
ప్రధాన రహదారిలో ఉన్న ఆక్రమణల తొలగింపు
ఎనిమిది కాలనీలకు తప్పిన ట్రాఫిక్ ఇబ్బందులు
స్థానికుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న హైడ్రా
అసలే రద్దీ రహదారులు.. ఆపై ఆక్రమణలు.. వాహనచోదకుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అంతే సంగతులు. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేయగా ఏళ్లనాటి ఆక్రమణలు మాయమయ్యాయి. వాహనచోదకుల కష్టాలు తీరాయి. మొత్తానికి నిజాంపేట (Nizampet)రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) మంగళవారం నిజాంపేటలోని బాలాజీ హిల్స్, ఇందిరమ్మ కాలనీ (Indiramma Colony) ప్రధాన రహదారుల ఆక్రమణలను తొలగించింది. రోడ్లను ఆక్రమిస్తూ నిర్మించిన అపార్ట్‌మెంట్ ర్యాంపులు, మొక్కల కోసం నిర్మాణాలు, ఫెన్సింగ్‌లతోపాటు పైఅంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప మెట్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారులు, ఆయా కాలనీవాసులు చేసిన ఫిర్యాదులకు హైడ్రా స్పందించింది.
ఇందిరమ్మ కాలనీలో రహదారిని పలువురు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు గదులు నిర్మించుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కారణంగా వెంకటరాయనగర్, బాలాజీ కాలనీ, కేఎన్‌ఆర్ కాలనీ, కొలను తులసిరెడ్డి (కేటీఆర్) కాలనీసహా ఎనిమిది కాలనీలకు రాకపోకలు సాగించే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనిపై విచారణ చేసిన హైడ్రా అధికారులు ఆయా ఆక్రమణలను తొలగించాలని యజమానులకు రెండు నెలలు గడువు ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో మంగళవారం నిజాంపేట మున్సిపల్ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టారు. పలుచోట్ల రహదారి ఆక్రమణల్ని తొలగించారు. దాదాపు కిలోమీటరుకుపైగా ఉన్న ఆక్రమణలు కూల్చేశారు.
కూల్చివేతలతో ఉద్రిక్తత
నిజాంపేట్ ఇందిరమ్మ ఫేజ్ –2 కాలనీలో మంగళవారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తంగా మారాయి. పలువురు స్థానికులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్ల ముందున్న నిర్మాణాలను ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. చిన్న, చిన్న నివాసాలతోపాటు, వ్యాపారాలు చేసుకునే తమ నిర్మాణాల్లో ఉన్న సామాన్లు సైతం తరలించేందుకు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. లక్షలాది రూపాయల సామాన్లు పాడయ్యాయని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమపై ఎందుకు కక్ష కట్టిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తుందని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తమ కుటుంబాలనే ఛిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాం
ఈ రహదారుల ఆక్రమణలపై దాదాపు రెండున్నర ఏళ్లుగా పోరాడుతున్నాం. ఆక్రమణలను తొలగించాలని కోర్టు తీర్పు కూడా ఉంది. మున్సిపాలిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా ప్రయోజనం లేకపోయింది. హైడ్రాను ఆశ్రయించిన వెంటనే విచారణ చేపట్టి రెండు నెలల క్రితం సంబంధీకులకు నోటీసులు ఇచ్చారు. ఎవరూ స్పందించకపోవడంతో హైడ్రా కూల్చేసింది.
– చిరంజీవి, బాలాజీ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం
ఈ ఆక్రమణల కారణంగా చాలా ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం. వాటర్ ట్యాంకర్లు కూడా ఈ మార్గంలో వచ్చే పరిస్థితి లేదు. స్కూల్ వ్యాన్లు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో పిల్లలు నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్తున్నారు. హైడ్రా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించారు.
– విజయ్, బాలాజీ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి
చదవండి: ఇక RRR వరకు హైదరాబాద్ నగరమే!
Comments
Please login to add a commentAdd a comment