హైదరాబాద్: డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తూ బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఐటీ రంగ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. జేఎన్టీయూలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఏర్పాటు చేసిన తెలంగాణ డిజిథాన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. కంప్యూటర్ బేసిక్స్‌పై అవగాహన కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, యువతలో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డిజిటల్ లిటరసీ దోహదపడుతుందన్నారు.
ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. పేదరికాన్ని పోగొట్టే ఆయుధంగా డిజిటల్ లిటరసీ ఉపకరిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు. 90శాతం గ్రామీణ ప్రజలు, 40శాతం పట్టణ ప్రాంత ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత లేదన్నారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం బాధ్యతాయుతమైన వ్యక్తులు చేస్తేనే ఆశించిన ఫలితాలను పొందగలమన్నారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి జరిగితేనే అవకశాలు పెరిగి అవినీతి తగ్గుతుందని, డిజిటల్ లిటరసీని పెంచడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు.
టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. ట్రెయిన్డ్ ట్రెయినీస్ ప్రోగ్రామ్‌గా డిజిథాన్‌ను రూపొందించామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ రెక్టార్ కిషన్‌కుమార్‌రెడ్డి, ఐఎస్‌టీ డెరైక్టర్ గోవర్థన్, టీటా ప్రతినిధులు మాధవి, సౌమ్య, మోహన్, వివేక్, ప్రదీప్, విజయ్, రామ్‌కుమార్, టీటా గౌరవాధ్యక్షుడు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంగా డిజిటల్ తెలంగాణ
Published Thu, Aug 27 2015 10:53 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM
Advertisement