చండీగఢ్: కర్నాల్‌లో రైతులపై పోలీస్ లాఠీచార్జికి నిరసనగా పంజాబ్ రైతులు రోడ్లను దిగ్బంధించి, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలపాటు సాగిన ఆందోళనలతో ప్రధాన హైవేలపై వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. శనివారం కర్నాల్‌లో బీజేపీ సమావేశానికి వ్యతిరేకంగా హైవేపైకి భారీగా తరలివచ్చిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో 10 మంది రైతులు గాయపడిన విషయం తెలిసిందే. కర్నాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆదివారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చిన సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్(ఎస్‌డీఎం) ఆయుష్ సిన్హాను ఆయన సర్కారీ తాలిబన్‌గా పేర్కొన్నారు.
‘మీరు మమ్మల్ని ఖలిస్తానీ అంటే, మేం మిమ్మల్ని సర్కారీ తాలిబన్లని అంటాం. ఇలాంటి వారిని మావోయిస్టు ప్రాంతాలకు పంపించాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం కర్నాల్‌లో సమావేశం కానున్నట్లు హరియాణా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చెప్పారు. ఇలా ఉండగా, రైతులపై పోలీస్ లాఠీచార్జిని హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్ సమర్ధించుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపు తామని మాటిచ్చిన రైతులు.. ఆ తర్వాత హైవేను దిగ్బంధించి, పోలీసులపైకి రాళ్లు రువ్వారన్నారు. రైతుల తలలు పగలగొట్టాలంటూ పోలీసులను ప్రేరేపించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment