడాలి.
కోల్‌కతా: ఎదురు లేని ఆటతో వరుసగా ఏడు విజయాలు సాధించిన రోహిత్ సేన ఇప్పుడు ఎనిమిదో మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ ఎదుర్కొంటుంది. టోర్నీలో ఉన్న ఇతర బలమైన జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లనుంచి ఎలాంటి పోటీ లేకుండా అలవోక విజయాలు అందుకున్న టీమిండియాకు సెమీస్‌కు ముందు దక్షిణాఫ్రికా రూపంలో మరో పెద్ద జట్టు నిలబడింది.
మరో వైపు అసాధారణ ఆట కనబరుస్తున్న సఫారీ కూడా అంతే స్థాయిలో గట్టి పోటీకి సవాల్ విసురుతోంది. నేడు విరాట్ కోహ్లి 35వ పుట్టిన రోజు. ఈ రోజున వన్డేల్లో తన 49వ సెంచరీ సాధించి దిగ్గజం సచిన్ రికార్డును సమం చేస్తాడా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మార్పుల్లేకుండా...
భారత జట్టుకు సంబంధించి కించిత్ కూడా ఆందోళన కలిగించే అంశం లేదు. ఏడు విజయాల్లోనూ జట్టు సభ్యులంతా తమ వంతు పాత్ర పోషించారు. గత మ్యాచ్‌కు ముందు వరకు అయ్యర్ బ్యాటింగ్, సిరాజ్ వికెట్లు తీయకపోవడం కొంత సమస్య అనిపించినా...శ్రీలంకతో పోరులో ఆ బెంగా తీరింది.
టాప్–3లో రోహిత్, గిల్, కోహ్లి చెలరేగుతుండగా....మిడిలార్డర్‌లో అయ్యర్, రాహుల్, సూర్యల జోరుతో భారత్ దూకుడు సాగుతోంది. పేసర్లు బుమ్రా, సిరాజ్, షమీ ఒకరితో మరొకరు పోటీ పడి బౌలింగ్ చేస్తుండగా...కుల్దీప్, జడేజా స్పిన్‌ను సఫారీ బ్యాటర్లు ఏమాత్రం ఎదుర్కోగలరనేది చూడాలి.
అంతా ఫామ్‌లో...
టోర్నీలో ఆరు మ్యాచ్‌లు గెలిచిన దక్షిణాఫ్రికా పాక్‌తో చివరి వరకు కాస్త తడబడగా, అనూహ్యంగా డచ్ చేతిలో ఓడింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఐదు సార్లు ఆ జట్టు సాధించిన స్కోర్లు వారి బ్యాటింగ్ బలమేంటో చూపించాయి. 428, 311, 399, 382, 357...ఇలా నమోదు చేసి అన్నింటిలో కనీసం వంద పరుగుల తేడాతో సఫారీ టీమ్ నెగ్గింది.
ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించిన డికాక్ ఒకే టోర్నీలో అత్యధిక శతకాల (5) రోహిత్ రికార్డు కోసం సన్నద్ధమయ్యాడు. బవుమా మినహా డసెన్, మార్క్‌రమ్, మిల్లర్, క్లాసెన్ చెలరేగిపోతున్నారు. ఇక రబడ, ఎన్‌గిడి, కొయెట్జీ, జాన్సెన్‌లతో కూడిన పేస్ దళంకు ఈడెన్ గార్డెన్స్ బౌన్సీ పిచ్‌పై కాస్త అవకాశం దొరికితే తిరుగుండదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెపె్టన్), డికాక్, డసెన్, మార్క్‌రమ్, మిల్లర్, క్లాసెన్, జాన్సెన్, రబడ, మహరాజ్, ఎన్‌గిడి, కొయెట్జీ
పిచ్, వాతావరణం
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమతుల్యత ఉన్న పిచ్. ఇద్దరికీ మంచి అవకాశం ఉంది. వర్షసూచన లేదు కానీ మంచు ప్రభావం చూపించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment