సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి శవాన్ని రూ.6.5 లక్షలు కడితేనే అప్పగిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం.. మూడురోజుల పాటు మృతదేహాన్ని ఆస్పత్రి సెల్లార్‌లో ఉంచిన దారుణ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నాగోలు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (41) కరోనా లక్షణాలతో ఈ నెల 17వ తేదీన నాగోలు ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఆస్పత్రిలో చేరాడు. చేరే సమయంలో రూ.1.40 లక్షలు, ఆ తర్వాత పరీక్షలంటూ రూ.53,800, మందుల పేరిట అదనంగా వసూలు చేశారు. ఇంతజేసినా ఫలితం దక్కలేదు.
ఈ నెల 25వ తేదీన అతను మరణించినట్లు కుటుంబసభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దీంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు రాగా, తమకు ఇంకా రావాల్సిన రూ.6.5 లక్షలు కడితే కానీ మృతదేహం అప్పగించబోమని తేల్చిచెప్పింది. తమ వద్ద ఇప్పుడు అంత డబ్బులు లేవని, మృతదేహాన్ని ఇస్తే రెండురోజుల్లో సర్దుబాటు చేస్తామని ఆ ఉద్యోగి కుటుంబసభ్యులు చెప్పారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోలేదు. డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని స్పష్టం చేసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి వెళ్లిపోగా ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని బాక్సులో పెట్టి హాస్పిటల్ సెల్లార్‌లో ఉంచారు.
డబ్బుల కోసం ప్రయత్నించినా..
తెలిసిన వారి దగ్గర డబ్బుల కోసం విఫల ప్రయత్నం చేసిన కుటుంబసభ్యులు మంగళవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని తాము చేసిన ప్రయత్నాలు వివరించారు. మృతదేహాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఆస్పత్రి యాజమాన్యం కనికరించకపోవడంతో బంధువులతో పాటు ఆందోళనకు దిగారు. ఎల్‌బీనగర్ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పారు. హాస్పిటల్ నిర్వాహకులతో మాట్లాడి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పచెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ వర్గాలు నిరాకరించాయి.
మానవత్వం మరిచిపోయారు
మృతదేహాన్ని మూడురోజులు ఆస్పత్రి సెల్లార్‌లో ఉంచిన యాజమాన్యం మానవత్వం మరిచి వ్యవహరించిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి యజమానిని కోల్పోయిన తాము, మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో మరింత మనోవేదనకు గురయ్యామని వాపోయారు. రోగులను ఆదుకోవాల్సిన హాస్పిటల్ నిర్వాహకులు కేవలం డబ్బుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐసీయూలో పది మంది కరోనా పేషెంట్లకు ఒకే నర్స్ చికిత్స చేస్తోందని తెలిపారు. సరైన చికిత్స చేయకపోగా, రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
చదవండి: పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్: రెండు ప్రాణాలు బలి
చదవండి: మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్
Comments
Please login to add a commentAdd a comment