పాలవెల్లి.. అమృతవల్లి | Milk Revolution | Sakshi
Sakshi News home page

పాలవెల్లి.. అమృతవల్లి

Published Thu, Nov 26 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

Milk Revolution

క్షీర విప్లవం దిశగా అడుగులు
 జిల్లాలో 4.42 లక్షల పాడి పశువులు
 రోజూ 1.80 లక్షల లీటర్ల పాలసేకరణ
 గజ్వేల్, సిద్దిపేటలో మిల్క్‌గ్రిడ్‌లకు శ్రీకారం
 రూ.6 కోట్లతో మెదక్, సిద్దిపేటలో  పాలప్యాకింగ్ కేంద్రాలు
 నేడు జాతీయ పాల దినోత్సవం సందర్భంగా

 సాక్షి, సంగారెడ్డి పాలవెల్లి.. అమృతవల్లి.. క్షీరవిప్లవం దిశగా మెతుకుసీమ అడుగులు వేస్తోంది. జిల్లాలో పాడిపరిశ్రమ దినదినాభివృద్ధి సాధిస్తోంది. పశుసంతతితోపాటు పాల ఉత్పిత్తి ఘననీయంగా పెరుగుతోంది. జిల్లాలో 4.42 లక్షల అవులు, గేదెలు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 1.80 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. రోజుకు 2 లక్షల లీటర్లకుపైగా పాల ఉత్పత్తి పెంచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. విజయ డెయిరీతోపాటు పలు ప్రైవేట్ డెయిరీలు సైతం పెద్ద ఎత్తున పాలను సమీకరిస్తున్నాయి. పాలసేకరణలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. గురువారం క్షీరవిప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
 జిల్లాలోని పాడి రైతులు క్షీరవిప్లవం దిశగా అడుగులు వేస్తున్నారు.
 
  ఉత్పత్తి పెరగడంతోపాటు సేకరణకు డెయిరీలు సైతం భారీగా వెలిసాయి. జిల్లాలో మొత్తం 4.42 లక్షల ఆవులు, గేదెలు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 1.80 లక్షల లీటర్లకుపైగా పాల దిగుబడి ఉంటుందని అంచనా. మెదక్, సంగారెడ్డి, పటాన్‌చెరు, గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్ ప్రాంతాల్లో పాడి అధికంగా ఉంది. ఈ పరిశ్రమతో రైతులు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. రైతులు వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమవైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు యువత సైతం ఉపాధి పొందేందుకు డెయిరీకి ప్రాధాన్యతనిస్తోంది.
 
 విజయ డెయిరీ...
 పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. విజయ డెయిరీ మొత్తం 650 గ్రామాల్లోని 14,367 మంది పాల ఉత్పత్తిదారుల నుంచి రోజూ 98 వేల లీటర్ల పాలను సేకరిస్తోంది. ప్రైవేట్ సంస్థల కంటే విజయ డెయిరీ లీటర్‌కు నాలుగు రూపాయలను అదనంగా అందజేస్తోంది. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు జిల్లాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.
 
 ప్రోత్సాహం కరువు...

 రైతులు, యువత పాడివైపు మళ్లేందుకు అవసరైమన ప్రోత్సాహకాలు, ప్రభుత్వ పథకాలు అందుబాటులో లేవు. రైతులు, మహిళలు పాడి పశువులను కొనుగోలు చేసేందుకు అవసరైమన ఆర్థిక స్థోమత లేక చాలామంది వెనకడుగు వేస్తున్నారు. నాబార్డు అప్పుడప్పుడు సబ్సిడీ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకం నిరంతం అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం డీఆర్‌డీఏ ద్వారా స్త్రీ నిధి కింద మహిళా సంఘాల సభ్యులు ఆవులు, గేదెలు కొనుగోలు చేసేందుకు కేవలం రూ.50 వేలు రుణం అందజేస్తున్నారు.
 
 ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మహిళా సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.50 వేల రుణమిస్తున్నారు. పశుసంవర్థక శాఖ సునందిని పథకం కింద ఆడ దూడలు ఎదిగేందుకు అవసరైమన దాణాను రెండేళ్ల వరకు ఉచితంగా అందజేస్తోంది.    అయితే జిల్లాలో పాడిపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ పథకాలను అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
 
 క్షీర విప్లవాన్ని తీసుకొస్తాం..
 జిల్లాలో పాడిపరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తున్నాం. రోజూ 1.80 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. దీన్ని 2 లక్షలకుపైగా పెంచాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవటంతోపాటు రైతులను పాడిపరిశ్రమవైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాం. పాడి రైతులకు పశువైద్యులను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.జిల్లాలోని పశువైద్యశాలల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
 - డాక్టర్ లక్ష్మారెడ్డి, జేడీ, పశుసంవర్ధక శాఖ
 
 విజయ డెయిరీ సేవలను విస్తరిస్తాం..
 విజయ డెయిరీ జిల్లాలో రోజూ 98 వేల లీటర్ల పాలను సేకరిస్తోంది.  98 పాల సంఘాలతోపాటు పాడిరైతుల నుంచి నేరుగా పాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వం ప్రతి లీటర్‌కు రూ.4 అదనంగా చెల్లిస్తోంది. ఇలా ఇప్పటివరకు ప్రభుత్వం పాడి రైతులకు రూ.5.78 కోట్ల నిధులు మంజూరు చేసింది. పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గజ్వేల్, సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా 5,700 యూనిట్లతో మిల్క్‌గ్రిడ్ చేపట్టాం. రూ.6 కోట్లతో మెదక్, సిద్దిపేటలో పాల ప్యాకింగ్ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. - మురళీమోహన్, విజయ డెయిరీ జీఎం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement