
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో వివిధ పనుల మంజూరు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం, అన్ని అంశాలపై చర్చలు జరిపే సర్వసభ్య సమావేశం..రెండూ కూడా ఈ వారంలోనే జరగనున్నాయి. ప్రతివారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ, మూడు నెలలకోమారు జరగాల్సిన సర్వసభ్య సమావేశాలు ఎన్నికల కోడ్ కారణంగా నిర్వహించలేదు. కోడ్ ముగిసిపోగానే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న రోనాల్డ్‌రాస్ రెండు వారాల సెలవుతో విదేశీ పర్యటనకు వెళ్లారు. స్టాండింగ్ కమిటీ సమావేశం ప్రతి వారం జరిగేదే కాగా, సర్వసభ్య సమావేశానికి కమిషనర్ నిర్ణయం అవసరం. దాంతో ఎన్నికల కోడ్ జూన్ మొదటి వారంలోనే ముగిసినా సమావేశ తేదీని నిర్ణయించలేదు. రోనాల్డ్‌రాస్ సెలవు నుంచి వచ్చిన రోజే ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా ఆయన జీహెచ్‌ఎంసీ నుంచి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రతివారం యథావిధిగా జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల 4వ తేదీన జరగనుండగా, 6వ తేదీన సర్వసభ్య సమావేశం జరగనుంది.
మేయర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ..
ఈసారి సర్వసభ్య సమావేశంలో పార్టీల బలాబలాలు మారనున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం రెండు కార్పొరేటర్ సీట్లు మాత్రం గెలిచిన కాంగ్రెస్ బలం ప్రస్తుతం ఇరవైకి చేరువగా ఉంది. అంతేకాదు..గత సర్వసభ్య సమావేశం వరకు బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. గత సమావేశం వరకు బీఆర్‌ఎస్ మేయర్‌గా వ్యవహరించిన ఆమె జరగబోయే సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నేతగా వ్యవహరించనున్నారు. మేయర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, ఆ పార్టీ సభ్యులు మాత్రం బీఆర్‌ఎస్, ఎంఐఎంల కంటే తక్కువే ఉన్నారు. దీంతో సర్వసభ్య సమావేశంలో విచిత్ర సన్నివేశాలు ఆవిష్కృతమయ్యే అవకాశముంది. మొన్నటి వరకు నగరంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్న బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు.. జరగబోయే సమావేశంలో పనులు జరగడం లేదని, ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు. అలాగే గతంలో సమస్యలపై తీవ్ర ఆందోళనలు, నిరసనలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా వ్యవహరించనుంది. ఇక, బీజేపీ, ఎంఐఎంలు ఎప్పటిలాగే తమ వైఖరిని ప్రదర్శించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment