బోల్తా కొట్టించి.. బంగారంతో ఉడాయించి
బంగారు నగల దుకాణ యజమానిని ఓ దొంగ బోల్తా కొట్టించి రూ.1.35 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు.
బనగానపల్లె: బంగారు నగల దుకాణ యజమానిని ఓ దొంగ బోల్తా కొట్టించి రూ.1.35 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘటన బనగానపల్లెలో గురువారం చోటు చేసుకుంది. సినిమా సన్నివేశాన్ని తలపించేలా షాపు యజమానిని, గుమస్తాను నమ్మించి ఓ దొంగ బంగారంతో పరారయ్యాడు. ఈ చోరీలో మహిళ కూడా పాల్గొంది. పట్టణంలోని ఆసా్థనం రోడ్డులోని జాఫర్ బంగారు దుకాణానికి రాత్రి 7.30 గంటల సమయంలో ఓ వ్యక్తి వచ్చి తాను తహశీల్దారకార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్నానని మాటలు కలిపాడు. మంచి నాణ్యమైన బంగారంతో తయారు చేసిన చైన్, ఉంగారం చూయించాలని కోరాడు. అలాగే ధర తగ్గించుకోవాలని, నీకు ఏదైనా తమ కార్యాలయంలో పని ఉంటే సహకరిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేస్తున్నట్లు నటించాడు. బంగారం చైన్ తీసుకున్నానని, డబ్బు సిద్ధం చేయాలని చెప్పాడు. కొద్ది సేపటికి తర్వాత గుమస్తాను తనతో పంపిస్తే డబ్బు ఇస్తానని యజమానికి చెప్పాడు.
ఈ మాటలను షాపు యజమాని నమ్మి 45 గ్రాముల లాంగ్‌చైన్, ఉంగరాన్ని ఇచ్చాడు. డబ్బు కోసం ఆయన వెంట గుమస్తాను పంపారు. పట్టణంలోని పోలీసు క్వార్టర్స్ సమీపంలోని ఓ ఇంటి వద్ద అప్పటికే ప్రణాళిక మేరకు అక్కడ ఉన్న మహిళతో మాట్లాడుతూ చైన్, ఉంగరాన్ని ఆమెకు ఇవ్వాలనిగుమస్తాకు చెప్పి ఇప్పించాడు. ఇంటిలో కొంత మొత్తం తక్కువగా ఉందని తన వెంట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్దకు వస్తే ఏటీఎంలో డ్రా చేసి ఇస్తానని చెప్పి గుమస్తాను నమ్మించి బ్యాంకు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఏటీఎం కార్డును మరచిపోయాను.. నీవు ఇక్కడే ఉంటే ఇప్పుడే ఇంటికి వెళ్లి తీసుకువస్తానని గుమస్తాను నమ్మించి పరారయ్యారు. ఎంతసేపటికి బ్యాంకు వద్దకు రాకపోవడంతో ఇంటి వద్దకు వెళ్లి చూస్తే ఆ ప్రాంతంలో ఆ ఇద్దరి ఆచూకీ లేదు. ఇదంతా మోసంగా భావించి షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్‌ఐ రాకేష్ శుక్రవారం బంగారు షాపు వద్దకు వచ్చి సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.