
1967– రష్యా విప్లవం యాభయ్ ఏళ్ల సందర్భం. సోవియెట్ రష్యా వెళ్లిన భారత కళాకారుల బృందం సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తున్నది. రష్యన్లు ఎంతో అభిమానించే నేత హఠాత్తుగా వేదిక మీద ప్రత్యక్షమయ్యారు. ముమ్మూర్తులా ఆయనే. విస్తుపోయారంతా. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ. కానీ నెహ్రూ 1964లోనే కన్నుమూశారు. అందుకే ఆ విస్మయం. అప్పుడు తెలిసింది– అదొక వేషధారణ. ఇంకొక చక్కని ఉదాహరణ కూడా. బసప్ప దాసప్ప జట్టి భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు (1974–1979) ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఎదురుగా వేదికవైపు చూశారు. ఆశ్చర్యంలో మునిగిపోయారు. వేదిక మీద తనకు కేటాయించిన కుర్చీలో అప్పటికే బి.డి. జట్టి ఉన్నారు. ఒక్క నిమిషం తరువాత.. వేదిక ముందు అసలు జట్టి ఇంకా తేరుకోక ముందే వేదిక మీది నకిలీ జట్టి కిందకి దిగి వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇది కూడా వేషమే.
ఆ రెండు వేషాలు ధరించిన కళాకారుడు ఒక్కరే– ‘ఫన్ డాక్టర్’ వైద్యుల చంద్రశేఖరం. బెన్ కింగ్స్‌లే అచ్చంగా గాంధీగారిలాగే కనిపించారు. రోషన్ సేథ్ దాదాపు నెహ్రూను పోలి ఉంటారు. ఆంథోనీ క్విన్ లిబియా తిరుగుబాటు నేత ఒమర్ ముక్తార్‌లాగే ఉన్నారు (లైన్ ఆఫ్ డిజర్ట్). విజయ్‌చందర్ టంగుటూరి ప్రకాశాన్ని మరిపించారు (ఆంధ్రకేసరి). రెండో ప్రపంచ యుద్ధ ఘట్టాల ఆధారంగా నిర్మించిన సినిమాలలో హిట్లర్ పాత్రధారి ముమ్మూర్తులా ఆ నాజీ నియంతనే పోలి ఉంటాడు. కానీ ఇలాంటి వేషాలన్నీ, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఒకే ఒక్క ముఖానికి అమరిపోతాయి. ఆ బహు ‘ముఖ’ ప్రజ్ఞాశాలి చంద్రశేఖరం (నవంబర్ 10, 1904–మే 29, 1996). చంద్రశేఖరం ప్రతిభ ఎంత నిరుపమానమో ఆవిష్కరించే ఒక అద్భుత వాస్తవాన్ని కూడా చెప్పుకోవాలి. ఆయన గాంధీ, నెహ్రూ, హిట్లర్‌ల వేషధారణే కాదు, అరవింద్ ఘోష్, రామకృష్ణ పరమహంస, కంచి కామకోటి పీఠం పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, జయేంద్ర సరస్వతి, రమణ మహర్షి, త్యాగరాజస్వామి వంటి భారతీయ ఆధ్యాత్మిక రంగ శ్రేష్టుల వేషధారణ కూడా చేసేవారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబుల్ కలామ్ ఆజాద్, జకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వంటి రాజనీతిజ్ఞుల ముఖాకృతులని ఆవిష్కరించగలరు. అబ్రహాం లింకన్, లెనిన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి పాశ్చాత్య మహనీయుల రూపాలనీ సంతరించుకోగలరు. రవీంద్రనాథ్ టాగూర్, షేక్‌స్పియర్, బెర్నార్డ్‌షా వంటి కవివరేణ్యులుగా కూడా కనిపించగలరు. ఇంకా– ప్రపంచ ప్రఖ్యాత మహిళామణులు ఇందిరాగాంధీ, మదర్ థెరిస్సా ముఖాలు కూడా చంద్రశేఖరం ముఖంలో పొటమరిస్తాయి. ఎవరి ముఖం వారిదే కదా! దేని వైవిధ్యం దానిదే కదా! ఒకరివి దయను కురిపించే నేత్రాలు. వేరొకరివి తీక్షణమైన కళ్లు. వేరొకరిది రూక్షవీక్షణం. ఒకరిది కోల ముఖం. వేరొకరివి పెద్ద బుగ్గలు. ఒకరిది చిన్న ముక్కు. మరొకరిది కోటేరు ముక్కు. వేరొకరిది తీర్చినట్టు ఉండే నాసిక. ఒకరిది విశాల ఫాలభాగం. వేరొకరిది చిన్న చిబుకం. ఇంకొరిది బట్టతల. మరొకరివి దీర్ఘకేశాలు. ఒకరిది కట్ మీసం. వేరొకరిది మీసమే లేని మూతి. కొందరిది గోటీ (చిరుగెడ్డం), ఒకరిది దీర్ఘ వెంట్రుకల గెడ్డం... ఈ వైరుధ్యాలన్నీ ఆ ఒక్క ముఖంలోనే కనిపించేవి. పైగా అవన్నీ ప్రపంచ ప్రఖ్యాతుల ముఖాలే. ఆరో ఏడో కాదు, పదో పాతికో కాదు, దాదాపు 90 ముఖాలను చంద్రశేఖరం ఒకే ప్రదర్శనలో, ఒకే వేదిక మీద ప్రదర్శించేవారు. కేవలం మూడు నిమిషాలలో ఐదారు ముఖాలుగా ఆయన ఒక్క ముఖమే మారిపోయేది. ప్రేక్షకులను సమ్మోహనపరిచేది. ఈ ప్రదర్శనలో మరొక మనిషి సాయం ఉండేది కాదు. రంగస్థలం మీద ఆయన ఒక్కరే ఇదంతా నిర్వహించేవారు. ఎలా వచ్చిందీ సమ్మోహన శక్తి? కేవలం ఆహార్యం లేదా మేకప్ కళ మీద పెంచుకున్న పట్టుతోనే అదంతా ఆయన సాధించారు.
తాను పుట్టిన నెల్లూరులోనే, వీఆర్ పాఠశాలలో చదువుతున్నప్పుడే చంద్రశేఖరం నట జీవితం ఆరంభమైంది. అక్కడే పీఎన్ రామస్వామి అయ్యర్ అనే ఆంగ్లోపాధ్యాయుడు ఉండేవారు. ఆయన చెప్పిన ఇంగ్లిష్ పాఠాలే చంద్రశేఖరంలోని నటుడికి ఊపిరి పోశాయి. రామస్వామి అయ్యర్ షేక్‌స్పియర్ సాహిత్యం గురించి చెప్పేవారు. ఆ పాత్రలలో ఒదిగిపోయి, నటిస్తూ బోధించేవారు. ఇదంతా 1924 ప్రాంతం. అప్పుడే నెల్లూరులో ఔత్సాహిక నాటక కళాకారుల బృందంలో కలసి పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. 1929 వరకు సాగిన ఈ ప్రయాణంలో ఆయన ధరించినవన్నీ స్త్రీ పాత్రలే. తరువాత మిత్రులతో కలసి చిన్న చిన్న స్కిట్లు ప్రదర్శించేవారు. ఇవన్నీ సాంఘిక ఇతివృత్తాలు. పౌరాణిక నాటకాలలో స్త్రీ పాత్రలు ధరించిన నేపథ్యం వల్ల కావచ్చు, షేక్‌స్పియర్ నాటకాలలో కూడా స్త్రీ పాత్రలు ధరించే అవకాశం వచ్చిందాయనకు. కింగ్ లియర్, మర్చంట్ ఆఫ్ వెనిస్, మేక్బెత్, ఒథెల్లో నాటకాలలో ఆయన నటించారు. కానీ ఆయన వాచకం ఇంగ్లిష్ జాతీయుల ఉచ్చారణతో పోటీ పడేది. ఆయన ఉన్నత విద్యావంతుడని అంతా అనుకునేవారు. కానీ ఆయనే సందర్భం వచ్చినప్పుడు తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ మాత్రమే చదివానని చెప్పేవారు.
చంద్రశేఖరం ఒకవైపు నాటకాలు వేస్తూనే ఏకపాత్రాభినయ ప్రక్రియకు మరలారు. ఇది ఆయన రంగస్థల జీవితంలో పెద్ద మార్పు. ఆ ప్రక్రియలో నుంచి వచ్చినదే బహురూపధారణ.ఆయన కొత్త వేషం కోసం తెర వెనక్కి వెళ్లరు. వేదిక మీదే ఏర్పాటు చేసుకున్న టేబుల్ ఆయన గ్రీన్‌రూమ్ అయిపోతుంది. దాని మీదే మేకప్ సామగ్రి ఉంచుకునేవారు. అప్పటికే ఉన్న వేషం తాలూకు మేకప్‌ను కొద్దిగా మార్చుకుని, కొత్త ముఖంతో ఆయన దర్శనమిచ్చేవారు. ఇందుకు పట్టేది ఒకటి రెండు నిమిషాలు. కానీ ఆ వేషాలలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయేవారు. ఒకసారి ఆయన జకీర్ హుసేన్ వేషంతో వాహిని స్టూడియోలోకి వెళ్లారు. అప్పుడు జకీర్ హుసేన్ ఉప రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఆ విధంగా మందీమార్బలం లేకుండా స్టూడియోలోకి రావడం చూసి కంగుతిన్నారు లోపల ఉన్నవారు. తరువాత సంగతి తెలిసింది. అలాగే ఒకసారి విజయవాడలో టంగుటూరి ప్రకాశంగారి సభ ఏర్పాటయింది. దానికి ఆయన అరగంట ఆలస్యంగా వస్తున్నారని ప్రకటన వచ్చింది. కానీ అంతలోనే వేదిక మీద ప్రకాశంగారు దర్శనమిచ్చారు. జనం ఆశ్చర్యపోయారు. డాక్టర్ చంద్రశేఖరం గారే ప్రకాశం వేషంతో వేదిక ఎక్కారు. సరిగ్గా అరగంట తరువాత అసలు ప్రకాశం గారు వచ్చి వేదిక ఎక్కారు. అప్పుడు తెలిసింది– అంతకు ముందు కనిపించిన ప్రకాశం ఎవరో!
నటనను తపస్సుగా స్వీకరించారని కొందరి విషయంలో అంటూ ఉంటారు. ఆ మాట చంద్రశేఖరంగారికి సరిగ్గా సరిపోతుంది. ఆయన నటన, రంగస్థల నిర్వహణ, ఆహార్యం వంటి అంశాల మీద పుస్తకాలు రాశారు. వాటికి ఆయన పెట్టిన పేర్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ‘నాటక భగవద్గీత’, ‘నాటకోపనిషత్’, ‘నాటక గీతాంజలి’ వంటి పేర్లు పెట్టారాయన. అసలు పాఠశాల స్థాయిలోనే నటనకు అవకాశం ఉండాలని, అది సృజనకు దోహదం చేస్తుందని చంద్రశేఖరం అభిప్రాయం. ఏకపాత్రాభినయ కళ మీద ఆయన రాసిన పుస్తకానికి అలనాటి విద్యావేత్త డాక్టర్ కె. వెంకటసుబ్రమణియన్(పుదుచ్చేరి విశ్వవిద్యాలయం మాజీ వైస్‌చాన్సలర్) ఇచ్చిన ముందుమాటలో ఇదే ధ్వనిస్తుంది. ‘విద్యలోను, మంచి ఉపాధ్యాయుడు తయారు కావడంలోను నాటకం, లలితకళలు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఉపాధ్యాయుడు ఏకపాత్రాభినయం రీతిలో పాఠాలు బోధిస్తే అవి విద్యార్థులకు ఎంతో ఆకర్షిణీయంగా, అర్థమయ్యేరీతిలో ఉంటాయి.’ చంద్రశేఖరం కీర్తి భారత సాంస్కృతిక రాయబారి స్థాయికి చేరుకుంది. 1953, 1967 సంవత్సరాలలో చైనా, రష్యాలు పర్యటించిన భారత కళాకారుల బృందానికి ఆయనే నాయకుడు. ఆ బృందాలలో రంగస్థల కళాకారుడు ఆయన ఒక్కరే. చంద్రశేఖరం పదిహేనేళ్ల పాటు ‘రంగజ్యోతి’ పేరుతో పత్రిక కూడా నడిపారు. ఈ పత్రిక ఉద్దేశం కూడా నాటక కళను సజీవంగా ఉంచడమే.ఇంత కృషిలో చంద్రశేఖరం గారికి ప్రభుత్వం నుంచి ఇతర సంస్థల నుంచి దక్కిన చేయూత దాదాపు ఏమీ లేదు. ఈ కృషిలోను ఆయనది ఏకపాత్రే. కానీ వ్యక్తుల వేషధారణ అనే ప్రక్రియకు ఆద్యుడు ఆయనేనని ప్రపంచం కీర్తిస్తున్నది. వేగంగా ఆహార్యం మార్చడమనేది నిశ్చయంగా ఒక విప్లవం. ఆ విప్లవంతోనే ఆయన బహువేషధారణ అనే వినూత్న ప్రక్రియకు జీవం పోశారు. నటన, కళారాధన అంటే చంద్రశేఖరం దృష్టిలో ఒక జీవిక మాత్రమే కాదు, ఆధ్యాత్మికత పునాదిగా ఉన్న జీవన పరమార్థం కూడా. ఈ ప్రయాణంలో ఆయనకు తల్లిదండ్రులు సుబ్బారావు, సీతాబాయి; భార్య శకుంతలాబాయి చేదోడువాదోడుగా ఉన్నారు. ప్రఖ్యాత గాయని ఎస్. జానకి చంద్రశేఖరంగారి పెద్దకోడలు.
∙డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment