‘కాలమేగా కరిగింది’ మూవీ రివ్యూ | Kalamega Karigindi Movie Review And Rating In Telugu, Check Star Cast, Storyline And Other Highlights In Film | Sakshi
Sakshi News home page

Kalamega Karigindi Movie Review: ఇంగ్లీష్‌ పదాలే లేని పొయెటిక్‌ లవ్‌స్టోరీ!

Published Sat, Mar 22 2025 12:31 PM | Last Updated on Sat, Mar 22 2025 1:13 PM

Kalamega Karigindi Movie Review And Rating In Telugu

ఇండియన్‌ సినిమాల్లో లవ్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జోనర్. టాలీవుడ్‌లో అయితే ప్రేమ కథలకు కొదవే లేదు. స్వచ్ఛమైన ప్రేమ కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలా స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘కాలమే కరిగింది’ (Kalamega Karigindi Telugu Movie Review). ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మించారు. శింగర మోహన్ దర్శకత్వం వహించిన ఈ పొయెటిక్ లవ్ స్టోరీ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఫణి(వినయ్ కుమార్/ అరవింద్(చిన్నప్పటి పాత్ర) ఉన్నత చదువు చదివి బాగా సెట్‌ అయినా లైఫ్‌లో ఏదో తెలియని వెలితి ఉంటుంది. తన తొలి ప్రేమ గుర్తుకు వచ్చి.. ప్రియురాలి బిందు((శ్రావణి/నోమిన తార(చిన్నప్పటి పాత్ర)) కోసం సొంత ఊరికి బయలుదేరుతాడు. వీరిద్దరి మధ్య టెన్త్‌ క్లాస్‌ టైమ్‌లోనే ప్రేమ చిగురిస్తుంది. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. అయితే ఓ కారణంగా వీరిద్దరు దూరం అవుతారు. లైఫ్‌లో సెటిల్‌ అయిన తర్వాత ఫణి.. తొలి ప్రేమ జ్ఞాపకాలు వెతుక్కుంటూ  ఊరికి వస్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? అప్పటికే బిందుకి పెళ్లి అయిందా లేదా ఫణి కోసం అలాగే ఉండిపోయిందా? అసలు వీరిద్దరు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు కలిశారా లేదా? అనేది తెలియాలంటే  సినిమా చూడాల్సిందే. 

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా కథంతా స్కూల్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది.  దర్శకుడు శింగర మోహన్  ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్‌ కొత్తదేమి కాదు. కానీ అ‍ప్పటి  ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా మలిచి  సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే.. ఈ సినిమాలో సారీ, థ్యాంక్స్‌ మినహా ఎక్కడా ఇంగ్లీష్‌ పదాలనే వాడలేదు. సంభాషణలు అన్ని పొయెటిక్‌గానే ఉంటాయి. ఈ సినిమాకు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఆయువుపట్టులా నిలిచాయి. సంగీత దర్శకుడు తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలను ప్రాణం పోశాడు. 

అయితే, కమర్షియల్‌ ఫార్మట్‌కి దూరంగా ఉండడం..  సినిమా మొత్తం నెమ్మదిగా సాగడం.. స్కూల్‌ ఎపిసోడ్‌లో కొన్ని సీన్లను తిప్పి తిప్పి చూపించడం ఈ సినిమాకు మైనస్‌. హీరోహీరోయిన్ల సంభాషణలు కూడా కవితాత్మకంగా ఉండడం వాస్తవికంగా అనిపించదు.  

ఫస్టాఫ్‌లోబిందు, ఫణిల లవ్‌స్టోరీ చూపించి.. సెకండాఫ్‌లో వాళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది చూపించారు. బిందు, ఫణి కలుస్తారా లేదా? బిందుకి పెళ్లి అయిందా లేదా? అనేది చివరి వరకు చూపించకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచారు.  స్లోనెరేషన్‌తో అప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ప్రీక్లైమాక్స్‌ ఉంటుంది.  పొయెటిక్‌ లవ్‌స్టోరీలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ( Kalamega Karigindi Review )

ఎవరెలా చేశారంటే...
ఈ సినిమా మొత్తం బిందు, ఫణి పాత్రల చుట్టే తిరుగుతుంది. మధ్యలో ఒకటి రెండు పాత్రలు వచ్చి వెళ్తాయి అంతే. బాల్యంలో ఫణి బిందు క్యారెక్లర్లను అరవింద్, నోమిన తార పోషించారు. పెద్దయ్యాక ఆ పాత్రల్లో వినయ్‌ కుమార్‌, శ్రావణి మజ్జరి కనిపిస్తారు. స్కూల్‌ లవ్‌స్టోరీకే ఎక్కువ ప్రాధన్యత ఉంటుంది. ఆయా పాత్రల్లో అరవింద్‌, నోమిన చక్కగా నటించారు. వినయ్‌ కుమార్‌ కూడా సెటిల్‌గా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నీకల్‌ విషయాలకొస్తే.. ముందు చెప్పినట్లు ఈ సినిమాకు ప్రధాన బలం గుడప్పన్ నేపథ్య సంగీతం. చాలా సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. 

వినీతి పబ్బతి సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. సీన్లను చాలా సహజత్వంగా చిత్రీకరించారు. ఎడిటర్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో చాలా రిపీటెడ్‌ సీన్లు ఉన్నాయి. వాటిని కట్‌ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement