అక్రమ మద్యం, గంజాయిపై నిఘా పెంచండి: కేఎస్‌ జవహర్‌రెడ్డి

KS Jawahar Increase surveillance on illegal liquor and marijuana - Sakshi

అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపండి  

వీటిని సరఫరా చేసే వారిని గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేయండి

ఆపరేషన్‌ పరివర్తన్‌ ద్వారా గంజాయి సాగును నియంత్రించి.. ప్రత్యామ్నాయం చూపాలి

అధికారులకు సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీస్‌ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అక్రమ మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపేందుకు సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో సమన్వయం చేసుకోండి. వీటితో సంబంధం ఉన్న కింగ్‌ పిన్‌లను గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేయండి. రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులలో నిఘాను మరింత పటిష్టం చేయండి. 

ముఖ్యంగా గంజాయి సాగు చేసే గిరిజనులను ఆపరేషన్‌ పరివర్తన్‌ కింద ప్రత్యామ్నయ పంటల సాగు వైపు ప్రోత్సహించండి. ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వచ్చే అవకాశాలున్నందున సరిహద్దులతో పాటు రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టుల్లో నిఘాను అధికం చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోండి’ అని ఆదేశించారు. ఎస్‌ఈబీ కమిషనర్‌ యం.రవిప్రకాశ్‌ మాట్లాడుతూ.. గంజాయికి సంబంధించి 90 శాతం ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా నుంచి.. 10 శాతం కోరాపుట్‌ నుంచి ఏపీలోకి వస్తోందని తెలిపారు.

ఒడిశా డీజీపీ సమన్వయంతో గంజాయి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి 25 మంది కింగ్‌ పిన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.4.38 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మద్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రంలోని ప్రతి డిస్టిలరీకి ఒక సహాయ కమిషనర్‌ స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా పెట్టామని చెప్పారు. మద్యం రవాణా చేసే వాహనాలను జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అధికారులు దేవకుమార్, వాసుదేవరావు, రజత్‌ భార్గవ, డా.మల్లిఖార్జున, ఢిల్లీ రావు, రవిశంకర్‌ అయ్యన్నార్, కాంతిరాణా టాటా, విజయ సునీత, రవి సుభాష్, తుహిన్‌ సిన్హా, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దు 
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) డా.కేఎస్‌.జవహర్‌రెడ్డి ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ‘నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయండి. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి.

ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు.. ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి. తాగునీటి సరఫరా విధానాన్ని పర్యవేక్షించేందుకు రూపొందించిన యాప్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి’ అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 9 జిల్లాల్లో తాగునీటికి ఇబ్బంది లేదని కలెక్టర్లు నివేదించినట్లు చెప్పారు. మిగిలిన 17 జిల్లాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నింపేందుకు అవసరమైన నీటిని కాలువల ద్వారా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రూపొందించిన యాప్‌ను శుక్రవారం అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామ స్థాయిలోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సంబంధిత ఇంజనీర్‌ ఆమోదంతో ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా డిమాండ్‌ను యాప్‌లో అప్‌లోడ్‌ చేసి జిల్లా కలెక్టర్‌ ద్వారా పంపిస్తే ఆమోదిస్తామని తెలిపారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్‌ఎస్‌ రావత్, కేవీవీ సత్యనారాయణ, నారాయణరెడ్డి, జాన్‌ సత్యరాజ్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు. 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top