భారీ బడ్జెట్ చిత్రాలు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌! | Guntur Kaaram to Kanguva Biggest Disasters at Box Office In 2024 | Sakshi
Sakshi News home page

Disasters at Box Office 2024: భారీ బడ్జెట్ చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్!

Published Tue, Dec 31 2024 3:15 PM | Last Updated on Tue, Dec 31 2024 3:39 PM

Guntur Kaaram to Kanguva Biggest Disasters at Box Office In 2024

కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో పాటే మనం పరిగెత్తాల్సిందే కానీ నీకోసం ఈ ప్రపంచంలో ఏది వేచి ఉండదు. అలా కర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కాలం. చూస్తుండగానే మరో ఏడాది కనుమరుగవుతోంది. ఈ కాలమనే భూగర్భంలో 2024 కలిసిపోనుంది. కొత్త ఆశలతో మరో ఏడాది అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ ఏడాది అయినా సక్సెస్ సాధించాలని కోరుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. మరి  ఈ ఏడాది సినీ పరిశ్రమకు కలిసొచ్చిందా? లేదా? అనేది చూద్దాం.

మరి ఈ ఏడాది సినీ పరిశ్రమ కొంతవరకు సక్సెస్‌ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్తీ-2 లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరికొన్ని బాక్సాఫీస్  బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం ‍అనూహ్యంగా చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. మరి 2024లో విడుదలై బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో మనం ఓ లుక్కేద్దాం.
 

ఇండియన్-2- నిరాశపరిచిన సీక్వెల్

28 ఏళ్ల క్రిత శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ఇండియన్(భారతీయుడు). ఈ మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కమల్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. కమల్ హాసన్ నటనతో మెప్పించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

సూర్య కంగువా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్‌ల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన  ఈ చిత్రం కేవలం రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్‌ అద్భుతంగా ఉన్నప్పటికీ ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది.


రామ్ పోతినేని- డబుల్ ఇ‍స్మార్ట్ సీక్వెల్

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్‌ కాంబోలో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్‌ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అదే కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇ‍స్మార్ట్‌ పేరుతో సీక్వెల్‌ను తీసుకొచ్చారు పూరి జగన్నాధ్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ నటన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా పేరును దక్కించుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.

మోహన్ లాల్- మలైకోట్టై వాలిబన్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ మూవీ మలైకోట్టై వాలిబన్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం వీజువల్ ఫీస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కథ, మోహన్ లాల్ నటన మెప్పించినప్పటికీ స్క్రీన్‌ప్లే మైనస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వాలిబన్ అనే ఓ యోధుని కథ ఆధారంగా ఈ మూవీని తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించారు.


మహేశ్ బాబు- గుంటూరు కారం

ఈ ఏడాది సంక్రాంతికి రీలీజైన టాలీవుడ్ చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈచిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గతంలో సూపర్ హిట్స్ కావడంతో అదేస్థాయిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా అభిమానులను ఆకట్టుకుంది.

మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, క, వాజై,  మెయిజగన్ వంటి చిత్రాలు పెద్ద కమర్షియల్ హిట్ సాధించాయి. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement