సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని ఆయన నిలదీశారు.
కాగా, హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై తాజాగా అసదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా?. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సంగతి ఏంటి?. అక్కడ నిర్మించిన ఆఫీసులను ఏం చేయబోతున్నారు. నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా?. నెక్లెస్ రోడ్డు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది కదా?. మరి దాన్ని కూడా తవ్వేస్తారా?. గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్యాలయం కూడా నీటి కుంటలో నిర్మించినదే. మరి జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తాం. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం.
ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment