
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా వ్యూహం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధినేత పుతిన్‌కు ఫోన్‌చేసి ఆరా తీశారంటూ నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రుటే చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం ఖండించారు. రుటే వ్యాఖ్యలు ఆధారరహితం అని తేల్చిచెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహం పట్ల మోదీ ఆసక్తి కనబర్చారని, ఇటీవల పుతిన్‌కు ఫోన్ చేసి ఆరా తీశారని మార్క్ రుటే చెప్పడం సంచలనం సృష్టించింది. జరగని సంభాషణ జరిగినట్లు మార్క్ రుటే ప్రకటించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ«దీర్ జైస్వాల్ అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని రుటేకు హితవు పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా వ్యూహం గురించి మోదీ తెలుసుకోలేదని స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంటామని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దని సూచించారు. రష్యా నుంచి పశ్చిమ దేశాలు కూడా ముడి చమురు కొంటున్నాయని రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా గుర్తుచేశారు.