పోలింగ్ ‘స్వీప్’ చేసేందుకు కసరత్తు
‘ఇంటింటికీ బొట్టు’ నుంచి ‘పరమపద సోపానం’ వరకు
సంకల్ప పత్రాల నుంచి ఫ్లాష్ మాబ్స్ దాకా..
స్వచ్ఛ ఆటోల మైకులు.. ఎస్‌ఎంఎస్‌లతోనూ..
ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌లు.. అవగాహన కార్యక్రమాలు
జీహెచ్‌ఎంసీ సిబ్బంది బస్తీలు, కాలనీల్లోని ఇళ్లకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మీకు ఓటుందా అని అడిగి.. ఒకవేళ ఓటు ఉంటే.. తప్పకుండా ఓటేయాలంటూ పోలింగ్ కేంద్రం వైపు అడుగులేసేలా వారిని ఒప్పిస్తున్నారు.
బంజారాహిల్స్‌లోని జీవీకే వన్‌మాల్‌లో ఇటీవల ఓ ఫ్లాష్‌మాబ్‌లో భాగంగా మోడరన్, శాస్త్రీయ నృత్యాలూ ప్రదర్శించారు. ఎందుకిదంతా అని చూస్తే ‘నా ఓటు–నా హక్కు’ నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని కనిపించారు. జీహెచ్‌ఎంసీలోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల సభ్యులు, రిసోర్స్‌పర్సన్స్ వారి పిల్లలతో నిర్వహించిన ఈ కార్యక్రమం మాల్‌కు వచ్చిన వారిని ఆకట్టుకుంది. ఓటుపై ఆలోచనలో పడేసింది.
పరమపద సోపానం (వైకుంఠపాళి) ఆటలో స్వర్గానికి చేరుకునేందుకు మెట్లెక్కించే నిచ్చెనలు, పాతాళానికి పడిపోయేలా మింగేసే పాములు ఉండటం తెలిసిందే. ఆ ఆటలో ఎప్పుడు పాము మింగుతుందో, ఎప్పుడు నిచ్చెన ఎక్కుతామో తెలియదు కానీ.. ప్రజాస్వామ్యానికి కీలకమైన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం భవిష్యత్ అంధకారమవుతుంది అని చెబుతూ ఏ పనులు చేస్తే నిచ్చెన ఎక్కవచ్చో, ఏవి చేస్తే పాతాళానికి పడిపోతారో తెలియజేసేలా ఖైరతాబాద్ సర్కిల్‌లో పరమపద సోపానం ఆటతోనూ అవగాహన కల్పించారు.
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్షరాస్యతశాతం ఎక్కువగా ఉన్నా.. ఎన్నికలకు సంబంధించి నిరక్షరాస్యులుగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. తమ భవిష్యత్‌కు తగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎన్నికల అక్షరాస్యులుగానూ మలిచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 287 ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కూలీనాలీ చేసుకునే ప్రజలు, ప్రైవేట్ వ్యాపారాలు సాగిస్తున్న వారితోపాటు ఉద్యోగుల్లో సైతం ఇదే వైఖరి ఉంది. అందుకే వారికి కూడా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులతో 158 ఓటర్ అవేర్‌నెస్ ఫోరమ్స్ ఏర్పాటు చేసి వివిధ కార్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
వీటితోపాటు 584 పోలింగ్ బూత్‌ల పరిధిలో అవేర్‌నెస్ గ్రూపులు ఏర్పాటు చేశారు. తమ బూత్ పరిధిలోని వారిని పోలింగ్ కేంద్రాల దాకా అడుగేసేలా చేయడం ఈ గ్రూపుల పని. ‘వాక్ టు పోలింగ్ స్టేషన్’ పేరిట కార్యక్రమాలు చేపడుతూ పోలింగ్ శాతం పెరిగేందుకు పనిచేస్తున్నాయి.
ఇంకా ఏం చేస్తున్నారంటే..
18 ఏళ్లలోపు విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులందజేస్తున్నారు. ఓటరు చైతన్యం కోసం రూపొందించే వీడియోల్లో ఉత్తమమైన పది వీడియోలకు రివార్డులివ్వనున్నారు. బూత్‌లెవెల్ అధికారులు తమ బూత్‌లో పోలింగ్‌శాతాన్ని గతంలో కంటే పదిశాతం పెంచితే రూ. 5 వేలు రివార్డుగా ఇచ్చే యోచనలో ఉన్నారు. ఆదివారం నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5కే రన్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తాము ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు.
ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ బోర్డులపై ఎన్నికల సమాచారం తెలియజేస్తున్నారు. ఓటరు అవగాహనకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోనూ ఎన్నికలకు సంబంధించిన సమాచారం పొందుపరుస్తున్నారు. వారానికోమారు ఓటు వేయాల్సిందిగా సూచిస్తూ ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయ్‌లెట్ల వద్ద ఓటరు అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే స్వచ్ఛఆటోల మైకుల ద్వారానూ ప్రచారానికి సిద్ధమయ్యారు.
ఇప్పటి వరకు..
» స్వీప్(సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కింద నా ఓటు హక్కును వినియోగించుకుంటాను అనే ప్రతిజ్ఞతో ప్రసాద్స్ ఐమాక్స్‌లో, కొన్ని పార్కుల్లో భారీ తెరలపై సంతకాల సేకరణ చేపట్టారు.
» జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో, పాతబస్తీలోని మక్కా మసీదులోనూ ఓటర్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు.
» ఓటు వేస్తాననే సంకల్ప పత్రాలను విద్యార్థులకు అందజేస్తూవాటిపై వారి తల్లిదండ్రులు సంతకాలు చేశాక తిరిగి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు అలా దాదాపు రెండు లక్షల సంకల్ప పత్రాలు సేకరించారు.
» ఓటుహక్కు గురించి బస్తీల్లో, కాలనీల్లో క్విజ్‌లు, మెహందీలు, రంగోలి వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులందజేస్తూ ఆసక్తి కల్పిస్తున్నారు.
» ఒక ఆదివారం హెరిటేజ్ వాక్ నిర్వహించిన సందర్భంగా దారుల్‌షిఫా నుంచి ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు వరకు ఓటు హక్కుకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్ల స్టాండ్లు ఏర్పాటు చేశారు.
» పార్కులు, బస్‌స్టేషన్లు, గోడలపై రాతల ద్వారానూ, రేషన్‌షాపులు, సిటిజె¯న్ సర్వీస్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
» ఓట్’ అనే అక్షరాల్లా కనిపించేలా విద్యార్థులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల దాకా..
ఎన్నికలు జరిగేంత వరకు ఇలా వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో స్వీప్ కార్య క్రమాలు నిర్వహించనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ తెలిపారు. బొటానికల్ గార్డెన్ వద్ద ఇప్పటికే నిర్వహించిన 2కే రన్‌లో సీఈఓ వికాస్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment