నగరంలో పెద్దసంఖ్యలో పెరుగుతున్న వేగన్స్
జీవహింసకు దూరంగా ఉండేందుకు..
జీవన విధానంలో మార్పు కోసం..
పాలు, పెరుగుకుసైతం దూరం
వారి కోసం నగరంలో ప్రత్యేక స్టాల్స్
చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొందరు మాత్రం మాంసాహారం ముట్టరు. కొందరేమో కొన్ని ప్రత్యేక వారాల్లో నాన్‌వెజ్ తినరు. కానీ మరికొందరు మరీ ప్రత్యేకం.. ఎందుకంటే వారు నాన్‌వెజ్ మాత్రమే కాదు.. కనీసం జంతువుల నుంచి తయారైన ఉత్పత్తులే తినరు. వారినే ఇప్పుడు వేగన్స్ అంటున్నారు. ఇటీవల వేగనిజం కాన్సెప్‌్టకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఖచి్చతంగా పాటిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నారు. అసలు వేగనిజం అంటే ఏంటి.. అసలు అటువైపు ప్రజలు.. ముఖ్యంగా యువత ఎందుకు మొగ్గు చూపుతున్నారని పరిశీలిస్తే పర్యావరణ పరిరక్షణ, జీవహింసకు దూరంగా ఉండాలని చాలామంది పేర్కొంటున్నారు.
పర్యావరణ, జంతు ప్రేమికుల్లో వేగన్‌గా మారాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయి. తీసుకునే ఆహారంలో పోషకాలు కావాలంటే ఒక్క మాంసాహారమే తినాల్సిన అవసరం లేదు. శాఖాహారంలోనూ శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు, ప్రోటీన్లు లభిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన స్టడీస్ ఆధారాలను ముందుంచుతున్నారు. జంతువుల నుంచి వచ్చే ముడిసరుకు ఆధారంగా తయారయ్యే ఉత్పత్తుల వలన కలిగే లాభాలు ఏంటి, వాటికి శాఖాహారపరంగా ప్రత్యామ్నాయాలను ఎలా సమకూర్చుకోవాలనే
ఆలోచనలకు పదును పెడుతున్నారు.
మాంసాహారం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా వినియోగించే కోడినే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక కోడి పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది. వేగంగా పెరగడానికి ఇస్తున్న స్టెరాయిడ్స్ వంటివి మానవ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయనే అంశాలను వివరిస్తున్నారు. అలాగే ప్రతి విషయంలోనూ ప్రస్తుత పరిస్థితుల్లో మాంసాహారం వల్ల రోగాలు కొనుక్కునట్లే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన శాఖాహారం తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. నగరంలో పూర్తిగా కాకపోయినా వారంలో ఒకటి రెండు రోజులైనా పూర్తిస్థాయి వేగన్‌గా మారిపోవాలని కోరుకుంటున్నారు. గత రెండేళ్లలో ఇటువంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీళ్లకు అనుగుణంగా నగరంలోని పలు ప్రైమ్ ప్రాంతాల్లో వేగన్స్ ఫుడ్ స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి శాఖాహార ఉత్పత్తులు అక్కడ లభిస్తున్నాయి.
జీవన విధానంలో మార్పు కోరుకున్నా..
ఒక కోడి లేదా మేక పెరగాలంటే కనీసం మూడు నెలల నుంచి రెండు మూడేళ్లు పడుతుంది. దాన్ని ఒక్క రోజులో తినేస్తారు. ఆ జంతువు పెరగడానికి ఎన్ని ప్రకృతి వనరులు కావాలి. అంటే రెండేళ్ల రిసోర్సెస్‌ను ఒక్క పూటలో ఆరగించేస్తున్నామన్నమాట. మాంసం తింటేనే ప్రోటీన్లు అంటారా.. వాటికి ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుందో అదే ఆహారం మనం తీసుకుంటే సరిపోతుంది కదా.. వేగన్‌గా మారడానికి ప్రకృతి, జీవహింస మాత్రమే కాదు. నా జీవన విధానంలో మార్పు కోరుకున్నా.. ఆచరిస్తున్నా. ప్రతివారం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పక్షుల సంరక్షణకు కార్యక్రమాలకు సమయం కేటాయిస్తా.
– వినయ్, ఆర్కిటెక్ట్
ఆరేళ్ల నుంచి ఆచరిస్తున్నాను
నాకు జీవహింస చేయడం నచ్చదు. అందుకే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులకు దూరంగా ఉంటాను. కాల్షియం కోసం పాలు తాగుతున్నాం.. నువ్వులు వినియోగిస్తే మన శరీరానికి అవసరమైన కాల్షియం వస్తుంది. పాలు కావాలంటే సోయాబ్సీన్‌తో తయారు చేసుకోవచ్చు. శాఖాహారంలోనూ పోషకాలన్నీ లభిస్తాయి. మాంసాహారమే కాదు లెదర్ బెల్టు, పర్సు, బూట్లు, జంతువుల నుంచి వచ్చే ఏ వస్తువులను వినియోగించను. సిల్క్ తయారు చేయడానికి లక్షల పురుగులను చంపాల్సి వస్తుంది. సిల్క్ వస్తువులకు దూరం. చికెన్ వంటి వంటకాలతో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఆరేళ్ల నుంచి పూర్తిగా మారిపోయాను.
– అఖిల్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment