
మహబూబ్‌నగర్: ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు ఆభరణాల పర్సును బాధిత మహిళకు అందజేసి నిజాయితీ చాటుకుంది ఓ ప్రయాణికురాలు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పునుంతల మండలం కాంసానిపల్లికి చెందిన నెల్లోజు ప్రసన్న ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి కల్వకుర్తి నుంచి ఉప్పునుంతల వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఎక్కింది.
ఉప్పునుంతలలో దిగి గ్రామానికి వెళ్లి హ్యాండ్‌బ్యాగ్‌లో చూడగా బంగారు ఆభరణాలు (సుమారు రూ.3 లక్షల విలువ)న్న పర్సు కనిపించలేదు. అదే బస్సులో ప్రయాణించిన సదగోడుకు చెందిన శోభకు బస్సులోనే ఆభరణాల పర్సు దొరకగా కండక్టర్ నారాయణమ్మకు అందజేసింది. సోమవారం అచ్చంపేట డిపో ఆవరణలో బాధితురాలు ప్రసన్నకు పర్సును అందజేసి నిజాయితీని చాటుకుంది.