Hyderabad: కీలకమైన మూడు పోస్టుల్లో కొత్త బాస్‌లు | New Commissioners For Four Zones In Major Departments Of GHMC, HMDA And WB | Sakshi
Sakshi News home page

Hyderabad: కీలకమైన మూడు పోస్టుల్లో కొత్త బాస్‌లు

Jun 25 2024 9:39 AM | Updated on Jun 25 2024 11:36 AM

New commissioners for four zones

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డులకు మారిన సారథులు  
 ఆమ్రపాలి, సర్ఫరాజ్, అశోక్‌రెడ్డిలకు బాధ్యతలు 
 ఈవీడీఎం డైరెక్టర్‌గా రంగనాథ్‌ 
 బల్దియా నాలుగు జోన్లకు కొత్త కమిషనర్లు  
 ఓఆర్‌ఆర్‌ పరిధి లక్ష్యంగా పనులు 
 సమూల ప్రక్షాళన దిశగా చర్యలు

 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు ముఖ్య విభాగాలైన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ బోర్డుల్లో ఉన్న బాస్‌లు మారారు. వారిస్థానే కొత్త బాస్‌లను నియమించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రేటర్‌ పరిధిలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగడం ఇదే ప్రథమం.  ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ఆయా విభాగాల చీఫ్‌లు మారతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా జరగలేదు.

 తాజాగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా నగరంలోని ముగ్గురు చీఫ్‌లతో పాటు మరికొందరు అధికారులను కూడా బదిలీ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్‌ఎస్‌ హయాంలో కీలకశాఖల్లో  ఉన్నవారిని వెంటనే మారుస్తారనుకున్నప్పటికీ, రాజకీయ పరిణామాలు, లోక్‌సభ ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో పూర్తిస్థాయిలో బదిలీలు జరగలేదు. పాలనలో, అభివృద్ధిలో తమదైన మార్కు చూపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వాటిని అమలు చేయడం, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు ఆయా సంస్థల్లో ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలు జరిగినట్లు భావిస్తున్నారు.  

ప్రజా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా.. 
నగరానికి సంబంధించినంత వరకు ఓఆర్‌ఆర్‌ వరకు యూనిట్‌గా పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓఆర్‌ఆర్‌ వరకున్న శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూడా జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం..ఒకటే పెద్ద కార్పొరేషన్‌ లేదా మూడు నాలుగు కార్పొరేషన్లుగా చేసే ఆలోచనలున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీయేల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి భారీ అవినీతి జరిగిందనే అభిప్రాయాలున్నాయి. వాటిపై ఉన్న ఆ ముద్రను తొలగించడంతోపాటు పౌరులకు సకాలంలో సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. 

అంతేకాకుండా ‘వైబ్రెంట్‌ హైదరాబాద్‌’  కోసం మెగా మాస్టర్‌ప్లాన్‌–2050తో ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ఆరి్థకాభివృద్ధితోపాటు మొబిలిటీ, బ్లూ, గ్రీన్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్‌ కీలకంగా ఉన్నాయి. ఓవైపు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు మరోవైపు పెరుగుతున్న జనావాసాలన్నింటికీ సురక్షిత నీరు, వందశాతం మురుగుజలాల శుద్ధి కోసం ఎస్టీపీల పనులు జరుగుతున్నాయి. ఓఆర్‌ఆర్‌ వరకు ఎలాంటి విపత్తులు జరిగినా వెంటనే ఆదుకునేలా ఉండేందుకు విపత్తు నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగానే ఈవీడీఎం విభాగంలోని డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లను పెంచుతున్నారు. 

ఏడాది గడవకుండానే బదిలీ అయిన రోనాల్డ్‌రాస్‌ 
👉 గత జూలై 5వ తేదీన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోనాల్డ్‌రాస్‌ను ఇంధనశాఖ సెక్రటరీగా బదిలీ చేశారు.  
👉 జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా హెచ్‌ఎండీఏ జాయింట్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌)ఎండీ ఆమ్రపాలికి పూర్తిస్థా యి బాధ్యతలప్పగించారు. 
👉 హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఈసీలో జాయింట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను   నియమించారు.  
👉  çహార్టికల్చర్‌ డైరెక్టర్‌ కె.అశోక్‌రెడ్డిని వాటర్‌బోర్డు ఎండీగా నియమించారు.  
👉  మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం..కొత్తగా జాయింట్‌ ఎండీ పోస్టును సృష్టించి రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ పి.గౌతమిని నియమించింది.  

నాలుగు జోన్లకు కొత్త కమిషనర్లు.. 
జీహెచ్‌ఎంసీ జోన్ల ప్రక్షాళనే లక్ష్యంగా నాలుగు జోన్లలో కొత్త జోనల్‌ కమిషనర్లను నియమించారు. ఇటీవల ఖాళీ అయిన ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా అనురాగ్‌ జయంతిని, ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా హైదరాబాద్‌ అడిషనల్‌ కమిషనర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ను, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా జోగులాంబ గద్వాల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌ను నియమించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌గా ఉన్న పి.ఉపేందర్‌రెడ్డిని శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా   నియమించారు. జోన్లలో అవినీతిని అరికట్టేందుకు  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ బదిలీలతో మొత్తం ఆరు జోన్లకు గాను మూడు జోన్లలో ఐఏఎస్‌ అధికారులున్నారు. ఇప్పటి వరకు శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌తో పాటు రెవెన్యూ, ఐటీ విభాగాల అడిషనల్‌ కమిషనర్‌గా ఉన్న స్నేహశబరీ ను జడ్‌సీ పోస్టు నుంచి బదిలీ చేశారు.  

ఈవీడీఎం ౖడైరెక్టర్‌గా రంగనాథ్‌ 
భారీ వర్షాలు, అగి్నప్రమాదాలు వంటి ఘటనలు జరిగినప్పుడు ఎదురవుతున్న విపత్తులను  ఎదుర్కొనేందుకు తక్షణ స్పందనతో పనిచేస్తున్న  ఈవీడీఎం డైరెక్టర్‌గా ఉన్న ప్రకాశ్‌రెడ్డిని టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించారు.  

డిప్యూటీ కలెక్టర్లు రిలీవ్‌  
ఎన్నికల సందర్భంగా జీహెచ్‌ఎంసీకి వచి్చన డిప్యూటీ కలెక్టర్లలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు కె. శివకుమార్, డి. శ్రీధర్, ఎన్‌. విజయలక్షి్మలను ఐఏఎస్‌ల బదిలీ ఉత్తర్వులకు   ముందే జీహెచ్‌ఎంసీ నుంచి రిలీవ్‌ చేశారు. వీరిలో శివకుమార్‌ సంతోష్‌ నగర్‌ సర్కిల్‌ డీసీగా పనిచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు కూడా ముగిసినందున వీరికి పెద్దగా పనులేమీ లేకపోవడంతో  రిలీవ్‌ చేసినట్లు తెలుస్తోంది.  

ఆయన స్టైలే వేరు.. 
కీలకమైన శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌గా పి.ఉపేందర్‌రెడ్డిని నియమించడం జీహెచ్‌ఎంసీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆయన పనితీరు, ట్రాక్‌ రికార్డు ఆధారంగానే ప్రభుత్వం ఆయనను శేరిలింగంపల్లి జడ్‌సీగా నియమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎల్‌బీనగర్‌ జడ్‌సీగా, బోడుప్పల్‌ కమిషనర్‌గా పనిచేసినప్పుడు ఆయన పలు అవార్డులు, రివార్డులు పొందారు. బోడుప్పల్‌లో పచ్చదనం పెంపు కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నగదు రివార్డు

అందజేసింది. బోడుప్పల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఆయన చేసిన పారిశుధ్య కార్యక్రమాలు చూసే అప్పటి మేయర్‌ బొంంతు రామ్మోహన్‌ ఆయన్ను జీహెచ్‌ఎంసీకి రప్పించారు. ఎల్‌బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు అక్కడ వరదనివారణకు  ఆయన రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టుతోనే నగరమంతటికీ ఆ విధానాన్ని వర్తింపచేస్తూ  
ఎస్‌ఎన్‌డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం)కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

టాస్‌్కఫోర్స్‌ డీసీపీగా సుదీంద్ర 
ప్రస్తుతం ఏసీబీలో జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు 
నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌ కమిషనర్స్‌ టాస్‌్కఫోర్స్‌ డీసీపీగా నాన్‌–క్యాడర్‌ ఎస్పీ స్థాయి అధికారి వైవీఎస్‌ సుదీంద్రను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సుదీంద్ర అవినీతి నిరోధక శాఖలో (ఏసీబీ) జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కే చెందిన ఈయన బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా పొందారు. 2012లో గ్రూప్‌–1 ద్వారా డీఎస్పీగా ఎంపికై పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. 
సుదీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.  

ముగ్గురు మహిళా అధికారుల తర్వాత.. 
గడిచిన తొమ్మిది నెలల కాలంలో టాస్‌్కఫోర్స్‌కు ముగ్గురు మహిళా అధికారులు నేతృత్వం వహించారు. సుదీర్ఘకాలం టాస్‌్కఫోర్స్‌ డీసీపీగా పని చేసిన పి.రాధాకిషన్‌రావును గత ఏడాది అక్టోబర్‌లో ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అప్పట్లో తొలి మహిళా డీసీపీగా ఐపీఎస్‌ అధికారి నిఖిత పంత్‌ నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి, కొత్త సర్కారు కొలువు తీరిన తర్వాత గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారిగా పోలీసు బదిలీలు జరిగాయి. ఆ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నిఖిత పంత్‌ స్థానంలో నాన్‌–క్యాడర్‌ ఎస్పీగా ఉన్న శ్రీ బాల దేవి నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈమెను బదిలీ చేసిన ప్రభుత్వం సాధన రష్మి పెరుమాల్‌ను నియమించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఈమె హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ డీసీపీగా వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement