
నాలో విప్లవ విత్తనాన్ని నాటింది రైతే
► చర్చా వేదికలో కమల్‌హాసన్
తమిళసినిమా (చెన్నై): తనలో విప్లవ విత్తనాన్ని నాటింది రైతే అని నటుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఇటీవల తమిళ రాజకీయాల్లో కమల్‌హాసన్ కీలకంగా మారారు. తమిళనాడులో అవినీతి పాలన నడుస్తోందని ఆయన చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్నే రేపాయి. పని చేయని శాసనసభ్యులకు జీతాలు ఇవ్వరాదంటూ ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయరంగ ప్రవేశం తథ్యమని ప్రకటించి తమిళనాట ప్రకంపనలు పుట్టిస్తున్న కమల్ ఆదివారం చెన్నైలో జరిగిన ఒక చర్చా వేదికలో పలు విషయాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతులనే వారు పోరాడేవారే కానీ, ఆకలితో మరణించేవారు కాదన్నారు.
‘అనూహ్యంగా నా కోపానికి కారణం ఏమిటి.. 62 ఏళ్ల వయసులో రాజకీయ ఆశ ఎందుకు? కూతుళ్లకు ఆస్తులు కూడబెట్టడానికా? అవినీతి గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.. అప్పుడేమయ్యారు? అని అడగవచ్చు. అప్పట్లో నాకు భయం ఉండేది. ఇప్పుడు ధైర్యం వచ్చింది’’ అని కమల్ పేర్కొన్నారు.