నట్టింటి నుంచి.. నెట్టింటికి.. | latest trends in wedding | Sakshi
Sakshi News home page

నట్టింటి నుంచి.. నెట్టింటికి..

Published Mon, Nov 25 2024 7:02 AM | Last Updated on Mon, Nov 25 2024 7:05 AM

latest trends in wedding

నెట్టింట్లో పెళ్లి చూపుల వీడియోలు హల్‌చల్‌

ప్రతి ఘట్టాన్ని జ్ఞాపకంగా మార్చేందుకు ఆసక్తి  

ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న యువత  

నూతన వధూవరులకు లైకులు, కామెంట్లు, షేర్లు  

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. అని సినీ గేయ రచయిత ఆత్రేయ పాట అందరికీ తెలిసిందే.. అయితే ఆ పాటలో చెప్పిన విధంగా పెళ్లివారి నట్టింట్లో అచ్చం అలాంటి సందడే కొనసాగేది. అయితే ప్రస్తుతం ట్రెండ్‌ మారింది.. పెళ్లి సందడి నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి చేరింది. దీంతో రకరకాల ఆధునిక పోకడలు ఈ తతంగంలో కనిపిస్తున్నాయి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదేరా బ్రదర్‌ అని మరో కవి అన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అయ్యే విధంగా తతంగం నడుస్తోంది. పెళ్లిచూపులు, ఎంగేజ్‌మెంట్, ప్రీ వెడ్డింగ్‌ మొదలు, పెళ్లి అనంతరం జరిగే తతంగాల వరకూ అన్నీ సోషల్‌ వేదికగా షేర్‌ చేసుకుంటున్నారు. పెళ్లిలో నేటి ఆధునిక పోకడలపైనే ఈ కథనం..  

నేటి తరానికి ప్రతిదీ సెలబ్రేషనే.. సామాజిక మాధ్యమాల్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా చేసుకుంటున్నారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి ప్రీవెడ్డింగ్, పెళ్లి వేడుకలు, పోస్ట్‌ వెడ్డింగ్, సీమంతం ఇలా ఒక్కటేమిటి ప్రతి సందర్భాన్నీ వీడియోలు, ఫొటోలు తీసుకుని భద్రపరుచుకుంటున్నారు. తరతరాలు గుర్తుండిపోయేలా విభిన్నంగా, వినూత్నంగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి సంబంధించిన పొట్టి వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల సరికొత్త ట్రెండ్‌ వచి్చంది. అదేంటంటే.. పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ వీడియోలు తాజాగా ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.  

సంతోషాన్ని పంచుకునేందుకు.. 
ఇటీవల తమ జీవితంలో జరిగే ముఖ్యమైన అంశాలను ప్రపంచంతో పంచుకోవడం అలవాటైంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోల రూపంలో పెడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపులకు సంబంధించిన అంశాలను చాలా గోప్యంగా ఉంచేవారు. అంతా సెట్‌ అయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టాన్నీ గుర్తుంచుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు కారు దిగిన దగ్గరి నుంచి పెళ్లి చూపులు జరుగుతున్న తతంగం మొత్తాన్నీ వీడియోలు తీసుకుంటున్నారు. అటు పెళ్లి కొడుకు, ఇటు పెళ్లి కూతురు నవ్వుతూ సిగ్గు పడుతుంటే అదో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి కూతురు తరపు వాళ్లు, పెళ్లి కొడుకు తరపు బంధువులు ఈ సందర్భంగా సరదాగా జరిపే మాటామంతీ కూడా సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. కొందరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ సంభాషణలను ఆధారంగా చేసుకుని ఎన్నో ఫన్నీ వీడియోలు తీస్తూ నవ్వులు పూయిస్తున్నారు.  

కామెంట్ల వెల్లువ.. 
పెళ్లి చూపులకు సంబంధించిన వీడియోలను చక్కగా ఎడిటింగ్‌ చేసి, సూటయ్యే పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్‌చేసి అప్‌లోడ్‌ చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ తరహా వీడియోలు తెగ పాపులర్‌గా ఉండేవి. ఇటీవల కాలంలోనే మన దగ్గర కూడా ఇలా పెళ్లి చూపుల వీడియోలు తీసి ఇన్‌స్ట్రాగామ్‌ వంటి వేదికల్లో పోస్టు చేస్తున్నారు. దీంతో మన దగ్గర కూడా ఈ రీల్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఈ రీల్స్‌ చూసిన వీక్షకులు కూడా నూతన వధూవరులకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. పెళ్లి కాని యువతీ, యువకులు మాత్రం ఈ వీడియోలను చూస్తుంటే ‘పెళ్లి చేసుకుంటే బాగుండూ అనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతూ నవ్వులు పూయిస్తున్నారు. మొత్తానికీ ఈ ఏడాది పెళ్లి చూపుల వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. 

జాగ్రత్త అంటున్న నిపుణులు.. 
ఇటీవల చాలావరకూ ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్టు వెడ్డింగ్, బేబీ బంప్‌ వీడియోలు షూట్‌ చేసుకోవడం కామన్‌గా మారిపోయింది. అయితే ఏదైనా కానీ మితి మీరనంత వరకే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోషల్‌ మీడియా మోజులో పడి అతిగా ప్రవర్తిస్తే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. గతంలో సెన్సేషన్‌ కోసమో.. వినూత్నంగా, విభిన్నంగా చేయాలనే ఉద్దేశంతోనో వెరైటీగా షూటింగ్స్‌ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న వారూ లేకపోలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లోని ఫొటోలు, వీడియోలు నేటి టెక్నాలజీ కారణంగా మిస్‌ యూజ్‌ అయిన సందర్భాలనూ చూస్తూనే ఉన్నాం..  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement