రెండో దశలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ: ఈ రాష్ట్రాల్లో టఫ్‌ ఫైట్‌..

Second Phase Lok Sabha Polls Filing Of Nominations Begins Today - Sakshi

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో దశలో పోలింగ్‌ జరిగే రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక 12 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 26న రెండోదశ పోలింగ్ జరుగుతుందని ఈసీ పేర్కొంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. 

రెండో దశలో అసోం, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, జమ్మూ కశ్మీర్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ ఐదో తేదీన జరగనుండగా, జమ్మూ కాశ్మీర్‌లో ఏప్రిల్ ఆరో తేదీన జరుగుతుంది. 

అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించేందుకు చివరి తేదీ ఏప్రిల్‌ 8. ఇక, ఏప్రిల్‌ 26వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. జూన్‌ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక రెండో దశలోనే హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోని ఔటర్ మణిపూర్ స్థానంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి ఎన్నికలు మొదటి దశలోనే పూర్తి కానుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 19న ఇన్నర్‌ మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. 

ఇక, రెండో దశలోనే బెంగాల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో, అందరి దృష్టి బెంగాల్‌ రాజకీయాలపైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్‌ ఉండే అవకాశం ఉంది. కేరళలో కూడా త్రిముఖ పోటీ ఉండనుంది. 

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top