ఇది మా ఊరు | Successfully organized social movement | Sakshi
Sakshi News home page

ఇది మా ఊరు

Published Thu, Jan 24 2019 11:53 PM | Last Updated on Fri, Jan 25 2019 8:34 AM

Successfully organized social movement - Sakshi

కోమల్‌ హదాలా... ఇరవై రెండేళ్ల అమ్మాయి. పేరుకు తగ్గట్టే కోమలంగా ఉంది. అంతే కోమలంగా ఓ సామాజికోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ‘ఇది మా ఊరు’ అంటూ గర్వంగా చెబుతోందిప్పుడు. 

కోమల్‌ మొదలు పెట్టిన విప్లవానికి తొలి అడుగు ఇంటి నుంచే పడింది. భర్త మీద ఒత్తిడి తెచ్చింది. అత్తకు, ఆడపడుచుకు నచ్చచెప్పింది. తన వాదనతో అత్తగారి అత్తగారిని కూడా మెప్పించింది. ఇంట్లో టాయిలెట్‌ కట్టాలనే ఆమె డిమాండ్‌ ఇంటితోనే ఆగిపోలేదు. ఊరంతటికీ టాయిలెట్‌లు వచ్చాయి. కోమల్‌ హదాలా ఢిల్లీలో పుట్టి పెరిగింది. పెళ్లితో ఉత్తరప్రదేశ్‌లోని నిథోరా గ్రామానికి వచ్చింది. ఆ మర్నాడే తెల్లవారి నాలుగు గంటల సమయంలో ఎవరో కుదుపుతూ ఉంటే మెలకువ వచ్చింది. ‘నిద్ర లేచి త్వరగా రా, అందరూ ఎదురు చూస్తున్నారు’ అని అత్తగారు నిద్రలేపారు. 


ఇంకా చీకటి వదల్లేదు, ఇప్పుడు లేవడం ఎందుకు, తన కోసం ఎదురు చూస్తున్నది ఎవరు... ప్రశ్నలను గొంతులోపలే మింగేసి అత్తగారి వెంట బయటకు వచ్చింది. పక్కిళ్ల మహిళలు, ఆ ఇంటి ఆడవాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు కొత్తకోడలి కోసం ఎదురు చూస్తూ. ‘చీకట్లో ఎక్కడికి’ అడిగింది. ‘మరి చీకటి వదలక ముందే వెళ్లి రావాల్సిన పనికి చీకటి వదిలాక వెళ్తావా’ పరాచికాలాడిందొకామె. ‘మగవాళ్లు నిద్రలేవక ముందే వెళ్లి రావాలి’ అంటూ మరొకామె హెచ్చరించింది. అంతా కలిసి కిలోమీటరు దూరానున్న పొలాల్లోకి వెళ్లారు. ఎక్కడ అడుగు పెడుతోందో తెలియట్లేదు కోమల్‌కి. కీచురాళ్ల రొద, తుప్పల్లో కాలు పెట్టాలంటే భయమేసింది.

పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె భర్తను డిమాండ్‌ చేసింది. ‘ఇంట్లో టాయిలెట్‌ కట్టాల్సిందే’ అని. రెండంతస్తుల ఇంట్లో డబుల్‌ సిలిండర్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది, వాటర్‌ ప్యూరిఫయర్‌ కూడా ఉంది. కానీ టాయిలెట్‌ మాత్రం లేదు. ఇంట్లో వాళ్లందరినీ తన వాదనతో సమాధానపరిచింది కోమల్‌. అనుకున్నది సాధించుకుంది. ఏడాది తిరిగే సరికి ఊళ్లో 250 టాయిలెట్‌లు కట్టించింది.

ఎలా సాధ్యమైంది?
అందరూ కలిసి గ్రామపెద్ద చహాత్‌ రామ్‌ను కలిశారు. టాయిలెట్‌ కట్టుకుంటామని వచ్చిన వాళ్లను చూసేసరికి చహాత్‌ రామ్‌కు ప్రాణం లేచి వచ్చింది. ప్రభుత్వం నుంచి నిధులున్నాయి. ప్రతి ఇంటికీ కట్టించమనే ఆదేశమూ ఉంది. ఎంత చెప్పినా టాయిలెట్‌ కట్టించుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లే కరువయ్యారు. ఒక అమ్మాయి అలా చొరవ చూపడంతో గ్రామ పెద్ద ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ అమ్మాయితోనే మిగిలిన ఆడవాళ్లకు నచ్చ చెప్పిస్తే పనవుతుందనుకున్నాడు. పైగా నగరం అమ్మాయి, చదువుకున్న అమ్మాయి. తెలివితేటలతో ఊరిని ఒక తాటి మీదకు తెస్తుందని ఆశించాడు. అలా కోమల్‌ తన ఇంటి నుంచి మొదలు పెట్టిన టాయిలెట్‌ విప్లవాన్ని ఊరంతటికీ విస్తరించింది.

మహిళలందరినీ కూర్చోబెట్టి తెల్లవారు జామున నాలుగింటికి, రాత్రి తొమ్మిది తర్వాత పొలాల్లోకి వెళ్లడం వల్ల మహిళలకు ఎదురయ్యే ప్రమాదాల గురించి హెచ్చరించింది. బహిరంగ విసర్జన వల్ల వచ్చే అనారోగ్యాలను వివరించింది. ప్రమాదాలు వాళ్లకు అర్థమయ్యాయి, కానీ బహిరంగ విసర్జన అనారోగ్యాలకు ఎలా కారణమవుతుందో వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాలేదు. స్కూలు పిల్లలను సమీకరించింది, వాళ్ల పుస్తకాల్లో ఉన్న పాఠాలను పెద్దవాళ్లకు అర్థమయ్యేలా చెప్పింది. మొత్తానికి ఊరందరి చేత మరుగుదొడ్డి కట్టించింది కోమల్‌. 

కట్టించడం వరకు ఓకే!
ఊరందరినీ సమాధాన పరిచి ఇంటింటికీ టాయిలెట్‌ కట్టడం పూర్తయింది. కానీ వాటిని వాడుకలోకి తేవడం మరో ఘట్టమైంది. టాయిలెట్‌ గదుల్లో సామాను భద్రపరిచారు కొందరు. ‘అది ఆడవాళ్ల కోసం, మగవాళ్లం మేమెందుకు వాడాలి’ అని వాదించారు మరికొందరు. చివరికి బహిరంగంగా విసర్జన చేసే వాళ్లను పిల్లల చేత విజిల్‌ ఊదించి ఎగతాళి చేయించడం అనే టెక్నిక్‌ పూర్తి ఫలితాలనిచ్చింది.‘మోదీ ప్రభుత్వం టాయిలెట్‌ ఫస్ట్, టెంపుల్‌ లేటర్‌.. అనే నినాదంతో 2014 నుంచి తొమ్మిది కోట్లకు పైగా టాయిలెట్‌లను కట్టించినప్పటికీ, ఆ స్ఫూర్తితో మా నిథోరాలో ఒక్కటీ కట్టించలేకపోయాను. కోమల్‌ తెచ్చిన విప్లవంతోనే ఇది సాధ్యమైంది’ అని ప్రశంసించాడు గ్రామపెద్ద.
– మంజీర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement