ఏపీ బీజేపీ లిస్ట్‌.. ఊహించినట్టే వాళ్లకు మొండిచేయి

BJP Declares List Of 10 Candidates For Andhra Pradesh Assembly Elections - Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా తాము తీసుకున్న మొత్తం 10 స్థానాలకు అభ్యర్థులను బుధవారం సాయంత్రం ప్రకటించింది.  తొలి నుంచి ఊహించినట్లే అసలైన బీజేపీ నేతలకు మొండి చేయి ఇచ్చింది అధిష్టానం.

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు మాధవ్‌, విష్ణువర్ధన్‌రెడ్డిలకు అసెంబ్లీ టికెట్లు దక్కలేదు.  యువమోర్చా మాజీ జాతీయ కార్యదర్శి సురేష్‌కు నిరాశే ఎదురైంది. అయితే.. నిన్న బీజేపీలో చేరిన టీడీపీ నేత రోషన్‌కు బద్వేల్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ లభించింది. సుజనా చౌదరి, రోషన్‌లకు టికెట్లు దక్కడంతో.. ఇక్కడా టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయం చూపించారని సీనియర్లు వాపోతున్నారు.

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా..

  • అరకు - పంగి రాజారావు
  • అనపర్తి- ఎమ్‌. శివకృష్ణం రాజు
  • విజయవాడ వెస్ట్‌- సుజనా చౌదరి
  • ఎచ్చర్ల. ఎన్‌ఈశ్వర్‌ రావు 
  • కైకలూరు - కామినేని శ్రీనివాసరావు
  • జమ్మల మడుగు- ఆదినారాయణ రెడ్డి
  • ఆదోని- పీవీ పార్థసారథి
  • ధర్మవరం - వై.సత్యకుమార్‌ 
  •  బద్వేల్‌ -బొజ్జ రోషన్న 
  • విశాఖ నార్త్‌-విష్ణుకుమార్‌రాజు
     


ఏపీ బీజేపీ జాబితాపై అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తున్నాయి. మొదటి నుంచి ఉన్నవాళ్లకు అన్యాయం జరిగిందనే మాట వినిపిస్తోంది. సీనియర్లతో పాటు నాగోతు రమేష్‌నాయుడు, వల్లూరి జయప్రకాశ్‌, వరదాపురంలకు కూడా టికెట్‌ దక్కలేదు. నాలుగు ఓట్లు లేనివాళ్లకు సీట్లు ఇచ్చిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పలువురు. బద్వేల్‌ టికెట్‌ దక్కించుకున్న రోషన్‌ మీటింగ్‌లో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఆయనొక్కడే బీజేపీ కండువా వేసుకుంటాడు. ఈ ఒక నెల బీజేపీ కండువా కప్పుకుని ప్రచారం చేస్తారు.  ఆ తర్వాత ఎప్పటిలాగే  తెలుగుదేశం నాయకుల ఉందాం’’ అంటూ బహిరంగంగానే వాళ్లు వ్యాఖ్యానించడం గమనార్హం.

జనసేనకు షాక్‌
విజయవాడ వెస్ట్‌లో టికెట్‌ ఆశించిన పోతిన మహేష్‌కు షాక్‌ తగిలింది. బీజేపీకి టికెట్‌ వెళ్తుందనే ప్రచారం నడిచినప్పటికీ.. పవన్‌పై నమ్మకంతో టికెట్‌ తనకే వస్తుందని మహేష్‌ నమ్మకంగా ఉన్నారు. ఈ క్రమంలో రిలే దీక్షలు చేస్తూ వస్తున్నారు. అయినా మహేష్‌కు మొండిచేయి మిగిలింది. దీంతో ఆయన రెబల్‌గా పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది.

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top