మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది
మేయర్ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి
టైమ్‌కు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం...
బుధవారం ఉదయం 10.35 గంటలు
⇒ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఒకటో అంతస్తులోని ఒక కార్యాలయంలోకి వెళ్లారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో చూశారు. అవాక్కయ్యారు. 20 మందికి పైగా ఉండాల్సిన సెక్షన్‌లో ఐదుగురే ఉన్నారు. మిగతా వారేరీ? అంటే..ఇంకా రాలేదు అనే సమాధానం వచి్చంది.
⇒ అలాగే ఒక్కో కార్యాలయం చూసుకుంటూ ఒక అంతస్తు తర్వాత మరో అంతస్తుకు జీహెచ్‌ఎంసీలో వివిధ విభాగాలున్న ఆరంతస్తుల వరకు వెళ్లారు. అన్ని చోట్లా దాదాపుగా అవే సీన్లు. ఉద్యోగులు 10.30 గంటలకే కార్యాలయాల్లో ఉండాల్సి ఉండగా, 11 గంటలు దాటినా లేరు. 11.30 గంటలవుతున్నా పూర్తిస్థాయిలో లేరు.
⇒ అప్పుడే వస్తున్నవారిని చూసి ఆఫీస్ టైమెప్పుడు? ఎప్పుడు వస్తున్నారంటే ఆలస్యమైందంటూ తడబడుతూ సమాధానమిచ్చారు. మ. 12 గంటలైనా ఇంకా వస్తున్న వారున్నా రు. ఆ తర్వాత వచి్చన వారు సైతం ఉన్నారు. మేయర్ ఆకస్మిక విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో చాలామంది హడావుడిగా వచ్చారు. అన్ని విభాగాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులుండటంతో మేయర్ మండిపడ్డారు.
⇒ ప్రజాప్రభుత్వంలో ఇలా ఉంటే నడవదని, ‘ఉండాలనుకుంటే ఉండొచ్చు..లేకుంటే వెళ్లిపోవచ్చు’ అని సీరియస్ అయ్యారు. రేపట్నుంచి 10.35 గంటల వరకు మాత్రం హాజరు రిజిస్టర్లు కార్యాలయాల్లో ఉంచి, 10.40 గంటలకు తన కార్యాలయానికి పంపించాల్సిందిగా అధికారులకు సూచించారు. రాని వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతికి సూచించారు.
‘ఫేస్ రికగ్నిషన్’ అమలు చేస్తాం..
తనిఖీల అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, క్రమశిక్షణ, సమయపాలన పాటించని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రానివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులపై హెచ్‌ఓడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. పలు విభాగాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తూ, సాయంత్రం 4 గంటలకే వెళ్తున్నట్లు తన దృష్టికి రావడంతోపాటు పలు ఫిర్యాదులందడంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్ రికగి్నషన్ అటెండెన్స్‌ను కూడా అమల్లోకి తెచ్చే ఆలోచన ఉందన్నారు.
ఇది ఇక్కడ మామూలే..
మేయర్ తనకీ విషయం ఇప్పుడే తెలిసినట్లు చెప్పినప్పటికీ, బల్దియాలో అది సాధారణ తంతు. అందుకే ఒకసారి బల్దియాలో చేరిన వారు బదిలీలైనా పోకపోవడానికున్న కారణాల్లో ఇదీ ఒకటి. బల్దియా వ్యవహారాల గురించి బాగా తెలిసిన వారి సమాచారం మేరకు, మధ్యాహ్నం 12 గంటలైనా చాలామంది విధులకు రారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ‘లంచ్ టైమ్’ మొదలవుతుంది. బల్దియాలో సాధారణ లంచ్‌బ్రేక్ అంటూ లేదు. ఎవరిష్టం వారిది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ అది నడుస్తుంటుంది. 4 గంటలు దాటాక ఇళ్లకు తిరుగుముఖం ప్రారంభమవుతుంది. పై ఆదాయం వచ్చే వారు మాత్రం సీట్లలో సాయంత్రం 5.30 గంటలు దాటినా ఉంటారు. ఇక, కార్యాలయాల్లో ఉండేవారిలో సైతం అందరూ పనులు చేస్తున్నారని చెప్పలేం. కొందరు కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతుంటారు. కొందరు ఎక్కువ సమయంలో ఫోన్లలో యూట్యూబ్ చిత్రాలు చూస్తుంటారు. బల్దియాలోని వైఫై సదుపాయంతో నిరి్వరామంగా ఫోన్లు, కంప్యూటర్లతో కాలం గడుపుతారు. అలాగని అంకితభావంతో పనిచేస్తున్నవారు లేరని చెప్పలేం. కాకపోతే వారి సంఖ్య స్వల్పం. ఉదయం సమయానికే వచ్చి పొద్దుపోయేంత వరకు తలమునకలుగా పనులు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారివల్లే బల్దియా బతుకుతోంది.
నిజంగా చర్యలుంటాయా ?
మేయర్ హెచ్చరికల్ని ఎవరైనా ఖాతరు చేస్తారా అన్నది అనుమానమే. గతంలో ఆహార కల్తీ తనిఖీలకు సంబంధించి ఏ రోజు ఎన్ని తనిఖీలు జరిపారో, ఏం చర్యలు తీసుకున్నారో ఏ రోజుకారోజు సాయంత్రం తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు. అది ఏమాత్రం అమలవుతుందో సంబంధిత విభాగానికి, మేయర్ కార్యాలయానికే తెలియాలి.
బయోమెట్రిక్ ఉత్తుత్తిదేనా ?
కారి్మకులతోపాటు కమిషనర్ దాకా బయోమెట్రిక్ హాజరు వేయాలని గతంలో చెప్పారు. ఒకరిద్దరు కమిషనర్లు సైతం దాన్ని పాటించారు. కనీసం ఉద్యోగులైనా బయోమెట్రిక్ హాజరును వినియోగిస్తున్నారో, లేదో తెలియని పరిస్థితి మేయర్ తనిఖీతో వెల్లడైంది. నిజంగా వినియోగిస్తే అంత ఆలస్యంగా ఎందుకు వస్తారు? ఒకవేళ ఆలస్యంగా వచ్చినా వారికి పూర్తి జీతాలెందుకు చెల్లిస్తున్నారు? అన్నవాటికి సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి. కొన్ని సీట్లు ఖాళీగా ఉండటం తనిఖీలో గుర్తించిన
మేయర్..ఆ సీట్లు ఎవరివి అంటే వారి పేర్లు కూడా సహచరులు చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని సెక్షన్లలో నాలుగైదు రోజులకోమారు వచ్చి ఒకేసారి అన్ని రోజులకూ సంతకాలు పెట్టుకుంటారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇక బయోమెట్రిక్ ఎందుకు..దాని నిర్వహణకు లక్షలాది రూపాయల వ్యయమెందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జోన్లు..సర్కిళ్లలో..
ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే జోన్లు, సర్కిళ్లలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ ఇంకో సదుపాయం కూడా ఉంది. లేని వారి గురించి సంబంధిత సెక్షన్లలో అడిగితే ప్రధాన కార్యాలయానికి పనిమీద వెళ్లారని టక్కున సమాధానం చెబుతారు.
సర్క్యులర్ జారీ
మేయర్ ఆదేశాల నేపథ్యంలో చర్యలకు సిద్ధమైన సంబంధిత అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతి ఆ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులంతా కార్యాలయ వేళల మేరకు ఉదయం 10.30 గంటలకల్లా హాజరు కావాలి. పది నిమిషాల గ్రేస్ సమయం మాత్రం ఉంటుంది. అంటే 10.40 గంటల వరకు మినహాయింపు ఇస్తారు. జిల్లా ఆఫీస్ మాన్యువల్ మేరకు మూడు పర్యాయాలు అంతకంటే ఆలస్యంగా వస్తే ఒక సీఎల్‌గా పరిగణిస్తారు. తరచూ ఆలస్యంగా హాజరయ్యే వారిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment