కల్తీ, అపరిశుభ్ర ఆహారంపై నగరవాసుల్లో భయం భయం..
25–35 శాతం వరకూ రెస్టారెంట్ల బిజినెస్ తగ్గినట్టు అంచనా
తాజా దాడుల ప్రభావం..
వారాంతపు రోజుల్లో..నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో సీట్ దొరకాలంటే కనీసం గంట నుంచి 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అంతటి రద్దీ ఇప్పుడు లేదు. వేళా పాళా లేకుండా ఐస్‌క్రీములూ, పేస్త్రీలూ లాగించే నగర యువత తమ అలవాటును కొనసాగించడానికి జంకుతున్నారు. నగరవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న దాడుల్లో బయటపడుతున్న విషయాలే దీనికి కారణం.
సాక్షి హైదరాబాద్: పేరుగొప్ప రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, సూపర్ మార్కెట్లు...ఒకటేమిటి? కాదేదీ కల్తీ కనర్హం కాదేదీ ఆరోగ్య కారకం..అన్నట్టుగా నగరంలో పరిస్థితి దిగజారిందని తాజాగా అధికారుల దాడుల్లో వెల్లడైంది. నగరంలో ఫుడ్ లవర్స్‌కి ఫేవరెట్ బిర్యానీ సెంటర్లు, బ్రాండెడ్ ఐస్‌క్రీమ్ పార్లర్లు సైతం ప్రమాణాలు పాటించడంలో దారుణంగా వెనుకబడి ఉన్నాయని తేలింది.
సోషల్ మీడియాలో హల్‌చల్...
ఈ దాడులలో వెల్లడైన ఆహార వ్యాపారుల నిర్వాకాలు అటు ప్రధాన మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాలో కల్తీ ఉత్పత్తులు, నిల్వ ఆహారపదార్ధాల కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం సిటిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపి ంచింది. అదే సమయంలో లక్డీకాపూల్‌లోని ద్వారకా హోటల్‌లో క్యారెట్ హల్వా తిన్న కస్టమర్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడని వార్తలు సంచలనం సృష్టించాయి. ఒకదానికి ఒకటి తోడైనట్టుగా జరిగిన పరిణామాలతో సిటీలోని ఫుడ్ బిజినెస్ ఢమాల్ అయింది.
25 నుంచి 35 శాతం పడిపోయిన వ్యాపారం...
ప్రస్తుతం బయటి ఆహారం అంటేనే నగర వాసుల్లో భయం ఏర్పడిందని, దీనికి గత 3 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే కారణమని జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని అంగీకరించారు. తమ రెగ్యులర్ గెస్ట్స్ సంఖ్యలో భారీగా తేడా వచి్చందనీ, వచ్చినవారు కూడా..ఫుడ్ ఆర్డర్ చేస్తూనే సందేహాస్పదంగా చూస్తున్నారని, తరచి తరచి అడుగుతున్నారని ఆయన చెప్పారు. నగరవ్యాప్తంగా ఈ పరిస్థితుల వల్ల కనీసం 25 నుంచి 35 శాతం వరకూ ఫుడ్ బిజినెస్ దెబ్బతిన్నదని రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. కొందరు చేసిన తప్పుకి ఎందరో బలవుతున్నారని వీరు వాపోతున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్‌కు వచ్చే ఆర్డర్లు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు కొందరు డెలివరీ బాయ్స్ చెప్పారు.
కొనసాగుతున్న దాడులు...వెల్లడవుతున్న నిర్వాకాలు...
మరోవైపు జీహెచ్‌ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం కూడా రెస్టారెంట్లపై తమ దాడులు కొనసాగించారు. మసాబ్ ట్యాంక్‌లోని ప్యారడైజ్ బిర్యానీ సెంటర్, అస్లీ హైదరాబాదీ ఖానాలో నిర్వహించిన దాడుల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్, నిల్వ ఆహారాన్ని గుర్తించారు. కీటకాలు రాకుండా వంటగది కిటికీలకు మెష్ సైతం ఏర్పాటు చేయలేదని, పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ లేవు తదితర ఉల్లంఘనలు తేల్చారు. అలాగే ప్యారడైజ్ బిర్యానీ సెంటర్‌లో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్‌లో సరైన ప్రమాణాలు లేవని గుర్తించారు. గత 4 రోజులుగా సాగుతున్న దాడుల్లో 100కిపైగా రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ జాయింట్స్, ఫుడ్ సప్‌లై యాప్స్..వంటివి తనిఖీలు చేసి దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి. ఇదే ప్రస్తుతం నగరవాసుల్లో బయటి తిండి అంటే భయపడేట్టుగా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment