నగర వీధుల్లో జీహెచ్‌ఎంసీ అధునాతన ట్రాక్స్
సోలార్ హంగులతో కిలోమీటర్లమేర నిర్మాణం
ఇటు పర్యావరణం, అటు ఆరోగ్యానికీ మేలు
ట్రాఫిక్ సమస్యలకు ప్రత్యామ్నాయ మార్గం
వారాంతాల్లో క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్స్
ఎటువైపు చూసినా ఆకాశమంత ఎత్తైన అద్దాల భవనాలు.. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిన రహదారులు.. కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు.. ఇది నగరంలోని రహదారుల పరిస్థితి.. దీంతో పాటు నగర శివారులోని టెక్ పార్కుల్లోనూ లక్షలాది మంది ఉద్యోగులతో ట్రాఫిక్ సమస్యలు తప్పడంలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కొంత కాలంగా వీధుల్లో సైక్లింగ్ ట్రెండ్ నడుస్తోంది. రహదారులకు సమాంతరంగా సైక్లింగ్ ట్రాక్‌లను జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేసింది. దీంతో టెకీల్లో చాలా మంది సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారంలో కొన్ని రోజులైనా సైకిల్‌పై కార్యాలయానికి వెళ్లాలని కొంత మంది రూల్ పెట్టుకుంటున్నారు. క్లబ్‌లుగా ఏర్పడి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలుకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడటం, ట్రాఫిక్‌లో సమయం, డబ్బు ఆదా, వాతావరణ కాలుష్య నివారణకు ఈ విధానం సహాయపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
టెక్కీలుగా స్థిరపడిన చాలా కుటుంబాల ఇళ్లల్లో కారు, మోటారు సైకిల్‌తో పాటు ఎలక్రి్టక్, గేర్, సాధారణ సైకిల్ తప్పనిసరిగా ఉంటోంది. మెట్రో స్టేషన్లకు, కూరగాయల మార్కెట్‌కు, వాకింగ్‌కో వెళ్లడానికి, ఐదు కిలో మీటర్ల లోపు పనులకు సైకిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. వివిధ సైక్లింగ్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో వారం ఒక్కో రకమైన థీమ్ ఉండేలా సెట్ చేసుకుంటున్నారు. వందలాది కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణాలు చేస్తున్నారు. ఆపై ట్రెక్కింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే వారాంతంలో కుటుంబ సభ్యులతో కలసి టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా కారు వెనకన తమ సైకిల్ కట్టుకుని పోతున్నారు. రిసార్ట్, ఫాం హౌస్, ఇతర డెస్టినేషన్‌లో సైక్లింగ్ చేస్తున్నారు.
డెడికేటెడ్ ట్రాక్స్ కోసం..
నగరంలోని సైక్లిస్టులంతా ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాక్‌లను డెడికేటెడ్ ట్రాక్‌లుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్, హైటెక్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. అయితే సాధారణ వాహనాలు సైతం ఈ సైకిల్ ట్రాక్‌పై నడిపిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాక్‌పై పదుల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌తో నిండిన రహదారిపై సైకిల్ తొక్కాలంటే భయమేస్తుదని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సైక్లింగ్ ట్రాక్స్‌కు బారికేడ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడంతో మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు సైకిల్ ట్రాక్‌పైకి వచ్చే అవకాశం ఉండదు. దీంతో సైక్లిస్టులు వేగంగా, ధైర్యంగా ముందకు సాగేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓఆర్‌ఆర్ సమీపంలో సోలార్ రూఫ్‌తో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ దేశంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరహాలో నగరాన్ని సైక్లింగ్ సిటీగా తీర్చిదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఏడేళ్ల నుంచి సైక్లింగ్..
చిన్న చిన్న ప్రయాణాలకు సైకిల్‌పైనే వెళతాను. ఏడేళ్ల నుంచి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తున్నాను. ప్రతి మహిళ సైక్లింగ్ చేయాలి. ఆరోగ్యం పరంగా చాలా ఉపయోగాలున్నాయి. ఇతరులపైఆధారపడకుండా స్వతహాగా బయటకు వెళ్లి కూరగాయలు, పాలు, ఇతర సామాగ్రి తెచ్చుకుంటా. ఆఫీస్‌కి వెళ్లేందుకు మెట్రో వరకూ సైకిల్‌పైనే వెళతాను.
సరికొత్త మోడళ్లు..
ప్రధానంగా టెక్ వీధుల్లో వివిధ మోడల్ సైకిళ్ల హవా కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు సైకిళ్లను వినియోగిస్తున్నారు. ఎత్తుపల్లాలు ఉన్నా సైక్లిస్టులకు ఇబ్బంది లేకుండా బ్యాటరీ, గేర్ సైకిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. రహదారికి సమాంతరంగా ఉన్నపుడు సైకిల్ తొక్కడం, ఎత్తు ఉన్నపుడు బ్యాటరీతో నడిపిస్తున్నారు. ఈ విధానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కొనుక్కోవడం ఇష్టం లేకుండా, తమకు నచ్చినప్పుడు సైకిల్ సవారీ చేయడానికి అద్దె ప్రాతిపదికన వందలాది సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి.
టైం పాస్ కోసం..
సైక్లింగ్ టైం పాస్ కోసం ప్రారంభించాను. 10 కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లడానికి కష్టంగా ఉండేది. క్రమంగా అసోసియేషన్ సభ్యులతో సంబంధాలు ఏర్పడ్డాయి. సైక్లింగ్ వల్ల లాభాలపై అవగాహన వచి్చంది. ఇప్పుడు 100 కిలో మీటర్ల వరకూ వెళ్లిపోతున్నాం. వీలైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం. సొంతంగా ఎస్కేప్ అండ్ ఎక్స్‌ప్లోర్ క్లబ్ స్థాపించాను. వారాంతంలో టూర్ ప్లాన్ చేస్తుంటాం.
– అశోక్, ఎస్కేప్ అండ్ ఎక్స్‌ప్లోర్ నిర్వాహకులు
21 వేల మంది సభ్యులు..
2011లోనే సైక్లింగ్ రివల్యూషన్ ప్రారంభించాము. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పర్యావరణం, ఆరోగ్యం, సమయం, డబ్బు ఆదాపై అవగాహన కల్పించాం. హైదరాబాద్ బైస్కిల్ క్లబ్‌ను స్థాపించాం. ప్రస్తుతం ఇందులో 21 వేల మంది సభ్యులున్నారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుంచి పారిస్ వరకూ 518 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాను. మూడున్నర రోజులు పట్టింది. ఢిల్లీ, ఛంఢీఘర్, చెన్నైలోనూ సైక్లింగ్ అసోసియేషన్స్ స్థాపించాం. సుమారు 6 వేల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఓఆర్‌ఆర్ సమీపంలో సైకిల్ ట్రాక్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం. 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ ట్రాక్ సిద్ధమైంది.
– మనోహర్, ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment