నాణ్యమైన విత్తనం నాటితే..
పాడి–పంట : డా.పిడిగెం సైదయ్య, అసోసియేట్ డీన్, మోజర్ల ఉద్యాన కళాశాల
కొత్తకోట రూరల్: పంటల సాగులో నాణ్యమైన విత్తనానిదే ప్రధాన పాత్ర. నాణ్యమైన విత్తనం నాటితే సగం దిగుబడి సాధించినట్లే. సాగులో వినియోగించే ఎరువులు, నీరు, ఇతర ఉత్పత్తి కారకాల సామర్థ్యం విత్తనం నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. సిఫార్సు చేసిన విత్తన మొలక శాతం, తేమ, భౌతిక, జన్యు స్వచ్ఛత కలిగిన విత్తనాలు వాడాలి. అప్పుడే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు.
● మార్కెట్లో కాయగూరల విత్తనాలు లభ్యమవుతున్నా.. వాటి నాణ్యతపై అంతగా భరోసా లేదు. కాబట్టి రైతులు తమస్థాయిలో తక్కువ ఖర్చుతో తగిన మోతాదులో విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. కాని అన్ని కాయగూరల పంటల్లో విత్తనోత్పత్తి సాధ్యం కాదు. టమాటా, వంకాయ, మిరపతో పాటు తీగజాతి పంటలు, గోరుచిక్కుడు, తోటకూర మొదలైన ఉష్ణ ప్రాంతపు పంటల్లో మాత్రమే విత్తనోత్పత్తి సాధ్యం. చలికాలం పంటలైన క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర పంటల విత్తనోత్పత్తి మన ప్రాంతంలో సాధ్యం కాదు. విత్తనోత్పత్తి చేపట్టే ప్రాంతంలో పరిస్థితులు విత్తన నాణ్యతపై ప్రభావం చూపుతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాలు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు విత్తనోత్పత్తికి పనికిరావు. విత్తనోత్పత్తి ప్రాంతంలో పగలు సూర్యరశ్మి కనీసం 10 నుంచి 12 గంటలు ఉండాలి. ముఖ్యంగా కాయలు కోత కొచ్చే సమయంలో వర్షాలు రాకుండా ముందుగానే విత్తనాలు పొలంలో వేసుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి..
విత్తనోత్పత్తి చేసే ముందు కొన్ని అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. మొదట నిర్ణయించుకున్న అధీకృత డీలరు లేదా పరిశోధనా స్థానం నుంచి ఫౌండేషన్ విత్తనం సేకరించుకోవాలి. రెండోది విత్తన దూరం పాటించాలి. ఒక్క టమాటాలో తప్పితే చాలాపంటల్లో తరచూ పరపరాగ సంపర్కం లేదా పూర్తిగా పరపరాగ సంపర్కం జరుగుతుండటంతో విత్తనంలో కల్తీలు ఏర్పడి నాణ్యత తగ్గుతుంది. కావున వేర్పాటు దూరం కచ్చితంగా పాటించాలి. వేర్పాటు మూడు రకాలుగా ఉంటుంది. విత్తనోత్పత్తి చేపట్టే ఒక పంట వేసిన తర్వాత కనీసం 20 నుంచి 25 రోజుల తర్వాత వేరే విత్తన పంట వేసుకోవాలి. అప్పుడు కల్తీ ఉండదు. అది సాధ్యం కాకపోతే సిఫార్సు మోతాదులో వేర్పాటు దూరం పాటించాలి. మూల విత్తనం, బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ ధ్రువీకరణ విత్తనం ఉత్పత్తిలో ధ్రువీకరణ విత్తన ఉత్పత్తిని మాత్రమే రైతులు చేపట్టవచ్చు.
తీగజాతి కూరగాయలు..
కాకర, గుమ్మడి, బూడిద గుమ్మడి, దోస రకాల్లో వాటి పండ్లరంగు, కాడ రంగు, తీగలు ఎండిపోవడాన్ని బట్టి పక్వానికి వచ్చాయని నిర్ధారించుకోవచ్చు. పండిన పండ్లను కోసి చేతితో విత్తనాన్ని వేరు చేసి సేకరించుకోవాలి. తర్వాత నీటితో కడిగి ఆరబెట్టుకోవాలి. ఎకరా పంట నుంచి 120 నుంచి 320 కిలోల విత్తనం పొందవచ్చు. అన్ని కాయగూరల విత్తనోత్పత్తికి కోత అనంతరం పండ్లను 5 నుంచి 7 రోజులు నిల్వ ఉంచినట్లయితే విత్తనం బాగా అభివృద్ధి చెంది నాణ్యంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment