సోషల్ మీడియా కాలంలోనూ పలువురికి హాబీగా
నవలలు, పొట్టి కథలు, ఆత్మకథలపై మక్కువ
లైఫ్ స్టైల్ కథా రచనలతో ఆకట్టుకుంటూ
పుస్తక రచనపైనా ఆసక్తి కనబరుస్తున్న యువత
ఈ మధ్య మంచి సినిమా వచ్చింది చూశావా బ్రో.. ఇన్‌స్టాలో కొత్త రీల్ ట్రెండింగ్‌లో ఉంది తెలుసా మచ్చా.. యూట్యూబ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది సెండ్ చేయాలా? ఈ తరం యువతను కదిపితే వారి నోటివెంట ఎక్కువగా వచ్చే మాటలు. మనలో చాలా మంది ఇలాగే మాట్లాడతారు కూడా. అదే ఏదైనా పుస్తకం గురించి చెప్పామనుకోండి.. పుస్తకమా.. పుస్తకం చదివే టైం ఎక్కడుంది.. అయినా ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతారు చెప్పండి! అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. నిజమే పుస్తక పఠనం ఈ తరం యువతలో తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ మనలో చాలా మంది ఈ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూనే ఏదో ఒక పుస్తకాన్ని చువుతూ ఉంటారు. మరికొందరైతే పుస్తకాలంటే పడి చచి్చపోతుంటారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ పుస్తకాలను తెగ చదివేస్తున్నారు.
ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ మాత్రమే చూసే ఈ తరం యువతీ, యువకుల్లో చాలా మంది పుస్తకాలు చదివే వాళ్లు కూడా ఉన్నారా అని మనలో కొందరికి డౌటనుమానం? అయితే అదంతా వట్టి అపోహేనని ఏటా జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వచ్చే స్పందన రుజువు చేస్తోంది. వేలాది మంది యువత ఈ ఫెయిర్‌లో లక్షల సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు బుక్ ఫెయిర్‌లో అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు.
నవలలకు ప్రాధాన్యం..
పుస్తకాలు చదివే వారిలో ఎక్కువగా నవలలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పొట్టి వీడియోలు, షార్ట్ న్యూస్ లాగే పొట్టి కథలు చదివేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ నిడివిలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసే నవలలకు యువత ఎక్కవగా అట్రాక్ట్ అవుతోంది. ఇక, వచన కవిత్వంపై కూడా యూత్ మనసు పారేసుకుంటోంది. దీంతో పాటు ప్రముఖుల ఆత్మకథలు చదివేందుకు చాలా మంది యువతీ, యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లిష్ లో నవలలు చదివేందుకు కాలేజీ విద్యార్థులు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మాతృభాష అయిన తెలుగు పుస్తకాలు చదివేందుకు ప్రయతి్నస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారు తెలుగు పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పాఠకులు పెరుగుతున్నారు..
1990లలో పుస్తకాలు బాగా హిట్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎంత ఆసక్తిగా ఉన్నా కూడా పుస్తకాలు చదివే వారు తక్కువయ్యారని చాలా మంది అంటుంటారు. కానీ పుస్తకాలు చదివేవారు బాగానే పెరిగారు. ఓ సినిమా బాగుంటే ఎలా చూస్తున్నారో.. మంచి కథ.. విభిన్న కథనంతో పుస్తకాలు మార్కెట్‌లోకి వస్తే కళ్లకద్దుకుని చదివే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకం దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. నిజ జీవితంలో జరిగే ఉదంతాలనే ఆసక్తిగా రాస్తే పుస్తకాలు చదువుతారని ఆ పుస్తక రచయిత నిరూపించారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పుస్తకాలు చదివిన తర్వాత చాలా మంది ఏదైనా మంచి పుస్తకం ఉంటే చెప్పండి బ్రదర్ అని తెలిసిన వారిని ఇప్పటి యువతీ, యువకులు అడుగుతున్న సందర్భాలు కోకొల్లలు.
రచయితలుగానూ రాణిస్తూ..
ఇటీవలి కాలంలో పుస్తకాలు రాసేందుకు కూడా యువత ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా మాతృభాషపై మమకారంతో తమకు సాధ్యమైనంత వరకూ రచనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు హాబీగా ఖాళీ సమయాల్లో రచనలు చేస్తుండగా.. కొందరు మాత్రం రచనను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. మంచి కథతో వస్తే పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం పెరగడంతో, మంచి కథలు రాసేందుకు ప్రయతి్నస్తున్నారు. అందరికీ పుస్తకాలు అచ్చు వేయించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న కథలు రాస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఇలా రాస్తూ.. రాస్తూ.. పుస్తకాలు ప్రచురించేసి, ఆదరణ పొందుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక, పుస్తకాలు, సోషల్ మీడియాలో రాస్తూ సినిమాల్లో గేయ రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా కూడా వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు.
వెలకట్టలేని అనుభూతి..
పుస్తక పఠనం ఎప్పటికీ వన్నె తరగనిది. సామాజిక మాధ్యమాలు తాత్కాలికమే. పుస్తకాలు చదివితే ఏదో వెలకట్టలేని అనుభూతి కలుగుతుంది. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేసుకునే బదులు మంచి పుస్తకం చదివితే కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్లమవుతాం.
– డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, రచయిత
అవినాభావ సంబంధం
చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాయడం అలవాటు. తెలుగుపై మమకారంతో తెలుగులో పీజీ చేశాను. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం– స్త్రీ జీవన చిత్రణ అనే అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నాను. పుస్తక పఠనంతో భాషను మెరుగుపరుచుకోవచ్చు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఆసక్తిగా ఉంటాయి.
– పెద్దపల్లి తేజస్వి, పరిశోధక విద్యారి్థని, ఓయూ
బంగారు భవితకు బాట..
పుస్తక పఠనం యువత బంగారు భవితకు బాటలు వేస్తుంది. సాహిత్య పఠనం ద్వారా సామాజిక స్పృహ కలుగుతుంది. పుస్తకం చదువుతుంటే ఎంతో మందితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం, ఏకాగ్రత, ఓర్పు, సహనం పెరుగుతుంది.
– రావెళ్ల రవీంద్ర, యువ రచయిత
Comments
Please login to add a commentAdd a comment