నిరసన కాదు.. విప్లవం: హీరో విశాల్
జల్లికట్టును అనుమతించాలంటూ చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నది కేవలం నిరసన కాదని, అదో విప్లవమని కోలీవుడ్ హీరో విశాల్ అన్నాడు. చెన్నై మెరీనా బీచ్‌లో వినిపిస్తున్న గొంతులు కేంద్రాన్ని చేరుకోవాలని, అప్పుడైనా కేంద్రం ఆర్డినెన్సు జారీ చేయాలని అన్నాడు. జల్లికట్టుకు అనుమతి కోసం చెన్నైలో మొదలైన నిరసన ప్రదర్శనలు.. ఢిల్లీ వరకు వెళ్లాయి. ప్రస్తుతం చెన్నైలో సినిమా షూటింగులు కూడా ఆపేయడంతో పలువురు నటులు ఢిల్లీకి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నం చేశారు. సీఎం వరకు మోదీ అపాయింట్‌మెంట్ దొరికినా, పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్‌కు మాత్రం దొరకలేదు. దాంతో ఆయన ప్రధాని అధికారిక నివాసం ముందు బైఠాయించారు. మోదీ తనకు సమయం ఇవ్వలేదని, ఆయన తనను కలిసేవరకు ఇంటి బయట కూర్చోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని రాందాస్ అన్నారు. అయితే.. మోదీ ఇంటి ముందు బైఠాయించిన ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.