
హిడెన్ యాప్‌లతో పొంచి ఉన్న ముప్పు
జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న సైబర్ నిపుణులు.. కొద్దిపాటి చిట్కాలతో గుర్తించే వీలుందని సూచన
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్‌తో అనుసంధామైన స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్టే.. అలాగే మన స్మార్ట్‌ఫోన్‌లోకి రహస్య నిఘా (హిడెన్ స్పై) యాప్‌లు ప్రవేశిస్తే మన కదలికలను ఒక వేగు వెంటాడుతున్నట్టే.. అందుకే ‘మీ ఫోన్‌లో వైరస్ ఉందా..!’అని చెక్ చేసుకోమని చెబుతున్నారు సైబర్ భద్రత నిపుణులు.
స్పైవేర్ యాప్ మీ ఫోన్‌లోకి చొరబడితే అది మీ పూర్తి డేటాను రహస్యంగా సేకరించి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. స్పైవేర్ యాప్‌లను గుర్తించడం కూడా కష్టమేనని అంటున్నారు. అవి చూడడానికి సాధారణ గేమింగ్ యాప్‌ల మాదిరిగా ఐకాన్‌తో కొన్ని ఉంటాయని, మరికొన్ని మనకు కనిపించకుండానే తెరవెనుక రన్ అవుతుంటాయని చెబుతున్నారు.
ప్రధాన అనర్థాలు ఇవీ
డేటా ట్రాన్స్‌మిషన్: మీ ఫోన్‌లోని కీలక సమాచారాన్ని మీ అనుమతి లేకుండా థర్డ్‌పార్టీకి (హ్యాకర్లు, ప్రకటనదారులు, హానికరమైన సంస్థలకు) ఎప్పటికప్పుడు పంపుతాయి.
ఫోన్ పనితీరులోనూ సమస్యలు: స్పైవేర్ చేరిన తర్వాత అది మీ ఫోన్ వేగాన్ని తగ్గించవచ్చు. తరచూ ఫోన్ వేడెక్కడం.. బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అవడం జరుగుతుంది.
ప్రైవసీ పోతుంది: ఫోన్‌లోకి వైరస్ చేరితే ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఆర్థిక వివరాలు వంటి వ్యక్తిగత డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది. మన వ్యక్తిగత సమాచారం, వీడియోలు.. ఫొటోలతో ఐడెంటిటీ థెఫ్ట్‌తోపాటు ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీల సమాచారం తెలిస్తే ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు.
అనధికార యాక్సెస్: స్పైవేర్ మీ ఫోన్‌ను అనధికారికంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. మరిన్ని మాల్వేర్‌లను
ఇన్‌స్టాల్ చేయడానికి, మీ ఫోన్ కెమెరా, మైక్‌ను యాక్సెస్ చేయడానికి లేదా యాప్‌లను మార్చటానికి సైబర్‌నేరగాళ్లకు వీలు కల్పిస్తుంది.
ఫోన్ మన కంట్రోల్ తప్పుతుంది: ఫోన్‌లో యాప్‌లు వాటంతట అవే తెరవడం లేదా మూసివేయబడడం. మనకు
తెలియకుండానే ఇతర నంబర్లకు టెక్స్ట్ మెసేజ్‌లు పంపడం. వింత పాప్–అప్‌లు వస్తుండడం మీరు గమనించవచ్చు.
ఫోన్‌లోకి స్పైవేర్, వైరస్‌లు ఎలా వస్తాయి?
అవగాహన లేకుండా చేసే పనులతో మనమే మన ఫోన్‌లోకి వైరస్‌లను ఆహ్వానిస్తున్నామని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు మనం అనధికారిక మూలాల నుంచి (థర్డ్‌పార్టీ లింక్‌ల నుంచి) అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడంతో వైరస్ చేరవచ్చు.
ఈ– మెయిల్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం ద్వారా కూడా హిడెన్ యాప్‌లు మన ఫోన్లలోకి వచ్చే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలోని హానికరమైన లింకులను క్లిక్ చేసినా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఫోన్ వైరస్ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి?
» గుర్తింపు పొందిన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఫోన్‌ను స్కాన్ చేసుకోవాలి.
» ఫోన్‌ను ఎప్పటికప్పడు అప్‌డేట్ చేయడంతో సెక్యూరిటీ ప్యాచ్‌అప్‌లు, నూతన సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయి. దీని వల్ల వైరస్‌లను అడ్డుకోవచ్చు.
» మీరు ఉపయోగించని, అనుమానాస్పద యాప్‌లను వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయండి
» ఏవైనా యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి నమ్మదగిన స్టోర్స్ నుంచే యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ రేటింగ్, రివ్యూలు తప్పక పరిశీలించాలి.
» టు ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను వినియోగించాలి.