‘హైడ్రా’ | - | Sakshi
Sakshi News home page

‘హైడ్రా’

Published Tue, Jul 2 2024 12:28 PM | Last Updated on Sat, Jul 6 2024 12:12 PM

‘హైడ్రా’

‘హైడ్రా’

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, సిటీ ట్రాఫిక్‌ విభాగాల నుంచి స్పెషల్‌ టీమ్స్‌

శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల వరకు సేవలు

విపత్తులప్పుడే కాకుండా నిరంతర సేవలు..నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ

హోర్డింగులు, తాగునీరు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు తదితర అంశాల్లోనూ సేవలు

సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

విపత్తుల నిర్వహణకు

చారిత్రక నిర్మాణాల పునరుద్ధరణ

సిటీలోని చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్‌ సమీపంలోని ఆయుర్వేద హాస్పిటల్‌, నిజామిమా అబ్జర్వేటరీ, గుడిమల్కాపూర్‌ కోనేరు లాంటి వివిధ చారిత్రక ప్రదేశాలపై జీహెచ్‌ఎంసీ ప్రదర్శించిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను చూసిన సీఎం వాటిని పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ఉన్న వివిధ మార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటిలో మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అనుసంధానం చేసేందుకు వీలైన వాటిని గుర్తించి, అందులోనే కలపాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ విపత్తు నిర్వహణ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగానికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వ్యవస్థాగత మార్పులతో పాటు, బాధ్యతల పంపిణీ జరగాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హెచ్‌ఎండీఏ, మూసీ డెవలప్‌మెంట్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ భౌగోళిక పరిధిని విస్తరించనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు ఈ విభాగం సేవలు అందించేందుకు అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఇకపై ఈ విభాగాన్ని ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా)’ అని పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగానికి డైరెక్టర్‌గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్‌ డైరైక్టర్లుగా ఉండేలా చూడాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, సిటీ ట్రాఫిక్‌, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక టీంలు ఈ విభాగంలో నియమించాలని సూచించారు. కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం సిటీ ప్రజలకు నిరంతరం సేవలందించేలా పునర్వవస్థీకరణ జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటిలో ‘హైడ్రా’ క్రియాశీలంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ

జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు రెండువేల కిలోమీటర్ల మేర ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించటం, సిటీలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవకుండా కాపాడే కీలక బాధ్యతలను ఈ విభాగమే చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలందిస్తుంది. అందుకు వీలుగా ఈ విభాగం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది, విధులు, నిధుల కేటాయింపు, బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఎంఆర్‌డీపీ పనులు, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఎంఆర్‌డీపీ) పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌ సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డు, సిటీ ట్రాఫిక్‌ విభాగాల నుంచి స్పెషల్‌ టీమ్స్‌

శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల వరకు సేవలు

విపత్తులప్పుడే కాకుండా నిరంతర సేవలు..నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ

హోర్డింగులు, తాగునీరు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు తదితర అంశాల్లోనూ సేవలు

సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement