వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతోనే అక్క‌డికి వెళ్లాం | hydra commissioner ranganath clarification on khajaguda demolitions | Sakshi
Sakshi News home page

ఖాజాగూడ కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్‌

Published Thu, Jan 2 2025 5:51 PM | Last Updated on Thu, Jan 2 2025 7:08 PM

hydra commissioner ranganath clarification on khajaguda demolitions

స్థానికుల ఫిర్యాదులతోనే క్షేత్రస్థాయిలోకి వెళ్లాం

నోటీసులు ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించలేదు 

ఆ తర్వాతే కూల్చివేతలు మొదలుపెట్టాం

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వివరణ 

సాక్షి, హైద‌రాబాద్‌: ఖాజాగూడ– నానక్‌రామ్‌గూడ ప్రధాన రహదారిలోని భగీరథమ్మ కుంట, తౌతానికుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో మంగళవారం చేపట్టిన కూల్చివేతలపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ (AV Ranganath) వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి బుధవారం ప్రకటన విడుదల చేశారు. అందులోకి అంశాలివి... ఆ రెండు జలవనరుల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లు ఆక్రమణకు గురికావడంతో పరిసర ప్రాంతాల్లో తరచు నీరు నిలిచిపోతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా హైడ్రా అధికారులు, స్థానిక మున్సిపల్, రెవెన్యూ విభాగాలతో కలిసి రెండుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎనిమిదేళ్ల క్రితమే తౌతానికుంట ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లకు (Buffer Zone) సంబంధించిన తుది నోటిఫికేషన్, భగీరథమ్మ కుంటకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ వెలువడ్డాయి.

శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైడ్రా (Hydraa) ప్రధాన కార్యాలయంలో అక్కడి దుకాణాలు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, శిఖం పట్టాదారులతో సమావేశం జరిగింది. ఆక్రమణల్ని గూగుల్‌ ఎర్త్‌ ద్వారా ప్రదర్శించారు. కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ ఏసీఈ కార్ప్‌ గ్రూప్‌ ఇటీవలే శిఖం పట్టాదారు మేకల అంజయ్య తదితరుల నుంచి ఏడు ఎకరాలకు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకుంది. హైడ్రా ఇక్కడ కూల్చివేతలను పూర్తి చేసిన తర్వాత, ఆ కంపెనీనే శిఖం పట్టాదారుల పేరుతో హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిష‌న్‌ దాఖలు చేసింది. శనివారం నాటి సమావేశానికి ఏసీఈ కార్ప్‌ గ్రూప్‌ యజమానులు కూడా హాజరయ్యారు’ అని తెలిపారు.

నిర్మాణ సామగ్రిని డంప్‌ చేస్తున్న కంపెనీలు 
‘భగీరథమ్మ కుంట శిఖం పట్టాదారులు బఫర్‌ జోన్‌లో దుకాణాలు నడుపుతూ చెరువును నిర్మాణ శిథిలాలతో నింపుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో అక్కడ నిర్మాణ సామగ్రిని డంప్‌ చేస్తున్న కొన్ని టిప్పర్లను హైడ్రా బృందాలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. భగీరథమ్మ చెరువును ఆక్రమించినందుకు రాయదుర్గం(Rayadurgam) పోలీసుస్టేషన్‌లో సంధ్యా కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు దాని యజమాని శ్రీధర్‌ రావు, టిప్పర్‌ ఆపరేటర్లపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 

హైడ్రా గతవారం ఆక్రమణదారులతో సమావేశాలు నిర్వహించి, ఖాళీ చేయాలని, ఆక్రమణలు కూల్చివేస్తామని స్పష్టం చేసి, మూడు నాలుగు రోజుల గడువు ఇచ్చింది. అయినా ఎవరూ స్థలాలను, ఆక్రమణలను ఖాళీ చేయకపోవడంతో సోమవారం 24 గంటల సమయం ఇస్తూ నోటీసులు జారీ చేసింది. అయిన్పటికీ ఖాళీ చేయకపోవడంతో మంగళవారం కూల్చివేతలు చేపట్టింది’ అని రంగనాథ్‌ పేర్కొన్నారు.

చ‌ద‌వండి: డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో యువకుడు, యువతికి విభిన్నమైన బెయిల్‌ 

వైన్‌షాప్‌ కూల్చకపోవడంపై వివరణ 
ఖాజాగూడలోని చెరువు బఫర్‌ జోన్‌లో ఉన్న వైన్‌షాప్‌ను కూల్చకపోవడంపైనా రంగనాథ్‌ వివరణ ఇచ్చారు. అది ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ప్రాంగణమని, కొన్ని రోజుల్లో దాన్ని మరోచోటుకు మార్చేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖను కోరామని పేర్కొన్నారు. ఆ షాప్‌నకు అనుబంధంగా ఉన్న సిట్టింగ్, డైనింగ్‌ ఏరియా, రెస్టారెంట్, పాన్‌షాప్‌లను కూల్చేశామని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement