వ్యవసాయానికి ‘రివల్యూషన్’
పంతంగి రాంబాబు - సాగుబడి డెస్క్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. ‘ఏ రంగమైనా ఆగుతుంది, వ్యవసాయ రంగం మాత్రం కాదు..!’ అని చెప్పారు. ఈ 70 ఏళ్లలో ఇది చాలా వరకు వాస్తవ రూపం దాల్చింది. నెహ్రూ ప్రభుత్వం తొలి పంచవర్ష ప్రణాళిక (1951-56)లో వ్యవసాయ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. తొలినాళ్లలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి జరిగినా.. సాంకేతికత వినియోగం, యాంత్రీకరణ మాత్రం ఇటీవలి దశాబ్దాల్లో బాగా పెరిగింది. దేశంలో పొలం దున్నడానికి, దమ్ము చేయడానికి పశువులనే చాలా కాలం వినియోగించారు.
తొలుత విదేశాల నుంచి ట్రాక్టర్లను దిగుమతి చేసుకున్న మన దేశం.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ట్రాక్టర్లను తయారు చేస్తున్నది, ఎగుమతి చేస్తున్నది కూడా.. అయితే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినా... రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారి పరిస్థితి మాత్రం దుర్భరంగానే ఉంది.
పెరిగిన యాంత్రీకరణ
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో వ్యవసాయం పూర్తిగా మానవ శక్తి, పశువుల వినియోగంపైనే ఆధారపడి ఉండేది. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ బాగా పెరిగింది. దుక్కి, దమ్ము వంటి పనులకు పశువులతో నడిచే కొయ్య నాగలి, రెక్క నాగలి బదులుగా.. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసిన రొటవేటర్‌ను ఉపయోగిస్తున్నారు. విత్తనాలు చల్లేందుకు సీడ్ డ్రిల్స్ వచ్చాయి. కూలీలతో వరి నాట్లు వేయించడం తగ్గిపోయి.. వరి నాటే యంత్రాలు వినియోగిస్తున్నారు. కలుపుతీత కోసం కలుపు నివారణ యంత్రాల (వీడర్స్) వాడకం పెరిగింది.
పురుగు మందులు చల్లడానికి తొలుత చేతితో తిప్పుతూ వినియోగించే స్ప్రేయర్లు వాడేవారు. ఇప్పుడు పెట్రోల్, కిరోసిన్‌లతో నడిచే శక్తివంతమైన స్ప్రేయర్లు అందుబాటులోకి వచ్చాయి. వరి కోత, నూర్పిడి, ధాన్యంలో తాలు తీసెయ్యడానికి ఎగరబోత వంటి పనులను కంబైన్ హార్వెస్టర్ వంటి భారీ యంత్రం చిటికెలో చేసేస్తుంది.
హరిత విప్లవంతో పెరిగిన స్వయం సమృద్ధి
దేశంలో 1960వ దశకంలో ప్రారంభమైన హరిత విప్లవం వ్యవసాయం రూపురేఖలను మార్చేసింది. వరి దిగుబడి భారీగా పెరిగింది. విశ్వవిఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ తోడ్పాటుతో అధికోత్పత్తి గోధుమ వంగడాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. 1963లో భారత్‌ను సందర్శించిన బోర్లాగ్ పంజాబ్‌లో గోధుమ ఉత్పాదకత అనేక రెట్లు పెరిగేందుకు దోహదపడ్డారు. అధికోత్పత్తి వంగడాలు, రసాయనిక ఎరువులు, పుష్కలంగా జలవనరుల కేటాయింపుతో హరిత విప్లవానికి పంజాబ్ తొలి వేదికైంది. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇక అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ - ఫిలిప్పీన్స్) 1962లో ఐఆర్-8 వరి వంగడాన్ని రూపొందించడం హరిత విప్లవంలో ఒక మైలురాయి.
ఐఆర్-8 వంగడం రాకతో భారత్‌లో ధాన్యం దిగుబడి పెరిగింది. ఒకప్పుడు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మన దేశం.. 2006లో 45 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసే దశకు ఎదిగింది. 1986-1990 మధ్య ‘ఎల్లో రెవల్యూషన్’ పేరిట నూనె గింజల ఉత్పత్తి పెంపుదలకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసింది. ఆపరేషన్ ఫ్లడ్ పేరిట 1970-1996 మధ్య పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి జరిగింది.
కునారిల్లుతున్న రైతులు
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశంలో రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న 60 కోట్ల మందిలో 80 శాతం మంది జీవితాలు అరకొర ఆదాయాలతోనే కునారిల్లుతున్నాయి. ఎన్‌ఎస్‌ఎస్‌వో తాజా గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో రైతు నెల ఆదాయం సగటున రూ. 3 వేలు మాత్రమే. అదే ప్రభుత్వ కార్యాలయాల్లో కింది స్థాయి ఉద్యోగి జీతం సుమారు రూ.18,000. తాను పస్తులుండి దేశానికి తిండిపెడుతున్న భారత రైతుల ఆదాయం ఎంత అధమ స్థాయిలో ఉన్నదీ అర్థమవుతుంది.