
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ‘వాట్సాప్ కాల్స్’ దాదాపు ఉచితమనే విషయం తెల్సిందే. అలాంటి వాట్సాప్ కాల్స్ మీద పన్ను విధించాలని లెబనాన్ ప్రభుత్వం గత అక్టోబర్ 17వ తేదీన నిర్ణయించడంతో ప్రజల్లో విప్లవం రాజుకుంది. అదే రోజు రాత్రి లక్షలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ముస్లింలు, క్రైస్తవులు, డ్రజ్, అలవైట్స్ సహా మొత్తం 18 జాతుల ప్రజలు వాటిల్లో పాల్గొనడం ఓ విశేషం కాగా, అందరూ జాతీయ జెండాలనే ధరించడం మరో విశేషం.
అలా రాజుకున్న ప్రజాందోళన ఆదివారం నాటికి (అక్టోబర్ 20) మరింత తీవ్రమైంది. లక్షలాది మంది ప్రజలు వీధుల్లో కదంతొక్కారు. 2005లో జరిగిన ప్రజా ప్రదర్శన తర్వాత అంతటి భారీ ప్రదర్శనగా దీన్ని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రదర్శన పర్యవసానంగా ‘వాట్సాప్ కాల్స్’పై పన్ను విధించాలనే ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ఆ మరుసటి రోజు సోమవారం నాడు లెబనాన్ సంకీర్ణ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో నానాటికి పెరిగి పోతున్న అవినీతిని అరికట్టేందుకు ఓ ప్యాకేజీని కూడా ప్రకటించింది. అయినప్పటికీ ప్రజల ప్రదర్శనలు కొనసాగడంతో సున్నీ తెగకు చెందిన ఇస్లాం ప్రధాన మంత్రి సాద్ హారిరి తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన రాజీనామా పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రజలు అదే పోరాట స్ఫూర్తితో దేశ (క్రైస్తవ) అధ్యక్షుడు మైఖేల్ అవున్, పార్లమెంట్ (షియా) స్పీకర్ నబీ బెర్రీ సహా యావత్ ప్రభుత్వం రాజీనామా చేసే వరకు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించి నేటికి బీరుట్, ట్రిపోలి, ఇతర నగరాల్లో భారీ ఎత్తున ప్రదర్శనలు జరుపుతున్నారు. 1943లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం సాధించిన లెబనాన్ భిన్న జాతుల దేశంగా ఆవిర్భవించింది. ప్రధానంగా మెజారిటీలైన ముస్లింలలో నాలుగు జాతులు, ఆ తర్వాత స్థానంలో ఉన్న క్రైస్తవుల్లోని ఏడు జాతులు సహా మొత్తం 18 జాతుల ప్రజలు ఉన్నారు. దాంతో వారి మధ్య వైషమ్యాలు పెరిగాయి. ఫలితంగా 1970 నుంచి 1990 వరకు దేశంలో అంతర్యుద్ధం కొనసాగింది. జాతుల మధ్య పదవుల పంపకాలతో నాటి అంతర్యుద్ధానికి తెరపడింది. ఆ ఒప్పందం మేరకు లెబనాన్‌లో మెజారిటీలైన సున్నీలకు ప్రధాని పదవిని, క్రైస్తవులకు దేశాధ్యక్ష పదవిని, షియా ముస్లింలకు పార్లమెంట్ స్పీకర్, డ్రజ్ జాతీయులకు డిప్యూటీ స్పీకర్, ఇతర జాతుల వారికి ఇతర పదవులను రిజర్వ్ చేశారు.
ఏ జాతి నాయకులు, తమ జాతి ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ రావడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరవడి అభివద్ధి కుంటుపడింది. ప్రభుత్వంలో అవినీతి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ అవినీతికి వ్యతిరేకంగా ‘వాట్సాప్’లో ప్రచారం పెరిగింది. కాల్స్ ఉచితం అవడంతో ప్రజల మధ్య అవినీతికి వ్యతిరేకంగా ఐక్యత పెరిగింది. వాట్సాప్ కాల్స్‌పై పన్ను విధించడం ద్వారా ప్రజా వ్యతిరేకతను అణచివేయాలని ప్రభుత్వం భావించింది. అదే ప్రజాగ్రహానికి కారణమై వారిని విప్లవం దిశగా నడిపిస్తోంది.