డాక్టర్ శ్రీనుబాబును సత్కరిస్తున్న నిర్వాహకులు
విజయనగరం : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్‌తో ఉత్తరాంధ్రలో వ్యవసాయ, వ్యాపార విప్లవం సాధ్యమవుతుందని ఉత్తరాంధ్ర వాణిజ్య దిగ్గజం, పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు ధీమా వ్యక్తం చేశారు. కళలు, సాహిత్య, సంస్కృతికి ఆలవాలమైన విజయనగరంలో ఆదివారం నిర్వహించిన నార్త్ ఆంధ్ర బిజినెస్ మీట్‌లో విశిష్ట సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఉత్తరాంధ్రలో సహజవనరులకి ధీటుగా మానవవనరులు పుష్కలంగా ఉన్నాయని, ఉత్సాహం ఉరకలెత్తే యువత ప్రతిభను పెంపొందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంతోపాటు ఉత్తరాంధ్రలో వెయ్యి మంది పారిశ్రామికవేత్తలు తయారై, లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఉత్తరాంధ్ర స్వయం సమృద్ధి దిశగా ప్రయాణం సాగించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్లోబల్ ఎరీనాలో లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు విపరీతంగా పెరిగాయని , వాటిని స్థానికంగా ఉంటూనే అందిపుచ్చుకునే అద్భుత నైపుణ్యం ద్వారా ఉత్తరాంధ్ర పరిపుష్టికి అవకాశం కలుగుతుందన్నారు. ప్రపంచీకరణ ద్వారా వచ్చిన విస్తృత అవకాశాలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. గ్లోబల్ ఎరీనాలో లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆవశ్యకత ఉందన్నారు. థింకింగ్ గ్లోబల్, స్టార్టింగ్ లోకల్ నినాదంతో విశ్వవ్యాప్తంగా ఉత్పత్తులు గురించి ఆలోచిస్తూ..అవి వద్దే ఎందుకు తయారు చేయకూడదు, మనమే ఆ సేవలు ఎందుకు అందించకూడదు అనే ఆలోచనే ఎంట్రప్రెన్యూర్స్ కావడానికి తొలి మెట్టు అని సూచించారు. ప్రపంచస్థాయిలో పేరు రావాలంటే స్థానిక వ్యాపారాలదే కీలక పాత్ర అని నొక్కిచెప్పారు. పరిశ్రమల వ్యవస్థాపకులు స్థానికంగా తమ సంస్థలు ప్రారంభించినా ప్రపంచవ్యాప్తంగా ఆ ఉత్పత్తులు-సేవలలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని కార్యకలాపాలు ఆరంభించినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకి రంగం సిద్ధమైందని సంతోషం వ్యక్తం చేశారు.
వ్యవసాయమే ఉత్తరాంధ్ర ఊపిరి
సేంద్రీయ, ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులకు స్వర్గధామం ఉత్తరాంధ్ర అని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఒక్క వ్యవసాయరంగంలోనే 30కి పైగా అంశాలతో విస్తృత వ్యాపార అవకాశాలను డాక్టర్ గేదెల వ్యూహాత్మక దృష్టితో వివరించారు. దేశవ్యాప్తంగా ఉత్తరాంధ్రలో పండే పైనాపిల్, తయారయ్యే బెల్లం వరకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోందన్నారు డిజిటల్ మార్కెటింగ్ , AI టెక్నాలజీ వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ వ్యాపారం తిరుగులేని విధంగా లాభసాటిగా మారుతుందన్నారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయ సంపదను వినియోగించుకోవడానికి ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలంతా సిద్ధం కావాలన్నారు.
ప్రపంచీకరణ నుండి స్థానిక సాధికారత
సాంకేతిక పరివర్తన శక్తికి ఆమోదం తెలుపుతూ, డిజిటల్ మార్కెటింగ్, AIతో కలిసి ప్రపంచీకరణ వ్యాపారాన్ని ఎలా ప్రజాస్వామ్యీకరించిందో డాక్టర్ గేదెల కూలంకుషంగా వివరించారు. ఒకప్పుడు వ్యాపారం అంటే భారీ పెట్టుబడులు, విస్తృతమైన నెట్‌వర్క్‌లు అవసరమయ్యేవని, ఇప్పుడు అవన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇది స్థానిక వ్యాపారాలు ప్రపంచ వేదికపై పోటీ పడేలా చేస్తుందన్నారు.
మేధోవలసలు ఆపాలంటే స్థానిక ప్రతిభని ప్రోత్సహించాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మేథోవలసలు ఇటు రాష్ట్రానికి అటు విద్యావ్యవస్థకి, ముఖ్యంగా స్థానిక వ్యాపారరంగానికి తీరని చేటు చేస్తున్నాయన్నారు. పదిహేనేళ్లలో ప్రతిభావంతులైన 60 శాతం విద్యార్థులు మెరుగైన ఉద్యోగఉపాధి అవకాశాల కోసం ఇతరరాష్ట్రాలు, దేశాలకి వలసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఆ నిధులతో విద్యావంతులుగా తీర్చిదిద్దితే...వీరంతా వలస బాట పడుతున్నారు. వీరి విద్య కోసం ప్రభుత్వం చేసిన అప్పులు నిరుపేద కుటుంబాలపై పన్నుల రూపంలో వివిధ భారాలుగా పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంద్రప్రదేశ్ మొత్తం జనాభా 5 కోట్లలో 2 కోట్ల మంది శ్రామికులు, వ్యవసాయ శ్రామిక శక్తి దాదాపు 1 కోటి, మరియు ఇతర రంగాలలో 1 కోటి మంది ఉంటారని, ప్రతి ఏటా 5 లక్షల మంది నాణ్యమైన విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేస్తారని, సరైన మద్దతుతో రాబోయే ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగావకాశాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. AI, డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి స్థానిక మరియు గ్లోబల్ మార్కెటింగ్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు స్థానిక ఉద్యోగులు ఉపయోగపడతారన్నారు. ఈ మార్పు ద్వారా స్థానిక యువతకి స్థానికంగా ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం, వ్యాపార వృద్ధితో మూడురంగాలు గణనీయమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఉత్తరాంధ్రలో 5 లక్షల ఉద్యోగాలు కల్పన
విద్యావ్యవస్థ నుంచి వ్యాపారరంగం వరకూ అందరూ కలిసి సమష్టిగా పనిచేస్తేనే ఉత్తరాంధ్రలోనే కాదు, రాష్ట్రంలో మేథోవలసలు ఆపగలమని డాక్టర్ గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులకి శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలలు, వృత్తిపరమైన సంస్థలు, డిగ్రీ కళాశాలలు ఏకమై ఒక సహకార వేదికగా పనిచేయాలని సూచించారు. రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉత్తర ఆంధ్రలో 500,000 మరియు రాష్ట్రవ్యాప్తంగా ఒక మిలియన్ ఉపాధి అవకాశాలను సృష్టించాల్సిన ఆవశ్యకతని వివరించారు. ఇది ఎందుకు అవసరం అంటే...అని కొన్ని గణాంకాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సుమారు 40లక్షల మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని, ఏపీలోనే పనిచేసే ఏపీ సాఫ్ట్‌వేర్ నిపుణుల సంఖ్య 40 వేలు దాటదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో జరిగిన ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ కనెక్ట్ సదస్సులో ఈ అంతరాన్ని పూడ్చాల్సిన ఆవశ్యకతను డాక్టర్ గేదెల శ్రీనుబాబు వివరించారు.
స్థానిక ఆకాంక్షలు, ప్రపంచ విజయాలు
ఈ సమావేశానికి 1000 మంది పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, స్థానిక వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఇది కేవలం ఎవరో ఒకరు ఏర్పాటు చేసిన సమావేశం కాదు, ఇది స్థానిక ఆకాంక్షలకి నిదర్శనంగా నిలిచింది. ఒక సుదీర్ఘ లక్ష్యంతో ప్రయాణం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర స్వయంసమృద్ధి సాధనకి తొలి అడుగు పడింది. ఇది దేశానికే ఆదర్శం కానుందని గేదెల శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ఏఐసీటీఈలో ఇండస్ట్రీ కోఆర్డినేటర్ బుద్దా చంద్ర శేఖర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment