పాలీక్యాబ్‌ లాభం రూ.416 కోట్లు

Polycab Profit is Rs 416 Crores - Sakshi

ఆదాయం రూ.4,340 కోట్లు

న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ల తయారీ సంస్థ పాలీక్యాబ్‌ ఇండియా డిసెంబర్‌ త్రైమాసికంలో పనితీరు పరంగా ఫర్వాలేదనిపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 15 శాతం వృద్ధితో రూ.416 కోట్లకు చేరింది. త్రైమాసిక వారీ లాభంలో ఇది మూడో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. 

పన్ను అనంతర లాభాల మార్జిన్‌ 9.6 శాతంగా ఉంది. ఆదాయం 17 శాతం పెరిగి రూ.4,340 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.361 కోట్లు, ఆదాయం రూ.3,715 కోట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం వ్యయాలు 18 శాతం పెరిగి రూ.3,865 కోట్లకు చేరాయి. వైర్లు, కేబుళ్ల విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.3,904 కోట్లుగా ఉంది. ఫాస్ట్‌ మూవింగ్‌ ఎలక్ట్రిక్‌ గూడ్స్‌ అమ్మకాల ఆదాయం 13.4 శాతం పెరిగి రూ.296 కోట్లుగా ఉంది. ఈపీసీ విభాగం ఆదాయం రెట్టింపై రూ.247 కోట్లకు చేరింది. 

గత నెల కంపెనీకి చెందిన పలు ప్రాంగణాలు, ప్లాంట్‌లు, కొందరు ఉద్యోగుల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని, ఆ సమయంలో పూర్తి సహకారం అందించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ సోదాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆదాయపన్ను శాఖ నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది. బీఎస్‌ఈలో పాలీక్యాబ్‌ షేరు పెద్దగా మార్పు లేకుండా రూ.4,431 వద్ద క్లోజ్‌ అయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top