
టైటిల్: షణ్ముఖ
నటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ తదితరులు
దర్శకత్వం: షణ్ముగం సప్పని
నిర్మాతలు: తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని
నిర్మాణ సంస్థ: సాప్‌బ్రో ప్రొడక్షన్స్
సంగీతం: రవి బస్రూర్
విడుదల తేదీ: మార్చి 21, 2025
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. మరోసారి డిఫరెంట్ స్టోరీతో అభిమానుల ముందుకొచ్చారు. గతంలో ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా చేసిన ఆది సాయికుమార్.. టాప్ గేర్ తర్వాత గేర్ మార్చాడు. వరసగా క్రైమ్, యాక్షన్ జోనర్‌తో అభిమానులను మెప్పిస్తున్నారు. సీఎస్‌ఐ సనాతన్ క్రైమ్ థ్రిల్లర్ తర్వాత ఆది హీరోగా నటించిన మరో యాక్షన్ అండ్ డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ'. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
షణ్ముఖ కథేంటంటే..
చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్‌లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్‌లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.
ఎలా ఉందంటే..
మనదేశంలో మూఢ నమ్మకాలు, క్షుద్రపూజలను నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తమ స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే పాయింట్‌ను కథగా ప్రేక్షకుల ముందుకొచ్చారు డైరెక్టర్ షణ్ముగం. గతంలోనూ ఇలాంటి జోనర్‌లో ఎన్నో సినిమాలు వచ్చినా ఈ స్టోరీని కాస్తా భిన్నంగా చూపించారు. కథను అడవుల్లో మొదలుపెట్టిన షణ్ముగం.. చివరికీ అడవుల్లోనే ముగించాడు. ఫస్ట్ హాఫ్ అంతా రోటీన్‌గా అనిపిస్తుంది. అద్భుతమైన ఫైట్ సీన్‌తో ఆది సాయి కుమార్‌ను ప్రేక్షకులను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత జరిగే సీన్స్ ప్రేక్షకులకు ఊహకందేలా ఉంటాయి. ఆది సాయికుమార్, అవికా గోర్ లవ్ స్టోరీ కూడా అంతగా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు. మొదటి భాగం అంతా ఇన్‌స్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు. అక్కడక్కడ కృష్ణుడు(సుబ్రమణ్యం)తో వచ్చే కామెడీ సీన్స్ కాస్తా నవ్వించినా అంతగా మెప్పించలేదు. కార్తీ, సారాల ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్ ట్విస్ట్‌లతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.
సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ మొత్తం సారా, కార్తీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్ ట్విస్ట్‌లతో ఆడియన్స్‌లో కాస్తా కన్‌ఫ్జూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కొన్ని చోట్ల సీరియస్‌గా కథ సాగుతున్న సమయంలో కామెడీని తీసుకొచ్చి ప్రేక్షకుల్లో కనెక్షన్ మిస్సయ్యేలా చేశాడు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మంచిదే.. కానీ తెరపై ఆవిష్కరించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. లాజిక్ పరంగా ఆలోచిస్తే కొన్ని చోట్ల సన్నివేశాల్లోనూ అది పూర్తిగా మిస్సయినట్లు కనిపించింది. కొన్ని సీన్స్ ఆడియన్స్ ఊహకందేలా ఉండడంతో కథనంలో క్యూరియాసిటీ మిస్సయింది. కథను మరింత ఆసక్తిగా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. క్లైమాక్స్ సీన్‌లో వచ్చే ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కాసేపు కట్టిపడేశాడు. కానీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్‌తో కథలో సీరియస్‌నెస్ అలాగే కొనసాగించలేకపోయాడు. ఓవరాల్‌గా దర్శకుడు తాను చెప్పాలనుకున్నా సందేశం మంచిదే అయినప్పటికీ.. కథనం, స్క్రీన్‌ప్లేపై మరింత ఫోకస్ చేసుంటే ఇంకా బాగుండేది.
ఎవరలా చేశారంటే..
ఆది సాయికుమార్ ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. పోలీస్‌గా తన అగ్రెసివ్‌నెస్ చూపించాడు. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ తెరపై కొత్తగా కనిపించింది. అయినప్పటికీ తన నటనతో మెప్పించింది. ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని కృష్ణుడు, అరియానా గ్లోరీ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్ఆర్ విష్ణు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎంఏ మాలిక్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
-మధుసూధన్, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment