భారత కంపెనీలకూ గడ్డు కాలమే.. కారణాలు..

Accenture Guidance Cut Likely To Weigh On Indian IT Sector - Sakshi

అంతర్జాతీయ అనిశ్చితులు, కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, బ్యాంకింగ్‌ వంటి ప్రధాన రంగాల్లోని సంస్థలు టెక్నాలజీ ఆధారిత సేవలపై చేసే ఖర్చును తగ్గించుకోవడంతో ఐటీ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతాయని కొన్ని రేటింగ్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్‌ తన భవిష్యత్తు ఆదాయంలో వృద్ధి 1-3 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 2-5 శాతంగా ఉంది. 

ఈ నేపథ్యంలోనే భారతీయ ఐటీ సంస్థల ఆదాయ  వృద్ధిపైనా అనుమానాలు రేకెత్తాయి. ఫలితంగానే దేశీయ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో తదితర కంపెనీల షేర్లు ఇటీవల 1-3% నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% తగ్గింది. టెక్నాలజీ సూచీలు నెల వ్యవధిలో 9% క్షీణించింది. యాక్సెంచర్‌ తన ఆదాయ అంచనాలను తక్కువకు సవరించడం వల్లే, స్వల్పకాలంలో దేశీయ ఐటీ  షేర్లకు ఒత్తిడి ఎదురవుతోంది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగించే అమెరికా కంపెనీ తాజా నిర్ణయంతో దేశీయ ఐటీ కంపెనీల్లోనూ అదే ధోరణి ఉంటుందని మార్కెట్‌ భావిస్తున్నట్లు తెలిసింది.

పలు రంగాల సంస్థలు అంతగా ముఖ్యం కాని స్వల్పకాలిక ప్రాజెక్టులను పక్కన పెడుతున్నాయని యాక్సెంచర్‌ తన ఆదాయ అంచనాల నివేదికలో పేర్కొంది.  ఇలాంటి ప్రాజెక్టులను చేస్తున్న విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఎంఫసిస్‌, ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థలకూ సమీప భవిష్యత్తులో ఇబ్బందులుండే అవకాశాలున్నాయని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కంపెనీల విచక్షణ ఆధారిత పెట్టుబడి, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పెరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్‌

యాక్సెంచర్‌ సైతం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంపై ఆశాజనకంగానే ఉంది. ఫలితంగా దేశీయ ఐటీ సంస్థలకూ అప్పుడు కాస్త అనుకూల పరిస్థితులు నెలకొనచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top