
భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్రమోదీ, జార్జియా మెలోనీ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆమె ఆత్మకతకు ముందు మాట రాశారు. అందులో ఇటలీ ప్రధాని మెలోని జీవితం ఎప్పుడూ రాజకీయాలు, అధికారం గురించి కాదు అంటూ పలు ఆసక్తి కర విషయాలు వెల్లండించారు. ఒకరి ఆత్మకథలో ముందుమాట ఇంత అద్భుతంగా ఉంటుందా అనేలా..మెలోని గురించి చాలా చక్కగా వివరించారు ప్రధాని మోదీ. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!
‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపల్స్(I Am Giorgia — My Roots, My Principles)’ పేరిట రాసిన మెలోనీ ఆత్మకథ ఇండియన్ ఎడిషన్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. దీనిని ‘హర్ మన్‌కీ బాత్’ అని అభివర్ణించిన ప్రధాని మోదీ.. ముందుమాట రాశారు. అది తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘పీఎం మెలోనీ జీవితం, నాయకత్వం అధికారం గురించి కాదని అన్నారు. నిశితంగా చూస్తే అడగడుగున ధైర్యం దృఢనిశ్చయం ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రస్పుటంగా కనిపిస్తాయని చెప్పారు.
నాయకురాలిగా ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకమైనదని అన్నారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడూ కూడా రాజకీయ విశ్లేషకులు సందేహాస్పదంగా ఉన్నారు. అయితే ఆమె నాయకురాలిగా తన బలం, స్థిరత్వాన్ని అందించారన్నారు. అంతేగాదు ఎల్లప్పుడూ ప్రపంచ వేదికపై ఇటలీ ప్రయోజనాలను అద్భుతమైన స్పష్టతతో వినిపించింది. ఆమె ఎదుగుదల, నాయకత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అయితే తాను భారతీయ సంప్రదాయంలో అనే రూపాల్లో గౌరవించబడుతున్న దైవిక స్త్రీ శక్తి, నారీ శక్తి భావనలతో సరిపోలుస్తానన్నారు.
ప్రధాని మెలోనీ ప్రపంచం వేదికపై తన దేశాన్ని నడిపిస్తూ..తన మూలలను మరవలేదు. అందుకే ఆమె రాజకీయ ప్రస్థానం భారతదేశంతో లోతుగా ప్రతిధ్వనిస్తుందని అన్నారు. రోమ్లోని ఓ సాదాసీదా పొరుగు ప్రాంతం నుంచి ఇటలీ అత్యున్నత రాజకీయ పదవిని అధిరోహించేంత వరకు సాగిన రాజకీయ ప్రస్థానం...ఆమె శక్తిని హైలెట్ చేస్తోంది. అంతేగాదు మాతృత్వం, జాతీయ గుర్తింపు, సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశ్యం తదితరాలు భారత పాఠకులతో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు.
అలాగే ప్రపంచంతో నిమగ్నమవుతూనే సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడానికి పడుతున్న ఆరాటం, తపన.. ఆమె వ్యక్తిగత నమ్మకాలు, విలువలకు నిదర్శనమని అన్నారు. పైగా ఆమెకు ప్రజల పట్ల ఉన్న అపారమైన కరుణ, బాధ్యత తోపాటు శాంతిమార్గంలో నడిపించాలనే ఆలోచనలు ఈ పుస్తకం అంతటా ప్రతిధ్వనిస్తాయి అని రాసుకొచ్చారు మోదీ.
వాస్తవానికి ఈ బుక్ అసలు వెర్షన్ 2021లోనే పబ్లిష్ అయి, బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. అప్పుడు మెలోనీ (Giorgia Meloni) విపక్షంలో ఉన్నారు. 2025, జూన్‌లో దీనిని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ముందుమాట రాశారు.
కాగా.. మోదీ, మెలోనీలు దిగిన ఫొటోలు ఎప్పుడూ నెట్టింట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సు సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని మెలోని ఎక్స్‌లో షేర్ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అప్పటినుంచి ఈ #Melodi పదం ట్రెండ్ అయ్యింది.