Delhi liquor scam: అమెరికా జోక్యంపై అభ్యంతరం

Delhi liquor scam: India summons US diplomat over state dept remarks on Kejriwal arrest - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది దేశ అంతర్గత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని స్పష్టంచేసింది. బుధవారం ఢిల్లీలో అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన అసంతృప్తిని తెలియజేసింది. భారత్‌లో అమెరికా మహిళా దౌత్యవేత్త, యాక్టింగ్‌ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీచేసింది. దీంతో బుధవారం ఆమె ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు.

విదేశాంగ శాఖ అధికారులతో దాదాపు 30 నిమిషాలు సమావేశమయ్యారు. ‘స్వేచ్ఛగా, పారదర్శకంగా, వేగవంతంగా, చట్టపరంగా న్యాయం పొందే అర్హత సీఎం కేజ్రీవాల్‌కు ఉంది’ అని మంగళవారం అమెరికా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. భారత న్యాయప్రక్రియపై అమెరికా వ్యాఖ్యలను తప్పుబడుతూ భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘దౌత్య సంబంధాలకు సంబంధించి దేశాలు తోటి దేశాల సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాలకు గౌరవం ఇవ్వాలి.

తోటి ప్రజాస్వామ్య దేశాల పట్ల ఇదే బాధ్యతతో మెలగాలి. బాధ్యత విస్మరిస్తే బాగుండదు. భారత్‌లో న్యాయవ్యవస్థ స్వతంత్రమైంది. సత్వర న్యాయమే దాని అంతిమ లక్ష్యం. దానిపై ఇతరుల అభిప్రాయాలు అవాంఛనీయం’’ అని ఆ ప్రకటనలో భారత్‌ తన అసంతృప్తిని తెలిపింది. కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై వ్యాఖ్యలు చేసిన జర్మనీ దౌత్యవేత్త, డెప్యూటీ చీఫ్‌ మిషన్‌కు ఇటీవల భారత్‌ సమన్లు జారీచేసిన నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటనే జరగడం గమనార్హం.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top