పత్తి పండు! | Cotton Fruit: Health Benefits | Sakshi
Sakshi News home page

పత్తి పండు!

Published Wed, Jan 1 2025 12:29 AM | Last Updated on Wed, Jan 1 2025 7:48 AM

Cotton Fruit: Health Benefits

అవును. దీని పేరు పత్తి పండే! వేసవి తాపాన్ని తీర్చే అద్భుతమైన తినదగిన పత్తి పండు ఇది. మధ్యకు కోస్తే దీంట్లో తెల్లని రూది మాదిరిగా కనిపించే గుజ్జు ఉంటుంది. విలక్షణమైన ఈ పండుకు ‘సెంతొల్‌’, ‘కాటన్‌ ఫ్రూట్‌’తో పాటు చాలా మారు పేర్లున్నాయి. కెచపి, లాల్లీ ఫ్రూట్, వైల్డ్‌ మాంగోస్టీన్, రెడ్‌ సెంతొల్, సెంతుల్, సౖయె, వైసయన్‌.. ఇలా అనేక పేర్లుతో పిలుస్తారు.

ఆగ్నేయాసియా ప్రాంతమే పత్తి పండు పుట్టిల్లు. దీని శాస్త్రీయ నామం ‘సండోరికం కోయెట్జాపే’.  మెనియాసీ లేదా మహోగని కుటుంబానికి చెందినది. ఈ పండు గుజ్జు తీపి, వగరు కలిసిన చిత్రమైన రుచి కలిగి ఉంటుంది. ఆగ్నేసియా దేశాల్లోని ఉష్ణమండల లోతట్టు భూముల్లో విస్తృతంగా సాగవుతున్న పండ్ల చెట్టు ఇది. తాజా పండ్ల వాడకమే ఎక్కువ. 

సంతొల్‌ చెట్లు లోయర్‌ ఆల్టిట్యూడ్‌ ప్రాంతాల్లో చాలా ఎత్తుగా, వేగంగా పెరుగుతాయి.  సాధారణంగా 15–40 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చగా 4–10 అంగుళాల పొడవు పెరుగుతాయి. పూలు 1 సెం.మీ. పొడవున ఆకుపచ్చ, పసుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. 

పత్తి పండు గుండ్రంగా, ఆపిల్‌ సైజులో ఉంటుంది. పండు లోపల రసంతో కూడిన ఐదు దూది తొనల మాదిరిగా ఉంటాయి. 3–4 విత్తనాలుంటాయి. దీని గుజ్జు వగరగా ఉంటుంది. పండు పండిన తర్వాత తియ్యగా మారుతుంది. కొన్ని రకాల సంతొల్‌ పండ్లు తక్కువ తీపిగా, మరికొన్ని రకాలు మరింత తీపిగా ఉంటాయి. బాగా తియ్యగా ఉండే పండ్లు ఆపిల్‌ రుచికి దగ్గరగా ఉంటాయి.

రెండు రకాలు
సంతొల్‌ పండుకు సంబంధించి ప్రధానంగా రెండు వంగడాలు ఎరుపు (ఎస్‌.కోయెట్జాపే), పసుపు (ఎస్‌. నెర్వోసమ్‌) రంగుల్లో ఉంటాయి.  ఎరుపు రంగులో ఉండే రకం పత్తి పండ్లను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. మార్కెట్లలో ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. కొమ్మకు కాయకు మధ్య ఉండే కాడలు, తొక్క, పండు రుచిలో ఈ రెండు రకాల పండ్లకు స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. 

పసుపు సంతొల్‌ పండు తొడిమెలు 15 సెం.మీ. పొడవున ఉంటాయి. పండు కోతకు వచ్చే సమయానికి తొడిమలు కూడా పసుపు రంగులోకి మారతాయి. ఎరుపు సంతొల్‌ పండ్ల తొడిమెలు 30 సెం.మీ. వరకు పెరిగి, ఎరుపుగా మారతాయి. పసుపు పండు తొక్క పల్చగా, రుచి తియ్యగా ఉంటుంది. ఎర్ర పండు తొక్క మందంగా, రుచి కొంచెం వగరుగా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు
1. కేన్సర్‌ నివారణ: సంతొల్‌ పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేన్సర్‌ కణాల వ్యాప్తిని ఇవి అరికడతాయి. ఈ పండు నుంచి సంగ్రహించే సెకోట్రిటెర్పెన్, కోయెట్జాపిక్‌ ఆసిడ్‌ అనే రెండు బయోయాక్టివ్‌ కెమికల్స్‌ కేన్సర్‌ కణాలపై సైటోటాక్సిక్‌ ప్రభావం చూపుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఎలుకల స్తన గ్రంధుల్లో గడ్డల సైజును, సంఖ్యను తగ్గించగలిగాయి. మనుషుల్లో కేన్సర్‌ కణాలను ఇవి హరిస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.

2. ఆరోగ్యకరమైన దంతాలు: పత్తి పండ్లు లాలాజలానికి సంబంధించిన గ్రంధులను ఉత్తేజపరచటం ద్వారా మరింత లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. నోట్లో హానికారక క్రిములను నశింపజేయటం ద్వారా దంతాల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

3. ఎల్‌డిఎల్‌ను తగ్గిస్తాయి: సంతొల్‌ పండులో పెక్టిన్‌ అనే జీర్ణమయ్యే పీచు ఉంటుంది. లో డెన్సిటీ లిపో్రపొటీన్‌ (ఎల్‌డిఎల్‌) రక్తంలో ఎక్కువగా ఉంటే రక్తపోటు, గుండెపోటు తదితర గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. పెక్టిన్, హెచ్‌డిఎల్‌లు కలసి ఎల్‌డిఎల్‌ను రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరకుండా చూస్తాయి. తద్వారా సంతొల్‌ పండు గుండె జబ్బుల్ని నివారిస్తుంది.

4. బరువు తగ్గిస్తుంది: శరీరపు అధిక బరువు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, హార్మోన్‌ అసమతుల్యత వంటి అనేక సమస్యలకు కారణం. ఈ పండ్లలో జీర్ణమయ్యే, కాని పీచు పదార్థాలు ఉంటాయి. తిండి యావ తగ్గించటం ద్వారా ఊబకాయం తగ్గటానికి, ఆరోగ్యం మెరుగుపడడానికి దోహదం చేస్తుంది.

5. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది: పత్తి పండులోని క్వెర్సెటిన్‌ అనే యాంటాఆక్సిడెంట్‌ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కణాలను బాగు చేయటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పీచు పదార్థం ్రపోబయాటిక్‌ మైక్రోఆర్గానిజమ్స్‌ని ఉత్తేజపరచి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది. విటమిన్‌ సి కూడా పుష్కలంగా ఉంటుంది.

6. రక్తహీనత, అల్జిమర్స్‌ను తగ్గిస్తుంది: దేహంలో సరిపోయినంతగా ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేకపోతే రక్తహీనత కలుగుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ చలనానికి ఐరన్‌ అవసరం. ఈ పండ్లలోని విటమిన్‌ సి వల్ల ఐరన్‌ను ఇముడ్చుకోగల శక్తిని జీర్ణవ్యవస్థ పెంచుకుంటుంది. ఇందులో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతూ ల్జిమర్స్‌ ముప్పు నుంచి తప్పిస్తాయి.

7. రక్తంలో చక్కెర  నియంత్రణ: ఈ పండు గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. కాబట్టి గ్లూకోజ్‌ను నెమ్మదిగా రక్తంలో కలిసేందుకు దోహదం చేస్తుంది. తద్వారా బ్లడ్‌ సుగర్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది.

8. చర్మ సౌందర్యం: చర్మంలోని కణాల మధ్య కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి కొల్లాజెన్‌ ఉపయోగపడుతుంది. ఇది ఏర్పరడడానికి ఈ పండ్లలోని విటమిన్‌ సి దోహదపడుతుంది. ఈ పండ్లలోని శాండ్రోనిక్‌ ఆసిడ్, బ్రయోనోటికాసిడ్‌లు అలెర్జీలను నివారిస్తాయి. చర్మంపై పొక్కులు, సోరియాసిస్, ఇతర చర్మ సంబంధమైన సమస్యలకు చేసే చికిత్సలో ఈ పండ్లలోని సహజ స్టెరాయిడల్‌ సపోజెనిన్, అల్కలాయిడ్స్‌ ఉపయోగపడతాయి. ఈ చెట్టు బెరడులో సపోజెనిన్‌ ఉంటుంది. తామర, తదితర ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను తగ్గించే చికిత్సకు ఇది ఉపకరిస్తుంది. ఈ చెట్టు బెరడు పొడిని చర్మంపై లేపనం చేస్తే ఇన్షెక్షన్లు తగ్గుతాయి.

9. స్త్రీ వ్యాధుల్ని తగ్గిస్తుంది: స్త్రీ జననాంగంలో ఇన్షెక్షన్ల చికిత్సకు ఈ పండుతో పాటు చెట్టు బెరడు కూడా ఉపయోగపడుతుంది. ఈ బెరడు వేసి ఉడికించిన కషాయంతో యోనిని రోజూ శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

విలువ ఆధారిత ఉత్పత్తులు...
థాయ్‌ వంటకాల్లో, సలాడ్లలో సంతొల్‌ పండ్ల ముక్కలను వాడుతుంటారు. ఈ పండ్లతో తయారు చేసే సోం టామ్‌ అనే ఉత్పత్తిని రొయ్యల కూరల్లో వాడతారు. ఈ పండ్ల తరుగుతో తయారు చేసే సినటొలన్‌ అప్పెటైజర్‌గా వాడతారు. అనేక వంటకాల్లో వగరు రుచి కోసం కూడా పత్తి పండు తరుగును వాడుతూ ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement