ఆరోగ్యకరమైన బరువు... ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నట్టు... శరీర బరువు వయసు, ఎత్తుకు తగ్గట్టుగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మధుమేహం, గుండెజబ్బులు, కొన్ని రకాల కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గించుకునేంఉదకు ఇది అవసరం.

రోజుకు కనీసం 30 నిమిషాలు ఏదో ఒక రకమైన వ్యాయామం చేయండి. ఈ శారీరక శ్రమ గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని రకాల కేన్సర్ల వంటి వ్యాధుల వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

ధూమపానం మానేయడం అవసరం. ఏ వయసులో మానేసినా... మానేసిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగు పడటం ప్రారంభమవుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పొగపీల్చడం వల్ల గుండెజబ్బులు, కేన్సర్లు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయన్నది తెలిసిన విషయమే.

పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలతోపాటు ఆరోగ్యవంతమైన ప్రొటీన్లు, తృణధాన్యాలతో నిండిన సమ తుల ఆహారం ఆరోగ్యానికి చాలా కీలకం. బాగా శుద్ధి చేసిన లేదా మరపట్టిన ఆహారం, చక్కెరలు అనారోగ్య హేతువులు.

శరీరానికి మద్యం అస్సలు పడదు. అందువల్ల వీలైతే మానేయండి. లేదంటే అతితక్కువకు పరిమితం చేయండి. మద్యపానాన్ని దీర్ఘకాలం కొనసాగించడం వల్ల కాలేయ వ్యాధి, హృదయ సంబంధ సమస్యలు మాత్రమే కాదు.. కేన్సర్ల వంటి ప్రమాదకర వ్యాధులను ఆహ్వానించినట్లు అవుతుంది.

రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కోవడం శరీరానికి ఏమంత మంచి చేసే పని కాదని గుర్తించండి. తగినంత నిద్ర లేకపోతే అది మీ మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, వైద్యంపై ప్రభావం చూపుతుందని గుర్తించండి.

‘‘చికిత్స కంటే నివారణ మేలు’’ అన్నది అక్షర సత్యం. ఇందుకోసమే ఒక వయసు వచ్చిన తరువాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల సమస్యలను ముందస్తుగా గుర్తించడం సాధ్యమవుతుంది. అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ వంటివి ఎలాంటి లక్షణాలూ చూపవు కానీ.. ఆకస్మత్తుగా ప్రాణాంతక సమస్యలకు కారణమవుతాయి.

దీర్ఘకాలిక ఒత్తిడి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ధ్యానం, యోగా, ఏదో ఒక ఇష్టమైన వ్యాపకం, సంగీతం వంటి అనేక పద్ధతుల ద్వారా ఒత్తిడిని జయించడం కష్టమేమీ కాదు.

మనసులు ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుకునేందుకు, కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించండి. చదవడం, పజిల్స్ పరిష్కరించడం మెదడుకు పదును పెట్టే పనులు చేయడం వల్ల మీ మేధోశక్తి క్షీణించే అవకాశాలు తగ్గుతాయి. వృద్ధాప్యంలోనూ శరీర కదలికలు చురుకుగా ఉంటాయి.