WTC Final : లెజెండ్‌తో నేను సిద్ధంగా ఉన్నా

WTC:Dinesh Karthik Shares Selfie With Sunil Gavaskar Ready For Commentary - Sakshi

లండన్‌: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. జూన్‌ 18  నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా జరగనున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా కార్తీక్‌ వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లండన్‌ చేరుకున్న అతను క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నాడు. ఆటగాడిగా కొనసాగుతూనే కామెంటేటరీ చేయనున్న కార్తీక్‌ చిరస్మరణీయ మ్యాచ్‌ను గొప్పగా మలుచుకోనున్నాడు.

జట్టులో ఆటగాడిగా లేకున్నా.. కామెంటేటరీ రూపంలో చారిత్రాత్మక మ్యాచ్‌లో భాగమయ్యే అవకాశం దక్కించుకున్నాడు. తాజాగా లండన్‌ వీధుల్లో చక్కర్లు కొట్టిన కార్తీక్‌ లెజెండరీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌తో కలిసి దిగిన ఒక సెల్ఫీని  తన ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నాడు. '' లాంచ్‌ డేట్‌ విత్‌ లెజెండ్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. దీనిని బట్టి చూస్తే ఈ ఇద్దరు క్వారంటైన్‌ పీరియడ్‌ను కంప్లీట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ కంటే ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడిన టెస్టు సిరీస్‌కు కార్తీక్‌ కామెంటేటర్‌గా వ్యవహరించాడు.. కానీ ఇంట్లో నుంచి వర్చువల్‌ రూపంలో కామెంటరీ చేశాడు. తాజాగా సౌతాంప్టన్‌ వేదికగా జరగనున్న చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ను మాత్రం మైదానం నుంచే కామెంటరీ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇక కేకేఆర్‌ తరపున ఆడుతున్న కార్తీక్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ముగియగానే సెప్టెంబర్‌ 19 నుంచి మూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ మిగిలిన మ్యాచ్‌లను ఆడనున్నాడు. మరోవైపు టీమిండియా కివీస్‌తో టెస్టు చాంపియన్‌షిప్‌ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. అనంతరం ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పాల్గొనడానికి యూఏఈ వెళ్లనుంది.
చదవండి: చారిత్రక మ్యాచ్‌కు అంపైర్లు ఖరారు.. జాబితాలో ఐరన్‌ లెగ్‌ అంపైర్‌

WTC: 13 ఏళ్ల క్రితం సెమీస్‌లో.. ఇప్పుడు ఫైనల్‌లో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top