ఉద్యమం ఆపేయండి: రజనీకాంత్
జల్లికట్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి జరిగిన ప్రయత్నాలు, అందులో జరిగిన హింసాత్మక ఘటనలపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఉద్యమాన్ని వదిలిపెట్టి, ప్రశాంతంగా మెరీనా బీచ్ నుంచి వెళ్లిపోవాలని ఆయన కోరారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న చారిత్రక ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రయత్నాలను అభినందిస్తున్నానంటూ ఆయన ఒక లేఖను ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖ న్యాయవాదులు, రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చినందువల్ల ప్రస్తుతానికి వాళ్ల మాటల మీద గౌరవం ఉంచి, తమ హామీని వాళ్లు నెరవేర్చుకునేవరకు వేచి చూడటమే మంచిదని ఆయన ఆ లేఖలో చెప్పారు.
ఈ చారిత్రక ఘటనను కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయని, వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఇన్నాళ్లూగా పడిన కష్టం, చేసిన ప్రయత్నాలు, వాటివల్ల యువతకు వచ్చిన గౌరవం వృథాగా పోకూడదని ఆయన అన్నారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పోలీసు బలగాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా సంయమనం పాటించాలని రజనీకాంత్ కోరారు.
pic.twitter.com/twjA7TNPLA
— Rajinikanth (@superstarrajini) 23 January 2017